కవితా స్రవంతి

కవిత్వమంటే

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
9032844017

కవిత్వమంటే…
దుఃఖాన్ని ఒంపుకోవడమే కాదు
గుండెలోని తడిని చెలెమెగా మార్చడం

కవిత్వమంటే…
అక్షరాలను వెలిగించడమే కాదు
అజ్ఞానాంధకారాన్ని నిత్యం తొలగించడం

కవిత్వమంటే…
రుగ్మతలను దుమ్ముదులపడమే కాదు
దురాచారాలను కలవాలంతో దునుమాడడం

కవిత్వమంటే…
కన్నీటిచుక్కలును ఓదార్చడమే కాదు
హృదయవేదన బరువును దించుకోవడం

కవిత్వమంటే…
ఆత్మీయలతలను అల్లడమే కాదు
మానవతా తోరణాలను వెలిగించడం

కవిత్వమంటే…
అలజడుల సముద్రమేమి కాదు
అలలా పోటెత్తే కెరటాలను ముద్దాడడం

కవిత్వమంటే…
అనుబంధాలను మోయడమే కాదు
ఆపన్నహస్తమై సమాజాన్ని ఆదుకోవడం

కవితాపూదోటలో విరిసిన
అక్షరాలు ఎప్పుడూ
మానవతను ప్రభోదించే
చైతన్య గీతికలే అవుతాయి
జ్ఞానజ్యోతిని వెలిగించే
విజ్ఞాన దీపికలే అవుతాయి

అవును
కవిత్వమంటే…
వాస్తవాన్ని కళ్ళకద్దుకొని కావలించుకోవడం
కాలాన్ని నిత్యం మనోనేత్రంతో చిత్రికపట్టడం

కవిత్వమంటే…
అన్యాయాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని రగిలించడం
సమానత్వాన్ని బోధించే గొంతుకగా మారడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked