కథా భారతి

తీన్ దేవియా

-రచన: కోసూరి ఉమాభారతి

జూబిలీహిల్స్ చెక్-పోస్ట్ మీదగా కారు సికింద్రాబాద్ వైపు సాగిపోతుంది. ‘తాతాచారి కాంపౌండ్’ చేరేందుకు గంటకి పైగానే పడుతుంది. వెనక్కి జారిగిల పడి కళ్ళు మూసుకున్నాను. ‘తాతాచారి కాంపౌండ్’తో నాకున్న అనుబంధం ఎక్కువే. మొట్టమొదటిసారి ఆ కాంప్లెక్స్ లో అడుగుపెట్టిన వైనం గుర్తొచ్చి నాలో ఎన్నోభావాలు మెదిలాయి.

దాదాపు పాతికేళ్ళ క్రితం మాట… ‘సౌత్ సెంట్రల్ రైల్వేస్’ కి పనిచేసే నాన్నగారి బదిలీ వల్ల… అప్పట్లో మద్రాసు నుండి సికింద్రాబాద్ వచ్చాము. సికింద్రాబాద్ లోని ‘సెయింట్ ఫ్రాన్సిస్ జునియర్ కాలేజీ’లో చేరాను. ఊరు, పరిసరాలు, కాలేజీ వాతావరణం కూడా కొత్త. నాన్నగారి బదిలీల వల్ల నాకు కలిగే ఏకైక ఇబ్బంది..ఇదే. ఇలా ఊరు మారిన ప్రతీసారి ఉన్న స్నేహితులని కోల్పవడమే. ఇక కొత్త పరిచయాలకి, స్నేహాలకి సమయం పడుతుందిగా.

పెద్దదూరం కాకపోవడంతో నాలుగు రోజులుగా కాలేజీకి నడిచే వెళ్ళొస్తున్నాను. ఐదో రోజు నాటి ఆ సంఘటన కళ్ళెదుట కదలాడింది. మొదటి కెమిస్ట్రీ లాబ్ అయ్యాక, క్లాసులు లేకపోవడంతో కాస్త పెందరాళే ఇంటికి బయలుదేరాను. నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిన కొంత నడిచాక వెనక్కి తిరిగి చూసాను. ఆమడదూరంలో బెల్-బాటమ్స్ వేసుకన్న ఇద్దరు అమ్మాయిలు కనబడ్డారు. వారితో మాట కలపాలని నడక వేగం తగ్గించాను.

మరో రెండునిముషాలు నడిచానో లేదో .. ఎవరో … వెనుక నుండి నా వోనీ చెంగుపట్టి గట్టిగా లాగడంతో నిలదొక్కుకోలేక బాధతో అరుస్తూ పక్కకి ఒరిగిపోయాను. కళ్ళు బైర్లుకమ్మాయి. నేలకొరిగేలా నా పవిట లాగిన ఆ రౌడీవెధవ … మరునిముషంలో అక్కడినుండి సైకులు మీద దూసుకుపోయాడు.

వెనుక నుండి ఇదంతా చూస్తున్న బెల్-బాటమ్స్ అమ్మాయిలు పరుగున నావద్దకు వచ్చారు… ఆ రౌడీ వెధవని
తిట్టిపోస్తూ పైకిలేవడానికి నాకు సాయంచేసారు. నాచేతులు, మోచేతులు, కాళ్ళు కూడా దోసుకుపోయి
రక్తసిక్తమయ్యాయి. మోచేతులకి తగిలిన దెబ్బలనుండి నా పసుపురంగు వోనీ పై రక్తపుమరకలు. నా దుస్థితికి
ఆ ఇద్దరమ్మాయిలు చాలా బాధపడ్డారు.

“మా ఇల్లు ఇక్కడికి చాలాదగ్గర. మా ఇంటికి వచ్చి… వోనీ మార్చుకుని, కాసేపు కూర్చుని వెళ్ళచ్చు. మీ ఇంటివరకు మేము తోడు వస్తాము.” అంటూ వారిలో ఓ అమ్మాయి నాచేయి పుచ్చుకుని మెల్లగా నడిపించసాగింది. నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఆదుకున్న వారి సహృదయత నన్ను కదిలించింది.

“మేము నిన్ను చూశాము కెమిస్ట్రీ క్లాసులో. నా పేరు కీర్తి. తన పేరు దక్ష. నీ పేరు వెన్నెల కదూ! అటెన్డెన్స్ చెప్పినప్పుడు తెలిసిందిలే. మనం క్లాస్-మేట్స్ అన్నమాట. ఎదురుగా ఉన్న ‘తాతాచారి కాంపౌండ్’లో మేము ఎదురుబదురు ఇళ్ళల్లో ఉంటాము. కలిసే కాలెజీకి వెళ్ళొస్తాము. అమ్మాయిలకి ఒక్కో మారు ఇలాటి జులాయి వెధవలతో తలనొప్పే. అందునా ఇలా ఒక్కళ్ళే నడిచే వాళ్లకి మరింత డేంజర్. ఇంతకీ మీ ఇల్లెక్కడ?” అడిగింది కీర్తి. అక్కడినుండి మా ఇంటికి మరో పదినిముషాల నడకేనని చెప్పాను.

అక్కడ ఆనాడలా పరిచయమయిన వారివురి పట్ల నా మనసులో గొప్ప స్నేహభావం ఏర్పడింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

అలా సాగుతున్న నా జ్ఞాపకాల పరంపరకి ఉన్నట్టుండి బ్రేకుపడింది. అదాట్టుగా..డ్రైవర్ కారుకి వేసిన బ్రేక్స్ వల్ల ఉలిక్కిపడి కళ్ళుతెరిచి చూసాను.
“ఏమయింది? రోడ్డు ఖాళీగా ఉందిగా! ఎందుకలా బ్రేక్స్ వేసావు?” అడిగాను కోపంగా.
“ఆరు చిన్న కుక్కపిల్లలు, వాటి తల్లి గబక్కున అడ్డంవచ్చాయి మేడమ్. కారులో ఎప్పుడూ బిస్కెట్లు ఉంచమంటారుగా. ఉన్నాయి మేడమ్. వాటికి పెట్టి రమ్మంటారా?” అడిగాడు డ్రైవర్.
నేను చెప్పింది గుర్తుపెట్టుకుని మూగజీవాల కోసం కారు ఆపినందుకు అతన్ని మెచ్చుకున్నాను. సంతోషంగా అనిపించింది. “కారు పక్కకి ఆపుకో. పద..నేనూ వస్తాను. ప్యాకట్లన్నీ తీసుకురా” అన్నాను.
పొద్దుటే నాచేత్తో ఆ తల్లీపిల్లలకి బిస్కెట్లు పెడుతుంటే, వాటి ఆకలి చూసి నాకు దుఃఖం ఆగలేదు. ఉన్నవన్నీ వాటికి పెట్టి, వాటిని ముద్దులాడి .. తలెత్తేప్పటికీ ఓ పెద్దాయన నా ఎదురుగా నిలబడి ఉన్నాడు. “అమ్మా అవి మావే… థాంక్స్ అమ్మా.” అంటూ వాటి మెళ్ళకి తాళ్లు కట్టనారంభించాడు.

తిరిగి కారులో బయలుదేరాను..మరో అరగంటలో తాతాచారి-కాంపౌండ్ చేరుతామన్నాడు డ్రైవర్. తిరిగి నా
ఆలోచనలు.. మా కాలేజీ జీవితం వైపు సాగాయి. కీర్తి, దక్షల పరిచయం తరువాత .. మేము ప్రాణస్నేహితుల్లా మెలగసాగాము. ముగ్గురం ఎప్పుడూ కలిసే ఉంటామని.. కాలేజీలో మమ్మల్ని ‘తీన్ దేవియా’ అనేవారు.

మా తెలుగు లెక్చరర్ మాత్రం “ఎమ్మా ముద్దుగుమ్మలు ముగ్గురూ ఆ వెనుక జేరి ఇకఇకలు పకపకలు. చదువుకోడానికి వస్తున్నారా? లేక మీ స్నేహాబంధాన్ని పెంచి పోషించడానికే కాలేజీ వేదికగా ఇక్కడ కలుస్తున్నారా? క్లాసు బయటకి వెళ్లి కబుర్లు చెప్పుకోండి.” అంటూ తిట్టేవారు.

అలా మా ఐదేళ్ళ కాలేజీ జీవితం సందడిగా, సరదాగా గడిచింది. కాలేజీకి వచ్చేప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు కూడా నాకు తాతాచారి-కాంపౌండ్ మజిలీ తప్పనిసరి అయింది. దక్ష వాళ్ళమ్మగారు నాకు రకరకాల తూర్పు గోదావరి వంటకాలు రుచి చూపించేవారు. కీర్తి వాళ్ళమ్మగారు నాకు ఇష్టమని జంతికలు, పకోడీలు చేసి పెట్టేవారు. మా కుటుంబాల నడుమ కూడా స్నేహం ఏర్పడింది.

కీర్తి, దక్షలతో బలపడిన నా స్నేహబంధానికే కాదు, ఆనంద్ గారి వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తతో ముడిపడిన నా వివాహబంధానికి కూడా ‘తాతాచారి కాంపౌండ్’ వేదికగా నిలిచిందన్నది నిజం. అక్కడ జరిగిన ఓ పెళ్లిలో నన్ను చూసి, వరించి ఆనంద్ నాకు ప్రపోజ్ చేశారన్న విషయం అప్పట్లో …మరి లోకవిదితమే!

డిగ్రీ చదువులు ముగుస్తూనే ఆరునెలలు అటుఇటుగా మా వివాహాలు జరిగాయి. నేను.. డిల్లీలో, కీర్తి కూకట్పల్లిలో స్థిరపడ్డాము. దక్ష మాత్రం తతాచారీ-కాంపౌండులోనే ఉండిపోయింది. ఒక్కతే బిడ్డ అవడంతో…
అమ్మకానికి ఉన్న పక్కిల్లు కొనేసి కూతుర్ని, అల్లుణ్ణి ఆఇంట కాపురం పెట్టించారు దక్ష తల్లితండ్రులు.

మా పెళ్ళిళ్ళయిన ఐదేళ్లవరకు కొత్తజీవితాలు, సంసారాలతో ముగ్గురం ఒకింత తీరికలేకుండా అయ్యాము. ఒకరి విషయాలు ఒకరం తెలుసుకుంటూనే ఉన్నా కలవలేకపోయాము. ఆ ఐదేళ్ళల్లో దక్షకి ఓ కొడుకు ఓ కూతురు పుట్టారు.

పాప పుట్టాక… ఓ రోజు ఫోన్ చేసినప్పుడు, అసలు మాట్లాడలేక పోయింది దక్ష. మళ్ళీ చేస్తానని పెట్టేసింది. నిర్మొహమాటంగా వెరపు లేకుండా మాట్లాడే దక్షలో వచ్చిన మార్పు నాకు అంతుపట్టలేదు.

సాయంత్రమయ్యాక దక్ష నుండి ఫోన్ కాల్. “సారీ వెన్నెల.. పొద్దున్న నీతో మాట్లాడలేదు. పక్కనే హాల్లో .. మా
అమ్మా, అత్తమ్మల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఏమి చెప్పను.. మా జీవితాల్లో ఇరువైపుల పెద్దవాళ్ళ ప్రమేయం ఎక్కువే అని నీకు తెలుసు కదా! పిల్లల పెంపకం, ఆస్తుల అమ్మకాలు, రోజూవారీ వంటలు, పండుగలు, ఆచారాలు ఒకటేమిటి… అన్నింటా వారి మాట ఉండాల్సిందే.. నెగ్గాల్సిందే.. ఊపిరి బిగబట్టుకుని బతుకుతున్నాను. నాకూ మా ఆయనకీ అప్పుడప్పుడు తగువులు కూడా. ఏమిటో ఈ బతుకు విసుగ్గా ఉంటుంది.” అని వాపోయింది.

ఇక కీర్తి, వేణులకి కూడా ఇద్దరు మగపిల్లలు. రెండోవాడు శారీరిక, మానసిక వైకల్యంతో పుట్టాడని బాధపడేది. “చూడు కీర్తి, నీవు వాడిని పెద్దవాడితో పోల్చి చూడ్డం మానేసి, వాడి పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో ఆలోచించు. నేను కూడా కొంత పరిశోధిస్తాను. అంతే కానీ అసంతృప్తితో బాధపడుతూ ఉంటే పిల్లవాడి భవిష్యత్తు ఏమి కావాలి? ఓ తల్లిగా అర్ధం చేసుకుని ముందుకు సాగు తల్లీ.” అని చెప్పి కొంతవరకు తన మనసుని మళ్ళించాను కూడా.

నా విషయానికి వస్తే… నాలోగాని, మావారిలో గాని లోపం లేకపోయినా మాకు సంతానం కలగలేదన్న బాధ నాది. సమస్యని పూర్తిగా అర్ధం చేసుకున్న అత్తగారి అండదండలు ఉండడం నా అదృష్టమే. పిల్లల్ని దత్తత తీసుకునే నిర్ణయం కూడా… ఆవిడ మాకే వదిలేసారు. మేము మాత్రం మామయ్యగారి పేరిట స్థాపించిన ‘శ్రీరామా చారిటబిల్ ట్రస్ట్’ తరఫున దేశ నలుమూలలా మూగజీవులకి ‘అభయారణ్యాలు’ స్థాపించి, వెనుకబడ్డ గ్రామాల్లోని ‘ప్రత్యేక అవసరాలు’ ఉన్న బాలబాలికలకు వైద్య సహాయక కార్యక్రమాలు చేపట్టి, అప్పుడే పదిహేను సంవత్సరాలుగా సంతృప్తికరంగా నిర్వహిస్తున్నాము. రెండు కార్యక్రమాలకి ఈ మధ్యనే ప్రభుత్వ గుర్తింపు కూడా లభించడం గర్వకారణమయింది. నేను, ఆనంద్, నెలకి పదిరోజులు ట్రస్ట్ కార్యక్రమాల విషయంగా ప్రయాణాలు చేస్తుంటాము.
*******
పెళ్ళిళ్ళయి స్థిరప్పడ్డ ఐదేళ్ల తరువాత మాత్రం.. స్నేహితులం ముగ్గురం కలిసి ఓమంచి నిర్ణయం తీసుకున్నాము. వ్యక్తిగతంగా ఏదెలా ఉన్నా, తప్పనిసరిగా ప్రతియేడు ఒకదగ్గర కలవాలన్నదే… మేము చేసుకున్న బాస. పద్దెనిమిదేళ్ళగా ఆచరిస్తున్నాము కూడా. ఫోన్లు, కంప్యూటర్లు ఉన్నా అందరం కలిసి గడపగల సమయం మాకు ఎంతో విలువైనదిగా భావిస్తాము. ఓ వారంరోజుల పాటు కష్టనష్టాలు, సాధకబాధకాలు బేరీజువేసుకుని…సలహాలు సందేహాలు పంచుకుంటాము.
స్నేహితురాళ్ళతో బాంధవ్యాలని నిలుపుకోవాలన్న ప్రయత్నాన్ని మా వారు హర్షించారు. “దక్షకి మితిమీరిన ఇంటిబాధ్యతలు, కీర్తికి చిన్నకొడుకు సమీర్ బాధ్యతలు ఉన్నాయి కదా. వారు ఊరు వదలి డిల్లీ రావడం కష్టతరమే. నీవే హైదారాబాదు వెళ్లడం కరెక్ట్. ప్రతియేడు ఆ వారం రోజులూ జూబిలీ హిల్స్ లోని మన గెస్ట్-హౌజ్ లో బస చేయండి. మీకక్కడ అన్ని వసతులు ఉన్నాయి కూడాగా.” అని ప్రోత్సహించారు ఆనంద్.
ప్రతిఏడు ఆగస్టులో కీర్తి చిన్నకొడుకు సమీర్ కూడా మాతో ఉండేలా ఏర్పాట్లు చేసి..స్నేహితురాళ్ళని మా బంగాళాకే పిలుచుకుంటాను. వారం రోజుల పాటైనా కీర్తి, దక్ష, సమీర్ నా అతిధులుగా ఆనందంగా గడిపేస్తాము.

 ********

ఈ తడవ మేము కలిసి గడపబోయే వారాంరోజుల్లో, ఇవాళ మొదటి రోజు… ముందుగా తాతాచారి కాంపాండ్ కి వెళ్లే దారిలో ఉన్నాను. అలలా సాగుతున్న జ్ఞాపకాల స్రవంతికి, నా సెల్-ఫోన్ మోగడంతో మరోమారు బ్రేక్ పడింది.
అటునుండి కీర్తి… ”వెన్నెలా, నేను దారిలో ఉన్నాను. ఐదునిముషాల్లో దక్షావాళ్ళింటికి వచ్చేస్తాను.” అంది.
“నేనూ ఓ పదినిముషాల్లో అక్కడ ఉంటాను” అన్నాను.
“నీకో విషయం చెప్పాలి వెన్నెలా. దక్ష కొడుకు రంజిత్ కోర్టుకేసుల సంగతి తెలుసు కదా! ఒక కేసులో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందట. దాంతో పాపం అది బాగా కృంగిపోయింది. ఇకపోతే, వాళ్ళఅత్తగారు ఇప్పుడు దక్షవాళ్ళ వద్దనే ఉంటుంది. ఆవిడికి కాస్త నోటివాటం ఎక్కువేగా. ఇప్పుడైతే అసలు భరించలేము. వయసుమీరినా ఆమెలో మార్పు లేదు. సరేలే.. మేమిక దగ్గరిలోనే ఉన్నాము.” అంటూ ఫోన్ పెట్టేసింది.

దక్ష పరిస్థితి విన్నాక మనసంతా పాడయిపోయింది. వాళ్ళబ్బాయి రంజిత్.. ఓ యువతిపై అత్యాచారం కేసులో రెండేళ్ల క్రితం అరస్ట్ అయ్యాడు. ఇరవైయేళ్ళకే విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి తాగుడు, డ్రగ్స్, అమ్మాయిలు .. అన్ని దురలవాట్లకి బానిసవడంతో చిక్కుల్లో పడిపోయాడు. దక్ష, వాళ్ళాయన శ్రీధర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. న్యాయవాదులు, కోర్ట్లు అంటూ తిరుగుతూనే ఉన్నారు. లక్షల్లో ఖర్చులు, మనక్షోభ.

********

దక్ష వాళ్ళింట అడుగు పెట్టగానే, అప్పటికే అక్కడికి చేరిన కీర్తి ఎదురొచ్చింది. ఆమె పక్కనే ఉన్న ఇరవైరెండేళ్ళ సమీర్ మాటలు కూడబలుక్కుని “హలో ఆంటీ” అంటూ దగ్గరికొచ్చాడు. మునుపుకంటే కాస్త తేటగానే కనిపించాడు.
ఇంతలో లోపలినుండి దక్ష పరుగున వచ్చింది. నాచేతుల్లో వాలిపోయి భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆమెని సముదాయించి సోఫాలో కూర్చోబెట్టాము.
ఒకింత తేరుకున్నాక, “రంజిత్ కేసులో తదుపరి వాయిదా లోగా మరో క్రిమినల్ లాయర్ని కూడా పెట్టాము వెన్నెలా. రంజిత్ ఆ నేరం చేయలేదన్న ప్రతివాదనలో కొత్తసాక్షాలని చేర్చితే…గుడ్డిలో మెల్లలా శిక్షలు తగ్గునేమో అని ఆశ కలిగిస్తున్నాడు ఈ లాయర్.” అంటూ వాపోయింది.
“కానీయ్ మరి. మన ప్రయత్నాలు మనం చేయాలికదా! ఇంతకీ మీనాన్నగారు, శ్రీధర్ గారు ఎలా ఉన్నారు? కనబడలేదే?” వాకబు చేసాను.
“అమ్మపేరిట ఉన్న పొలాల విషయంగా వరంగల్ వెళ్ళారు. రెండురోజుల్లో వచ్చేస్తారు.” అంది. క్షణమాగాక గబక్కున పైకిలేచింది. “అయ్యో..మాటల్లోపడి మర్చేపోయాను.. నీకు కాఫీ, టిఫిన్ ఏర్పాటు చూస్తాను.” వంటింటివైపు కదిలింది.
అవన్నీ పూర్తిచేసుకునే వచ్చానని చెప్పడంతో తిరిగొచ్చి కుదురుగా కూర్చుంది. నాలుగేళ్లక్రితం పరమపదించిన దక్ష అమ్మగారిని, గుంటూరులోని వృద్ధాశ్రమంలో ఉన్న కీర్తి అమ్మానాన్నల్ని, రెండేళ్ళ క్రితం మా నాన్నగారు పోయాక, అన్నయ్య వద్ద అమెరికాలో ఉంటున్న అమ్మని తలుచుకున్నాము.

“ఇదిగో.. ఊళ్ళేనే ఉన్నా… కీర్తిని చూసి కూడా ఆరునెల్లయింది. సమీర్ కోసమంటూ మొదలుపెట్టిన ‘ప్రగతి’ స్కూలుకి ఈమధ్య ప్రభుత్వం వారి గుర్తింపు రావడంతో, తీరికలేకుండా అయిపోయింది తనకి.” అంది కీర్తి గురించి దక్ష.
“విన్నాను. ఓ రకంగా మంచిదే. సమీర్ మెరుగుపడ్డమే కాదు. సమీర్ వంటి ఎందరికో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడమనేది నిజానికి కీర్తి చేస్తున్న గొప్ప సామాజికసేవ. తన ఆలోచన, పట్టుదల చూస్తే గర్వంగా, ఆనందంగా ఉంది.” అన్నాను.
‘ప్రగతి’కి బాట వేసి, నామకరణం చేసి.. మాఈ ప్రయాణంలో వెన్నుదన్నులుగా మీరంతా ఉండడం అదృష్టం కదా!” అన్నది తడయిన కళ్ళతో కీర్తి.
“మనం ఒకరికి ఒకరం స్పూర్తిదాయకులమే.” అంది దక్ష పక్కనే ఉన్న కీర్తి భుజంపై చేయివేసి.
“అంతేకదా మరి.. మొత్తానికి సంతోషంగా ఉంది. క్షణం వృధాచేయకుండా బంగళాకి బయలుదేరుదాం. మీ భర్తలు కూడా వారి వీలునిబట్టి ఆప్పుడప్పుడు వచ్చి భోంచేసి వెళతారుగా. ఇక మన కార్యక్రమాలు యధాతధంగా సాగుతాయి. ఓ గంటసేపు రోజూ యోగా చేద్దాం. టీచర్ వస్తుంది. బోలెడన్ని పూలమొక్కలు కూరగాయమొక్కలు తెప్పించాను. అన్నీ నాటుదాం. సమీర్ కోసం కూడా నాలుగు గంటల సేపు ఓ టీచర్ వస్తుంది. వ్యాయామం, ఆటలు, చదువు.. అన్నీ చేయిస్తుంది. ఇకపోతే, సమస్యలు, చికాకులు మరిచి కాస్త షాపింగ్, ఒకటీ అరా సినిమాలు చూసి కొంతైనా ప్రశాంతత పొందాలి.” అన్నాను.
“నేను కూడా సినిమా చూస్తా.” అన్నాడు బిగ్గరగా సమీర్.
“తప్పకుండా.” అన్నాను వాడితో.
“ఇంతకీ మీ అత్తమ్మ ఎక్కడ? ఇక్కడే ఉన్నారంటగా. పెద్దామె ఆరోగ్యం బాగానే ఉంటుందా?” అడిగాను దక్షని..
“మీరు వస్తున్నారని పనిమనిషి చేత నలుగు పెట్టించుకుని తలస్నానం చేస్తున్నారు. ఆరోగ్యంగానే ఉన్నారు. డెబ్బైఆరేళ్ళ మనిషంటే ఎవరూ నమ్మరు.” అని దక్ష అంటుండగానే హాల్లోకి వచ్చిందావిడ.

లేచి నమస్కరించాను. నిజంగానే ఆ వయసుకి బాగుందామె’ అనుకున్నాను.
“అయ్యో నిలబడ్డావే? కూర్చోమ్మా. ఎలా ఉన్నావు?” అంటూ వచ్చి పక్కనే కూర్చుని, నావంక తేరిపార చూసిందామె. “ఇన్నేళ్లల్లో నన్ను అప్పుడప్పుడు కలిసినావుగా. మొత్తానికి నీలో ఈనాటికీ వన్నె తగ్గలేదు, చెక్కబొమ్మలా నాజూగ్గానే ఉన్నావు.” అంటూ పెద్దగా నవ్వి, “అయినా పిల్లాజెల్లా లేరుగా! ఇలా వీళ్ళలాగా అవ్వాల్సిన అవసరం ఏముందిలే.” అంటూ లేచివెళ్లి ఎదురుగా ఉన్న ఎత్తుకుర్చీలో కూర్చుందామె..
ఆమె మాటలకి విస్తుపోయాను..
“దక్షా..నాకు బోర్నవిటా తాగే సమయం కదా. వెళ్లి టాబ్లెట్టుతో పాటు నాకు బోర్నవీటా తెచ్చిపెట్టు.” అని దక్షని అక్కడి నుండి పంపించివేసిందామె..
దక్ష తిరిగి వచ్చేలోగా.. జూబిలీ హిల్స్ లో ఉన్న మా బంగళా విలువ ఎంత ఉంటుందని ఆరా తీస్తూ, “మీ ఆయన రిటైర్ అయ్యాక, తిరిగి హైదరాబాదుకి వస్తారటగా. మంచిదే.” మెచ్చుకొనే ధోరణిలో అంటూ దక్ష అందించిన కప్పు అందుకుందామె.
గబగబా బోర్నవీటా తాగేసి ..మళ్ళీ తన ధోరణి మాటలు మొదలుపెట్టిందామె.
“ఏమిటోనమ్మా వెన్నెలా.. మన దక్ష కూతురు గురించి.. అదే నా మనమరాలు రజని విషయం.. పెళ్లిమాట అటుంచి.. బయట ఊళ్ళో ఎవరో అబ్బాయితో సహజీవనం చేస్తుంది. ఇక రంజిత్ సంగతి నీకు తెలుసు కదా..ఏమవుతుందో ఏమో. వాడి చుట్టూ తిరిగినవాళ్ళే వాడిని నాశనం చేసారు. ఇదంతా మరి మీ దక్ష పెంపకంలోనే
తప్పా? లేక మా ఖర్మా? ఇక ఈపిల్లల మూలంగా మమ్మల్ని చుట్టాలందరూ వెలేసినట్టే ఉంది. సిగ్గుతో ముఖాలు చాటేసి కూపస్థమండూకాల్లా బతుకుతున్నాము” గుక్కతిప్పుకోకుండా ఏకరవు పెట్టిందామె.
దక్ష వంక చూసాను. నేలచూపులు చూస్తూ ఉండిపోయింది. దాని మనసు సున్నితం. అసలే కృంగిపోయిన కోడలిని ఈవిడ ఇలా ఆరడి పెట్టడం నాకు అసలు నచ్చలేదు.
కీర్తి వంక చూస్తే, ‘చెప్పానుగా’ అన్నట్టు బాధగా నవ్వింది. పెద్దావిడ వంక చూస్తే మాటల తూటాలకి రవ్వంత విశ్రాంతి ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతేనే మంచిదనిపించి పైకిలేచాను.
“మిమ్మల్ని కలవడం సంతోషం అండీ” అని ఆమెకి నమస్కరించాను.
“మరి మనం బయలుదేరదామా?” అన్నాను కీర్తి, దక్ష వాళ్ళతో..

“అయ్యో.. అప్పుడేనా? పదకుండేగా.. నీవు హైదరాబాదు రావడం, వీళ్ళు నీతోపాటు మీ బంగళాలో విశ్రాంతిగా కొన్నాళ్ళు గడపడం గురించి మాఅబ్బాయి చెప్పాడు. ఎలాగూ కొన్నాళ్ళవరకు కనబడరు కాబట్టి ఇంకాసేపు కూర్చుని, నాకు మధ్యాహ్నపు భోజనం వడ్డించాక వెళ్ళండి.” అందావిడ.
“దక్షా, ఈలోగా నిన్న చేయించిన చెక్కిరాలు, మైసూర్-పాక్ పెట్టు మీ స్నేహితురాళ్ళకి” మళ్ళీ ఆవిడే.
ఇంకెన్ని విసుర్లు విసరాలో ఆమెగారు..అనుకుంటూ.. చేసేదిలేక పక్కనేఉన్న సమీర్ తో మాటలు కలపాలని ప్రయత్నం చేయసాగాను.
ఈలోగా ట్రేలో టిఫిన్లు సర్ది తెచ్చింది దక్ష.
“మొత్తానికి, వెన్నెలా…నీవు మాత్రం అందరిలోకి అదృష్టవంతురాలివే. ఈ ‘తాతాచారీ కాంపౌండ్’లోనే ఎవరిదో పెళ్ళికొచ్చిన ఓ ఆగర్భ శ్రీమంతుడు.. ఆరోజు పందిట్లో నిన్నుచూసి వరించి..వెంటపడి మరీ పెళ్ళాడాడు కదా! అప్పటి మధ్యతరగతి అమ్మాయివి…ఈ రోజున ఖరీదైన కార్లు, ఆస్థులు, కోట్లు ఖరీదు చేసే బంగళాలకి అధికారివి” క్షణం ఆగిందామె.
ఆవిడ మాటలు వినకుండా.. నాకు తాత్కాలిక చెముడు వస్తే బాగుణ్ణు..అనుకున్నాను.
“….కానీ ఏదో శాపమే ఉంది మీ ముగ్గురు స్నేహితురాళ్ళకి. తెలిసో తెలియకో ఏదో పెద్దపాపమే చేసుంటారు” అంటూ మైసూర్-పాక్ విరిచి నోట్లో వేసుకుందామె.
నివ్వెరపోయి వింటున్నాము ఆమె మాటలని.
“అందుకే ముగ్గురికీ సంతానం విషయంలో పెద్ద శోకమే మిగిలింది. దక్ష పిల్లలిద్దరూ కన్నవారిని ఇలా క్షోభ పెడుతున్నారు. కీర్తికేమో జన్మంతా ఏడవమని .. ఇదో ఇటువంటి బిడ్డ పుట్టాడు. నీకేమో అసలు ఆడజన్మకే సార్ధకత లేకుండా పోయింది. బిడ్డలు పుట్టని నీ సంగతి ఎలా ఉన్నా .. వారసుడిని ఇవ్వలేని నిన్ను.. అసలు నీ భర్త, అత్తగారోళ్ళు ఎలా భరిస్తున్నారో..” చాలా యధాలాపంగా మనసులని తూట్లు పొడిచేలా మాటలబాణాలు వేస్తూనే
పోయిందా పెద్దావిడ.
ఆమె మాటలు వింటూ తమాయించుకోలేక పోయాను. వీలయినంత సౌమ్యంగానే తిరుగు జవాబివ్వాలని నోరువిప్పాను.
“చూడండమ్మా, దక్ష అత్తగారని మీరంటే గౌరవమే. నా విషయంలో అంటారా? కడుపున పుట్టిన వారసులు లేరని నాకు, మాకుటుంబానికి లేని బాధ మీకెందుకు లెండి. అలా నన్ను పదేపదే పిల్లలు లేరని కించపరిచిన వాళ్ళని మా అత్తమ్మైతే ఉతికి ఆరేస్తుంది..నిజం.
ఇక మీ కోడలు దక్ష, మీ సొంత కొడుకు శ్రీధర్. పిల్లల్ని వాళ్ళు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇలా జరుగుతుందని వాళ్ళుమాత్రం అనుకున్నారా? వాళ్ళైనా ఏంచేయగలరు? బిడ్డడు పాడయిపోయి తలవంపులు తేవాలని.. ఏ తల్లితండ్రులు కోరుకోరు, ఊహించరు. అలా అంతటి బాధలో ఉన్న కొడుకు,కోడలని … మా అత్తమ్మైతే కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. సముదాయిస్తుంది. అంగట్లో పెట్టి ఆరడి చేయదు. నిజం.
కీర్తి విషయానికి వస్తే, నిజానికి కడుపున మోస్తున్న బిడ్డకి జన్యుపరమైన లోపాలు సంక్రమించడానికి తల్లిబాధ్యత ఏమీ ఉండదు. అది నివారించగల శక్తి కూడా ఆమెలో ఉండదు. ఎక్కడో తాతముత్తాతల నుండి సంక్రమించే జన్యుపరమైన వ్యాధులు, సమస్యలు కొల్లలు. ఎవరూ అతీతులు కారు. ఇది నిజం.
మీరు పెద్దవారు.. జీవితంలో ఎదురీతలని అర్ధం చేసుకుని నాలుగు స్వాంతన వాక్యాలు చెబితే మా సమస్యలు కొంతైనా తేలికౌతాయి. అలాకాకుండా మీరు బాధపడి మమ్మల్ని బాధపెడితే ఉపయోగం ఉండదండీ” అంటూ … ఆగి నివ్వెరపోయి వింటున్న పెద్దామెని, కీర్తి దక్షలని ఓమారు చూసాను..
“ఇక.. మీ మనమరాలు గురించి.. మీరు గర్వపడాలి. రజని గొప్ప విద్యావంతురాలు. ఓ ఐ.టీ కంపెనీ అధినేతగా దక్షిణభారతంలోనే మంచి పేరు తెచ్చుకుంది. పోతే, ఎనిమిదేళ్ళగా రాజా అనే అతినితో సహజీవనం
చేస్తుంది. నిజమే. అతను కూడా ఓ మంచి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. పేరున్న వ్యాపారవేత్త.
కాలం మారిందండీ. ఈతరం వారి దృక్పధాలు వేరుగానే ఉన్నాయి. పిల్లలు మనం గీసినగీటు దాటకూడదు అనుకోవడం అవివేకం. మన పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చూడాలి. మనం అన్నింటా కలగజేసుకుంటే దూరమైపోతారు. వారి జీవితాలని శాసించాలని భావించకూడదు.. ఆశించకూడదు.. వారి నిర్ణయాలు వారు చేసుకోగలరు.. అదే అందరికీ శ్రేయస్కరం కూడా.
ఇక రంజిత్ విషయం అంటారా? అది మన దురదృష్టమే. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. దక్ష పెంపకంలో ఏ లోటూ లేదు. నన్ను నమ్మండి. అబ్బాయి ఎంచుకున్న దారి వాడిని అలా తీసుకుని వెళ్ళింది. దక్షకి, మీఅబ్బాయికి, మీకు ఎంతబాధో ..నాకు తెలుసును. ఈ క్లిష్ట పరిస్థితిలో మీరు ఒకరికొకరు తోడుగా ఉండాలి. మీకు మేము తోడు..నిజం.” అని ముగించి గట్టిగా ఊపిరి తీసుకున్నాను.
“పదవే దక్షా, అత్తమ్మకి భోజనం వడ్డించి, మనం బయలుదేరుదాం. రోడ్డ్లు రద్దీగా ఉంటాయి. బంగాళాకి వెళ్ళేప్పటికి మనకి ఆకలి దంచేస్తది” అంటూ దక్ష చేయిపట్టి వంటింట్లోకి దారితీశాను. మావెనుకే కీర్తి..

*********

వారంరోజులపాటు నా స్నేహితురాళ్ళతో ఆనందంగా గడిపి తిరిగి డిల్లీ చేరాను. ఇంటికి వచ్చీరాంగానే మావారికి ఇష్టమైనవన్నీ వండాను. ఆయనకిష్టమని రజనీగంధ పూలతో గది నింపేసాను. రాత్రి భోజనమయ్యాక .. తాంబూలం అందించాను.
“నీకు ‘పాన్’ ఇష్టంలేదుగా..నన్ను కూడా వద్దని నిషేధిస్తావుగా! ఏమిటి ఇవాళ విశేషం. అడగకుండానే అమ్మగారు వరమిచ్చారు. ఏమి జరిగిందేమిటి హైదారాబాదులో?” అంటూ భుజాలపై చేయివేసి దగ్గరికి తీసుకున్నారు..
“మీరు నా అదృష్టం అని గుర్తు చేసుకున్నప్పుడల్లా మీకు ఇష్టమైనవి ప్రత్యేకంగా వండిపెడుతూనే ఉన్నాను, ఇలా తాంబూలం అందిస్తూనే ఉన్నానుగా! అంత ఆశ్చర్యమేముంది?” అడిగాను అలవోకగా చూస్తూ.

****శుభం****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked