కథా భారతి

బాషా ఖూనీ

-ఆర్. శర్మ డంతుర్తి

ఉద్యోగంలో కొత్తగా చేరిన ఒరిస్సా కుర్రాడు బిభూతి పట్నాయిక్ గురించి రెండురోజుల్లో అందరికీ తెలిసిన విషయం కుర్రాడికున్న వ, బ అక్షరాలకి ఉన్న అభేధం, వాటిని ఈజీ గా, ఒక్కొక్కప్పుడు కావాలని కలిపేసి బాషని ఖూని చేయడమూను. మరో విషయం ఏవిటంటే కొన్ని పదాలని – అంటే వోల్టేజ్ స్టెబిలైజర్ అనే దానిని బోల్టేజీ స్టెబిలైజర్ గా – దీర్ఘాలతో పీకి, పీకి పలకడం. పలకడం అలా ఉంచితే కాయితం మీద వోల్టేజ్ అనేదాన్ని బి అక్షరంతో మొదలుపెట్టి బోల్టేజ్ అని రాయడం చూస్తే పక్కనే ఉన్న వినోద్ కి మతిపోయింది.

కొన్ని వారాలు పోయాక వినోద్ మాట వరసలో ఓ సారి చెప్పాడు బిభూతి తో; “ఒరే నాయనా ఒరియాలో నీ ఇష్టం వచినట్టు మాట్లాడుకో కానీ కనీసం అందరితో మాట్లాడే ఇంగ్లీషు భాషని ఖూనీ చేయకు, అవతలవాళ్ళు మరోలా అర్ధం చేసుకోవచ్చు” అని. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కాటిలో పుర్రెతో కానీ పోవని ఊరికే అనలేదు కదా? విభూతి అనే పదం భగవంతుడి విభూతి – విస్తారం చెప్పడానికి వాడినా ఆ పదాన్ని బిభూతి అని పిలుచుకునే పట్నాయిక్, అలాగే మారకుండా “వ” కి బదులు “బ” రాస్తూ, మాట్లాడుతూనే ఉన్నాడు. కొంతమంది దీనికి నవ్వుకున్నారు. కొంతమందికి చిరాకు వేసింది.

ఉత్తరోత్తరా తెలిసిన వివరాల ప్రకారం పట్నాయిక్ గారిది బరంపురం. కాస్త కూస్తో తెలుగు వచ్చినాయినే. ఎప్పుడైనా పార్టీలకి దానికీ పిలిస్తే వచ్చి తన భాషా ఖూనీతో జనాలని నవ్వించడం ఒక సరదా వ్యాపకం ఈయనకి. ఓ పార్టీలో తెలుగు పాట పాడతాను అని మైకు తీసుకుని ముందుకొచ్చాడు. గొంతుబాగానే ఉన్నట్టుంది కానీ పాడడం మాత్రం విని తీరాల్సిందే. “బొక బేణువు బినిపించెను అనురాగ దీపికా, బొక రాధిక సంధించెను నబరాగమాలికా…” జనాలని నవ్వించాడు. పాట నాశనం అవుతున్నందుకు వెక్కిరించినా పట్నాయిక్ గారి వరస మారలేదు. ప్రతీచోటా ఇలాగే పలుకుతుంటే జనానకి చిర్రెత్తుకు రాదూ?

అది అటుంచి వినోద్ ని బీ-నోద్ అనడం కూడా మామూలైపోయింది. కొన్ని నెలలు తర్వాత ఈ పట్నాయిక్ భాషా ధోరణి మార్చడానికి వినోద్ ప్రయత్నించాడు కానీ ఆయన పట్టు ఆయనదే. ఇంక లాభం లేక ఇంగ్లీష్ మాట్లాడే పధ్ధతికి ఒక క్లాసు లో చేరమని చెప్పాడు వినోద్. దానిక్కూడా ఫలితం శూన్యం. వినోద్ కి ఇంక మిగిలినది – నోరు మూసుకోవడం. సరే వీడి ఖర్మ ఎలా ఉంటే నాకెందుకంటూ వినోద్ ఊరుకున్నాడు.
మరో ఆరునెలలకి యూనిట్ లో కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకావిడ ఆస్ట్రేలియా నుంచి దిగింది ఓ నెల రోజులపాటు ట్రైనర్ గా ఉద్యోగానికి. ఆవిడ పేరు శాంద్రా కానీ వచ్చినావిడ పేరు చిన్నదిగా శాండీ. ఈ ట్రైనింగ్ మేనేజర్ గారు ఇండియా వస్తూంటే ఎవరో చెప్పారుట, దేశంలో మానభంగాలూ, మహిళల చేతులు పట్టుకోవడాలు అవీ విరివిగా జరుగుతూంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండమని. అమ్మో ఈవిడ ఊరుకుంటుందా, అసలే కరాటే నేర్చుకున్న మనిషి. వచ్చే ముందు కరాటే అదీ బాగా ప్రాక్టీస్ చేసి వచ్చింది. సుకుమారి లా కనిపించినా కరాటే దెబ్బ వేస్తే ఎముకలు విరగవూ?

ట్రైనింగ్ సగంలో ఉండగా వినోద్ కి జ్వరం తగిలింది. శెలవు తీసుకుని మూడు రోజుల తర్వాత పత్యం పట్టినప్పుడు బిభూతి పట్నాయిక్ ని హాస్పిటల్లో జేర్పించారు ఓ సారి రమ్మని ఎవరో ఉప్పందించారు. వినోద్ హాస్పిటల్ కి వెళ్ళేసరికి కుర్రాడు మంచం మీద పడి ఉన్నాడు – దవడ విరిగింది కాబోలు, ఏదో కట్టు కట్టి ఉంది. ఆశ్చర్యంగా వినోద్ అడిగేడు ‘ఏమైంది? కింద పడ్డారా?’
మాట అతి కష్టం మీద వస్తోంది నోట్లోంచి అయినా శరీరంలో శక్తులన్నీ కూడదీసుకుని చెప్పేడు. మొదటి సారీ, రెండో సారీ కూడా చెప్పాక నోట్లోంచి వచ్చే మాట అర్ధం కావడానికి మూడో సారి చెప్పించుకోవాల్సి వచ్చింది వినోద్ కి.
“లేదు మన ట్రైనింగ్ మేనేజర్ శాండీ కొట్టారు.”

“ఏవిటీ?” వినోద్ నమ్మలేక అడిగాడు. ట్రైనింగ్ మేనేజర్ ఏవిటీ, పట్నాయిక్ ని కొట్టడం ఏమిటీ? అసలు ఎవరూ మనిషి మీద చేయి చేసుకోరు కదా ఉత్తినే? ఏదో జరిగి ఉండాలి. “బీడు కానీ ఆబిడ చేయి పట్టుకోలేదు కదా?” అదే, అదే పట్నాయిక్ గారి భాషలో “వీడు కానీ ఆవిడ చేయి పట్టుకోలేదు కదా?” అదే అడిగేడు వినోద్, “ఎవరూ లేకుండా చూసి ఆవిణ్ణి కానీ ముట్టుకున్నావా?”
బుర్ర ఆడ్డంగా ఊపేడు బిభూతి లేదన్నట్టూ. దవడ నెప్పిగా ఉంది కాబోలు ప్రతీదీ రెండు మూడు సార్లు చెప్పాల్సి వస్తోంది.
“మరి ఏమైంది?”
“మీరు లేనప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ కి వెళ్ళి వచ్చాను. అప్పుడు శాండీ అడిగింది ‘లంచ్ చేసారా’ అని. “అవును చేసానని చెప్పా.”
“దానికే ఇంత దవడ విరక్కొట్టడం?” వినోద్ ఆశ్చర్యపోయేడు.
“కాదు, ఎక్కడ ఏం తిన్నారు అని అడిగింది.”
“అయితే? ఏదో ఒకటి జరక్కుండా ఆవిడ చేయి చేసుకుంటుందా?”

“శాండీ బిఛ్ అన్నాను సబ్ బే లో బెజిటేబిల్ శాండీ బిచ్ తిన్నానని చెప్పడానికి. మాట పూర్తి అయ్యేలోపులే ఆవిడ పంచ్ విసిరేసింది,” ఏడుస్తూ చెప్పేడు బిభూతి, ఎప్పటిలాగానే మొదటి పదాన్ని సాండీ అని సాగదీస్తూ విచ్ అనేదాన్ని బిచ్ అని పలుకుతూ, సాండ్-విచ్ అనే పదాన్ని ఇష్టం వచ్చినట్టూ విరక్కొడుతూ చెప్పేడు బిభూతి పట్నాయిక్.
“ఓరి దరిద్రుడా నువ్వన్న మాటకి అర్ధం తెలుసా? ఆవిడ పేరు శాండీ. ఆవిణ్ణి నువ్వు బిచ్ అని పిలిచినట్టు అయింది కదా?” వినోద్ తలకొట్టుకున్నాడు, “ఇప్పటికైనా మాట్లాడ్డం నేర్చుకో అసలే అవిడ కరాటే లో ఏదో బెల్టు సంపాదించినావిడ. నీకు కాలో చేయో విరగలేదు. మొహం పచ్చడి అవ్వనందుకు సంతోషించు.
“నేను తప్పు ఏమన్నా?” వెర్రిమొహంతో అడిగేడు బిభూతి పట్నాయిక్.
“తప్పు ఏమన్నానని అడుగుతున్నావా మళ్ళీ? శాండీ అనే మేజేజర్ ని బిచ్ అని పిలిచి? ఆత్మ గౌరవం ఉన్న ఏ మహిళ ఊరుకుంటుంది బిచ్ అని పిలిస్తే? అనుభవించు.” వినోద్ బయటకి వెళ్ళడానికి లేచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on బాషా ఖూనీ

తాడిగడప శ్యామలరావు said : Guest 6 years ago

బాగుంది. ఒకప్పుడు మాకొక ఒరియా కొలీగ్ ఉండేవాడు. శంకర్ అన్న మాటను సంకర్ అంటూ వాయిస్తుంటే అనేకమంది అది తప్పని చెప్పి సరైన ఉఛ్ఛారణ నేర్పటానికి బోలెడంత విఫలయత్నం చేసారు. అదంతా గుర్తుచేసారు మీరు.

  • హైదరాబాద్