సంగీత రంజని

సంగీత రంజని మార్చి 2019

I. కళావతి రాగం:

కళావతి అంటే కళలు తెలిసిన స్త్రీ. చదువుల తల్లి సరస్వతి దేవికి మరో పేరు
కళావతి. పారుడు అనే ఋషికి, పుంజిక స్థల అనే అప్సరకు పుట్టిన కూతురుకు కళావతి
అని పేరు పెట్టారు. పార్వతీ దేవి ఆమె సౌందర్యానికి మెచ్చి ఆమెకు పద్మినీ
విద్యను ఇచ్చింది. తరువాత కళావతి స్వరోచి ని వివాహం చేసుకోంది.
తుంబురుని వీణ పేరు కూడా కళావతి.
కర్ణాటక సంగీతం లోని కళావతి రాగం 16 వ మేళకర్త చక్రవాక జన్యరాగం. ఉపాంగ రాగం,
ఔడవ-వక్ర షాడవ రాగం. ఆరోహణలో గాంధార, నిశాధాలు వర్జ్యం.
అవరోహణలో నిషాధం వర్జ్యం. అపురూపమైన రాగం, కరుణ రస ప్రధానమైన రాగం. ఈ రాగం
త్యాగరాజస్వామి సృష్టి. విళంబ కాలం లో పాడితే బాగుంటుంది.
ఆరోహణ: స రి మ ప ద స ..అవరోహణ: స ద ప మ గ స రి స ..శుద్ధ రిషభం, అంతర గాంధారం,
శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం స్వర స్థానాలు.
హిందుస్తానీ సంగెతం లో కూడా ఒక కళావతి రాగం ఉంది. అది కర్ణాటక సంగీతం లోని
వలజి రాగానికి సమానం. వలజి కూడా చక్రవాక జన్యమే.
ముత్తుస్వామి దీక్షితులు ఈ రాగం లో ‘ కళావతి కమలాసన యువతీ ‘ అనే కృతి రచించారు.

శాస్త్రీయ సంగీతం లో రచనలు:

ఎన్నడు చూతునో, ఒకసారి చూడగా రాదా-త్యాగరాజు.

పల్లవి:
ఎన్నడు చూతునో ఇనకుల తిలక నిన్ను ||ఎన్నడు||

అనుపల్లవి:
పన్నగా శయన భక్త జనావన
పున్నమ చంద్రు బోలు ముఖమును ||ఎన్నడు||

చరణం:
ధరణిజ, సౌమిత్రి , భారత, రిపుజ్ఞ, వా
నర యూధపతి వరుడాంజనేయుడు
కరమును ఒకరిని ఒకరు వర్ణింప ఆ
దరణను బిలచే నిన్ను త్యాగరాజార్చిత ||ఎన్నడు||

తెలుగు చిత్రాలలో కొన్ని పాటలు:
కరుణామయా దేవా-భక్త తుకారాం; మా ఇలవేలుపు నీవేనయ్యా- మా వదిన; అతడే నా జతగాడు-
పెద్దలు మారాలి; మనసే మధు గీతమై-అడుగు జాడలు;
జగమునేలే గోపాలుడే- శ్రీ కృష్ణావతారం.

మా ఇలవేలుపు- మా వదిన; గానం: పి. సుశీల.

పల్లవి:
మా ఇలవేలుపు నీవేనయ్యా
మము కాపాడే రామయ్యా ||మా||

చరణం: 1
అనుదినము నిను కొలిచెదము
నీ శుభ నామమే పలికెదము
మా తోడు నీడై మా ఇంటి సిరివై
మమ్మేలు కోవయ్యా మము కాపాడే రామయ్యా ||మా||

చరణం: 2
అన్న దమ్ములకూ ఆలు మొగలకూ
ఆదర్శ మూర్తులు మీరే
సంసార జీవిత సౌభాగ్యమంతా
మీ చలవేనయ్యా మము కాపాడే రామయ్యా ||మా||

II.మాల్గుంజి ……

మామూలుగా ఒక రాగం ఒకటి గానీ అంతకంటే ఎక్కువ రసాలను ఇస్తుంది. అది ఆయా రచనలను
బట్టి ఉంటుంది. కానీ ఈ మాల్గుంజి రాగం ఒకేసారి ఒకే రచనలో రెండు రసాలను
కలిగిస్తుంది. అదే ఈ రాగం యొక్క విశిష్టత . ఈ రాగం kaafi థాట్ కు చెందినది
అయినా ఖమాజ్ రాగ ఛాయలు కూడా కనిపిస్తాయి . ఆరోహణ లో స్వరాలు రాగేశ్రి రాగం
వలెనె ఉండి సాధారణ గాంధారం ఉంటుంది. రాగేశ్రి రాగం…చాలా ఏండ్లు ప్రియునితో
ఎడబాటు లో ఉండి తిరిగి కలుసుకోబోయే ( రీయూనియన్ ) మనస్తత్వాన్ని చాలా బాగా
తెలియ చేస్తుంది.

అవరోహణ పూర్తిగా భాగేశ్రి రాగ స్వరాలు ఉండి కోమల గాంధారాన్ని కలిగి ఉంటుంది. ఈ
భాగేశ్రి రాగం ….ప్రియుని ఎడబాటు లో ప్రేయసి పడే బాధను చాలా బాగా తెలియ
చేస్తుంది. ఈ విధంగా ఒకే రాగం ఒకే సమయం లో ప్రియుని ఎడబాటునూ, తిరిగి
కలుసుకోబోయే ఉద్విగ్నతనూ తెలియ చేస్తుంది.

రాగేశ్రీ….ఖమాజ్ థాట్ జన్యం. ఆరోహణ: స గ మ ద ని స ….అవరోహణం: స ని ద మ గ
రి స …ఔడవ-షాడవ రాగం.

భాగేశ్రీ…కాపి థాట్ కు చెందిన రాగం .ఆరోహణ: స రి గ మ ద ని స …అవరోహణ: స ని
ద ని ప మ గ రి స ..షాడవ-సంపూర్ణ, వక్ర రాగం.

మాల్గుంజి….ఖమాజ్ థాట్ కు చెందినది. ఆరోహణ: స గ మ ద ని స ….అవరోహణ: స ని ద
ప మ గ రి స …ఔడవ-సంపూర్ణ రాగం.

పురందర దాసు కాలం లో ఈ రాగం పేరు గుంజీమాల. ఈ రాగం లో ” యుగ యుగాది ” అనే రచన
పురందర దాసు గారు రచించారు. దీని ఆధారంగా కళా తపస్వి V. శాంతారాం గారు తన
కళాత్మక చిత్రం ” ఝనక్ ఝనక్ పాయల్ బాజే ” సినిమాలో ” నైన్ సో నైన్ నహీ మిలావో
” అనే పాట చేశారు. ఈ పాట ప్రేరణ గా రాజనందిని సినిమాలో టి. వి. రాజు గారు ”
అందాలు చిందు సీమలో ” చేశారు. రెండు పాటలూ వినండి…ఆనందించండి.

అందాలు చిందు సీమలో …..చిత్రం : రాజనందిని (1958); రచన : మల్లాది రామకృష్ణ
శాస్త్రి ; సంగీతం : టి.వి.రాజు; గానం : ఎ.ఎం. రాజా , జిక్కి; అభినయం:
ఎన్టీఆర్, అంజలీ దేవి ; రాగం: మాల్గుంజి .

1. సాహిత్యం: ప్రియుని చిన్నారి బాలుడా అనీ, నీ మోము గోము నాదే …ఇలా మల్లాది
వారు తప్ప వేరెవరూ రాయలేరు. నీవే – నీవే; నీవు-నేను;

నాదే-నాదే వంటి పద ప్రయోగాలు మల్లాది శైలి ని పట్టిస్తాయి.

2. సంగీతం: అంజలీదేవి ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటె…ఎన్టీఆర్
వెనకనుండి వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ప్రేయసీ ప్రియుల పునః సమాగమం తెలియ జేసే
మాల్గుంజి రాగాన్ని టి. వి. రాజు గారు చక్కగా ఉపయోగించు కున్నారు.

3. గానం: ఈ పాట పాడేటప్పటికి రాజాకు, జిక్కి కి పెళ్లి అయి నాలుగేళ్ళు
అవుతున్నది. ఇలాంటి యుగళ గీతాలు ఎన్నో పాడారు ఈ జంట. ఇద్దరి గొంతులూ ఎంత
మృదువుగా ఉన్నాయో చూడండి. మెలోడీ కి పట్టం కట్టిన అతికొద్ది గాయనీ గాయకులలో
వీరు కూడా ఉన్నారు.

పల్లవి:

అందాలు చిందు సీమలో ఉందాములే హాయిగా

అందాలు చిందు సీమలో ఉందాములే హాయిగా ||అందాలు||

చరణం: 1

చూసిన చూపు నీకోసమే నన్నేలు రాజు నీవే నీవే

చిన్నారి బాలుడా… ఆ… ||అందాలు||

చరణం: 2

ఆనంద సీమ ఈ లోకము ఈ తీరుగానే నీవు నేను

ఏలేము హాయిగా… ఆ… ||అందాలు||

చరణం: 3

నిలువెల్ల నిండె ఆనందము నీ మోము గోము నాదే నాదే

ఔనోయి బాలుడా… ఆ… ||అందాలు||

2. నైన్ సే నైన్ నహి మిలావ్….చిత్రం: ఝనక్ ఝనక్ పాయల్ బాజే; రచన: హస్రత్
జైపురి ; సంగీతం: వసంత దేశాయ్; గానం: లతా మంగేష్కేర్, హేమంత్ కుమార్; అభినయం:
గోపికృష్ణ, సంధ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked