Featured

అన్నమయ్య శృంగార నీరాజనం

 

టేకుమళ్ళ వెంకటప్పయ్య

వయస్సును బట్టి కౌశలాన్ని ఆధారంగా చేసుకుని నాయికలలో ముగ్ధ, మధ్య, ప్రౌఢ అనే మూడు రకాల నాయికలలో గత మాసం ముగ్ధ గురించి తెలుసుకున్నాం. ఈ నెలలో మధ్య నాయిక గురించి తెలుసుకుందాం.  రామరాజ భూషణుడు తన సరసభూపాలీయము లో మధ్యమ నాయికను వర్ణిస్తూ..

 

ఉ. మానితవైఖరిన్ మణిత మంత్రములం, గబరీ వినిర్గళ

త్సూనములం  బ్రసూన శర సూరుని బూజలొనర్చి తా రతిన్

మానిని యొప్పెనప్పుడసమాన మనోంబుజ వీధి నాతనిన్

ధ్యానము సేయుకై వడి రతాంత నితాంత నిమీలితాక్షియై.

 

తన కొప్పునుండి జారుతున్న పుష్పమాలలతో, కోకిల కంఠధ్వనితోడను, మన్మధపూజ చేసి,  వివశురాలై నాయకుడినే సదా ధ్యాన్నం చేసే  అవస్థను వర్ణిస్తాడు.

 

సాహిత్యదర్పణం లో మధ్య నాయికను వర్ణిస్తూ…“మధ్యా విచిత్ర సురతా ప్రరూఢస్మరయౌవనా|

ఈషత్ప్రగల్భ వచనా మధ్యమ వ్రీడితా మతా||.” అంటే..విచిత్రమైన సంగమము, యెక్కువైన మదన తాపముగల, ప్రగల్భమైన వాక్కులు గలది, లజ్జ ఎక్కువగా గల స్త్రీ అని అర్ధం.

 

ఇక అన్నమయ్య నాయిక “మధ్యమ” దాదాపు ఇవే లక్షణాలతో..చెలికత్తెలతో విభుని గూర్చి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ ఉంది. “నా విభునితో ఎకచెకాలాడ వద్దు సుమా! అలసి సొలసి వచ్చిన అతనికి జలకాలాడించండి మంచి విందు భోజనం పెట్టండి” అని చెలికత్తెలను వివిధ పనులకు పురమాయిస్తోంది. ఆ వింతలు విశేషాలు  “వెంగెము లాడకురే విభునితోను – సంగతితో నతని కిచ్చకురాలనేను” అనే చక్కని కీర్తనలో  విందాం.

 

 

కీర్తన:

పల్లవి: వెంగెము లాడకురే విభునితోను

సంగతితో నతని కిచ్చకురాల నేను.

చ.1. అద్దమరేతిరి కాడ నాతడింటికి విచ్చేసె

గద్దెపీట వెట్టరే కాంతలాల

వొద్దికతో మాటలాడనోపు గడు నేరుపరి

సుద్దులెల్లా నడుగరే చుట్టపు వరుసను  ||వెంగెము||

చ.2. అలసినచెమటతో నదె నిలుచున్నవాడు

జలకము వట్టరే సతులాల

నెలకొన్న కన్నులను నిద్దురదేరీ దనకు

లలి బానుపు వరచి లాలించరే   ||వెంగెము||

చ.3. అందు నిందు దిరిగాడి ఆకలి గొన్నాడేమో

విందు వెట్టరే పతికి వెలదులాల

చెందె నన్ను నింతలోనె శ్రీవేంకటేశుడితడు

పొందు లిందరికీ జేసీ పొగడరే మీరు  ||వెంగెము||

(రాగం: గౌళశృం.సం.సం 28; రాగి రేకు 1805; కీ.సం.29)

 

విశ్లేషణ: కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక మధ్య, నాయిక చెలికత్తెలతో  నాయకుని గూర్చి మాట్లాడుతూఅతనికిష్టురాలనైన నేను అతనికి ఏమైనా అపరాధం జరిగితే వూరుకోను జాగ్రత్త! మంచి ఆసనం మీద కూర్చోబెట్టండి. పన్నీట జలకాలాడించండి, చక్కటి విందు భోజనం పెట్టండి అని గబ గబా చెలికత్తెలకు పనులన్నీ పురమాయిస్తోంది.

పల్లవి: వెంగెము లాడకురే విభునితోను

సంగతితో నతని కిచ్చకురాల నేను.

ఓ చెలికత్తెలారా! నా విభునితో మీరు పొరబాటున కూడా వెక్కిరింపు మాటలు, ఎగతాళిమాటలు ఆడకండి. శ్రీహరికి తగిన యుక్తంగా..చాలా ఇష్టురాలను నేను అని దేవేరి మరీ మరీ చెప్తోంది. మధ్యమ నాయిక సుగుణాలివే! నాయకుని కొరకు వివశులై సదా విభుడినే ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయనకు ఎక్కడ అపకీర్తి అవుతుందో.. ఎక్కడ తనవల్ల పొరబాట్లు జరుగుతాయోనని పలు జాగ్రత్తలతో ఎదురు చూస్తూ ఉంటుంది.

.1. అద్దమరేతిరి కాడ నాతడింటికి విచ్చేసె

గద్దెపీట వెట్టరే కాంతలాల

వొద్దికతో మాటలాడనోపు గడు నేరుపరి

సుద్దులెల్లా నడుగరే చుట్టపు వరుసను

ఎప్పుడొ నడిరేయివేళ స్వామి ఇంటికి వస్తారు. పెద్దదైన ఎత్తైన పీటపై అశీనులను చేయండి. ప్రేమ అనురాగాలు తొణికిసలాడే విధంగా మాట్లాడండి. చాలా నేర్పరి.బంధుత్వం నెరపుతూ మంచి మంచి మాటలతో స్వామిని విశేషాలన్నీ అడిగి నాకు వెంటనే చెప్పండి అని ఆజ్ఞాపిస్తోంది అమ్మ.

.2. అలసినచెమటతో నదె నిలుచున్నవాడు

జలకము వట్టరే సతులాల

నెలకొన్న కన్నులను నిద్దురదేరీ దనకు

లలి బానుపు వరచి లాలించరే

 

స్వామి అనేక పనుల వత్తిడిలో అలసి చెమటలతో నిలుచున్నాడు. ఆయనకు పన్నీటి జలకమాడించండి. కమల నేత్రుడైన నా స్వామి నిద్దుర కన్నులతో ఉంటాడు. చక్కటి సొగసైన పానుపు పరచి లాలించి, బుజ్జగించి నిద్రకు ఉపక్రమింపజేయండి. ఇలా స్వామికి ఎక్కడా ఏ సమస్యా రాకుండా ఏ సమయానికి కావలసిన విషయాలను ఆసమయానికి చేయమని ఆదుర్దాతో చెలికత్తెలకు చెప్తోంది.

 

.3. అందు నిందు దిరిగాడి ఆకలి గొన్నాడేమో

విందు వెట్టరే పతికి వెలదులాల

చెందె నన్ను నింతలోనె శ్రీవేంకటేశుడితడు

పొందు లిందరికీ జేసీ పొగడరే మీరు

 

స్వామి భక్తులకు వరాలివ్వడం, రక్షించడం అనే కార్యాలతో తిరిగి తిరిగి మంచి ఆకలి మీద ఉండి ఉండవచ్చు. ఓ లలనా మణులాలా! నా స్వామికి మంచి పంచ బక్ష్య పరమాన్నాలతో విందుభోజనం పెట్టండి. శ్రీవేంకటేశ్వరుడు నన్ను అంతలోనే చేరదీస్తాడు సుమా! అందువల్ల మా ఇద్దరికీ పొందికజేసి స్తుతించండి మీరు అని అమ్మ చెప్తోంది.

 

ముఖ్యమైన అర్ధాలు: వెంగెము = వ్యంగ్యమునకు వికృతి కావచ్చు, వెక్కిరింత; సంగతి = తగిన, యుక్తమైన; అద్దమరేతిరి = నడి రేయి, అర్ధరాత్రి; గద్దెపీట = పెద్దదైన, ఎత్తైన ఆసనంసుద్దులు = మంచి మాటలు; జెలకము = నీరు; లలి = సొగసైన, ఒప్పిదమైన; లాలించుబుజ్జగించటం; వెలది = స్త్రీ; పొగడు = స్తుతించు, సేవ.

-o0o-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked