కథా భారతి

అమెరికాలో యోగీశ్వరుడు

(మొదటి భాగం)

-ఆర్. శర్మ దంతుర్తి

సుబ్బారావు యోగీశ్వరుడిగా మారడానికీ, అమెరికా రావడానికీ అనేకానేక కారణాలు ఉన్నాయి. మునిసిపల్ స్కూల్లో తొమ్మిదో తరగతి పిల్లలకి పాఠాలు చెప్పుకునే ఉద్యోగం లో చేరిన రోజుల్లో మొదట్లో కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది పాఠాలు చెప్పడానికి. కానీ మూడు నాలుగు సంవత్సరాలు గడిచేసరికి చెప్పిన పాఠమే చెప్తూ రికార్డ్-ప్లేబేక్ అన్నట్టైపోయింది సుబ్బారావు పని. తెలుగులో పాఠ్య పుస్తకాలు అంత తొందరగా మారవు కనకా, మారినా పెద్దగా ప్రిపేర్ అయ్యేది ఏమీ ఉండదు కనకా సుబ్బారావు కి పాఠాలు చెప్పడానిక్కంటే గోళ్ళు గిల్లుకోవడానికీ, నవల్డానికీ ఎక్కువ టైం ఉండేది స్కూల్లోనూ ఇంట్లోనూ. అలాంటి రోజుల్లో సుబ్బారావు జాతకాలు చూడ్డం, చెప్పడం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అవును మొదట్లో సరదాకే.

ఇరవైఏడు నక్షత్రాల పేర్లూ, నవగ్రహాలు ఎలా ముందుకీ, వెనక్కీ తిరుగుతాయో అవన్నీ నేర్చుకున్నాక దశా, మహా దశా, అర్ధాష్టమ శనీ, అష్టమ శనీ, ఏలినాటి శనీ, కుజ దోషం లాంటివి పూర్తిగా రావడానికి మరో రెండేళ్ళు పట్టింది. ఓ సారి జ్యోతిషం వంటబట్టగానే చక్రం వేయడం ప్రశ్నలకి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అటువంటి రోజుల్లోనే సుబ్బారావుని ఆకాశానికెత్తే సంఘటన, రాబోయే అద్భుత భవిష్యత్తుని సూచిస్తోందా అన్నట్టు సుబ్బారావు వళ్ళోకి వచ్చి పడింది, తనకి తెలియకుండానే. ఇలాంటి సంఘటనలు చూసే కాబోలు నారాయణీయం రాసిన భట్టాత్తిరి గారు “కో నామ కస్య సుకృతం కధ మిత్యవేయాత్” అన్నది.

ఇదంతా ఓ రోజు సుబ్బారావు వాళ్ళావిడ అంట్లు కడగడానికి పనిమనిషి రాలేదని కంప్లైంట్ చేయడంతో మొదలైంది. పనిమనిషి అంట్లు తోమకపోతే, తొమ్మిది లోపు వంట మొదలవదు. సుబ్బారావు పదింటికి స్కూలుకెళ్ళాలంటే తొమ్మిదిలోపు వంట అయి మరో ఇరవై నిముషాల్లో కంచం ముందు కూర్చుని, తొమ్మిదీ నలభైకి సైకిల్ ఎక్కాలి. అప్పుడే ఎనిమిదిన్నర అవుతోంది. పెళ్ళాం అంట్లు తోమదు. తాను పెరట్లో కూర్చుని అంట్లు తోమాలంటే ఎవరైనా చూస్తారేమో అని నామోషీ. వంట అవనందుకు పెళ్ళాం మీద కోపం వచ్చి అరిస్తే పనిమనిషి సమయానికి వచ్చి అంట్లు తోమి ఇచ్చినా ఆ రోజు పస్తే కదా?

ఎలాగరా అని ఆలోచిస్తూంటే సుబ్బారావుకో అమోఘమైన ఆలోచన తట్టింది. వెంఠనే కాయితం తీసి చక్రం వేసి ప్రశ్న తనకి తానే వేసుకున్నాడు “పనిమనిషి ఈ రోజు ఎప్పుడొస్తుంది?” బుధుడు వక్రించి ఉండడం, మూడో ఇంట్లో శని దృష్టి పడడం వల్ల పని మనిషి రావడం లేటు అవుతుందని తెలుస్తోంది. అంతే కానీ రాదని చెప్పట్లేదు గ్రహ స్థితి. అయితే మరో కొద్ది నిముషాల్లో రాహు కాలం వెళ్ళిపోవడం వల్ల పనిమనిషి ఎనిమిదీ యాభై కి వచ్చి తీరాలి. తాను నేర్చుకున్న జాతకం ఇలా పనిమనిషి రాకపోకలకీ, పోయిన తాళం గుత్తులు ఎక్కడున్నాయో కనిపెట్టడానికీ వాడకపోతే నేర్చుకోవడం ఎందుకు, దండగే కదా!

తలెత్తి పెళ్ళాంతో చెప్పాడు – “నేను చక్రం వేసి గుణించి చూసాను. పనిమనిషి ఎనిమిదీ యాభై కి రావాలి చూసుకో. రాగానే ముందు అన్నం, చారూ వండేయి. మిగతావి అక్కర్లేదు ఈ రోజుకి. అన్నీ వండే దాకా కూర్చుంటే పుణ్యకాలం అయిపోయి ప్రిన్సిపాలు గారు మొట్టికాయలు వేస్తాడు.”

“ఏడిసినట్టుంది, ఇప్పుడు ఎనిమిది నలభై ఎనిమిది. అది వచ్చే జాడే లేదు. మీరూ మీ ప్రశ్నా శాస్త్రమూను.”

“చూస్తూ ఉండవోయ్, అలా నోరు పారేసుకోకు. గ్రహాలని అలా అంటే పాపం అంటుకుంటుంది. ఆ తర్వాత శాంతి చేయించాలి.”

“చూద్దాం లెండి. అయినా అలా గ్రహాలనీ దేవతలనీ ఏమనకూడదని అంటున్నారు గానీ మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకి వాడుకుంటూ మీరు అలా ప్రశ్నలు చెప్పొచ్చేం? అలా వాడకూడదని పెద్దవాళ్ళు అనరూ?”

“వాళ్ళంతా వాజమ్మలోయ్! నాకు తెలియదా ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ కూడదో? శాస్త్రం నేర్చుకున్నది మన జీవితంలో వాడుకోవడానిక్కాపోతే మరెందుకూ?”

సుబ్బారావు పెళ్ళాంతో ఇలా మాట్లాడుతూండగానే అలా పనిమనిషి ఇంట్లోకి రావడం తో సంభాషణ అక్కడితో ఆగిపోయింది. సుబ్బారావు వాళ్ళావిడ పనిమనిషి వెనకే పరుగెట్టింది అన్నం గిన్నె కోసం. రెండు నిముషాల్లో పనిమనిషి కడిగిచ్చిన అన్నం గిన్నె తీసుకుని వంట మొదలు పెట్టి చారునీళ్ళు పెట్టి మొత్తానికి తొమ్మిదీ ఇరవై అయ్యేసరికి ఆవకాయ, రాత్రికి మిగిలిపోయిన బీరకాయ పచ్చడీ వడ్డించింది. కంచం ముందు కూర్చున్న సుబ్బారావు మహదానందంతో చారులో బీరకాయ పచ్చడి నంచుకుంటూ వాళ్ళావిడతో తాను చెప్పినట్టూ ప్రశ్నా శాస్త్రం ఎలా నిజమైందో విడమర్చినప్పుడు అన్నీ గుర్తువచ్చి నోరు వెళ్లబెట్టింది ఆవిడ. తన మొగుడు ఇంక గొప్పవాడు కాబోతున్నాడు. సందేహం లేదు.

సుబ్బారావు స్కూలుకెళ్ళిపోయాక పనిమనిషితో కబుర్లు మొదలుపెట్టిన సు.వా (అంటే సుబ్బారావు వాళ్ళావిడ) దానితో మొత్తం కధంతా పూస గుచ్చినట్టు చెప్పేసింది. నోట్లో నువ్వు గింజ నానని ఆవిడ వల్లా, పనిమనిషి వల్లా మొత్తం ఊరూ వాడా సుబ్బారావు గురించి తెలిసిపోయింది తర్వాతి రోజుల్లో. అప్పటి నుంచి సుబ్బారావు ఇంటిముందు క్యూ మొదలైంది ప్రశ్నలు చెప్పించుకోవడానికి. వచ్చినవాళ్ళ దగ్గిర మొహంలో మంచి వర్ఛస్సూ అదీ చూపించడానికి రోజూ విభూధీ, కుంకుమా నుదిటిమీద రాసుకోవడం మొదలుపెట్టాడు సుబ్బారావు. ఇలా మూడేళ్లలో స్కూల్ టీచర్ సుబ్బారావు, సిద్ధాంతి సుబ్బారావుగారు గానూ, సుబ్బారావు గురువుగారి గానూ, ఆ పైన యోగీశ్వరుడిగానూ మార్పు చెందేడు – ఈ పధ్ధతి అంతా తెలుగు, భారత దేశాల్లో అత్యంత సహజం కనక.

* * * * * *

ఏదైనా కంపెనీ ఉత్పత్తులు బాగా పుంజుకోవాలంటే మొదటిగా కావాల్సింది ఎడ్వర్టైజింగు. ఆ తర్వాత వాటిని సరిగ్గా అమ్మగలిగే సేల్స్ టీము. మరి ఓ కంపెనీకి ఒకే ప్రోడక్టు ఉంటే, దానిమీద ఆధారపడ్డ జనాలకి కొంతకాలానికి అదంటే బోరు కొట్టొచ్చు. లేకపోతే ఈ ప్రోడక్ట్ కి దీటుగా మరోటి మార్కెట్ లోకి వచ్చిందంటే ఏమౌతుందో అందరికీ తెలిసిన విషయం. అందుకే బిజినెస్సులో డైవర్సిఫికేషన్ తప్పనిసరి. అందువల్లే మనం తాగేది పంచదార నీళ్ళని తెలిసినా రంగు రంగుల్లో అమ్మితే చంకలెగరేసుకుంటూ తాగుతాం కాబట్టి కోకా కోలా లాంటి కంపెనీలు ఒకే ప్రోడక్టు పట్టుకుని వేళ్ళాడక అనేక సోడాలూ, చిరుతిళ్ళూ, కొత్త కొత్త ప్రోడక్ట్ లు, రంగు రంగుల్తో, అనేకానేక సైజుల్లో ఎప్పటికప్పుడు బజార్లోకి తెస్తూ ఉంటారు. ఇదే ఫార్ములా ఏ బిజినెస్సుకైనా వర్తిస్తుంది, ఆఖరికీ సాఫ్ట్ వేర్ కీ, సిధ్ధాంతులకీ, జ్యోతిష్యులకీను.

అందువల్లే స్కూల్లో పాఠాలు చెప్పుకునే సుబ్బారావు మరో నాలుగైదేళ్లలో కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు డైవర్సిఫికేషన్ కోసం. అందులోదే ఏడాదికోపాటు కొత్త పంచాంగం రాయడం దాన్ని ఫలానా వారి ద్వారా అమ్ముకోవడమూను. ఆ పంచాంగంలో ఏడాదికి సరిపడా రాశి ఫలితాలూ, కందాయ ఫలాలూ, ప్రయాణాలకి శుభ సమయాలూ, బల్లి పడడం వల్ల వచ్చే ఫలితలూ గట్రా మామూలే. ఆ బల్లి పడడం వల్ల ఫలితాలు నిజమయ్యేది మనుషులకా, బల్లికా అనేది వేరే విషయం. ఇంకో సులువైన విషయం ఏమిటంటే ఇటువంటి ఫలాలకీ, ఫలితాలకీ కాపీరైటు లేదు. ఎక్కడ్నుంచి ఎత్తుకొచ్చి రాసినా అడిగే నాధుడు లేడు. పంచాంగం రాసేవారు ఉత్తి సుబ్బారావులూ, అవధానులూ, శర్మలూ, శాస్త్రులూ అయితే ఏం బావుంటుంది? అందుకే ఈ ప్రయత్నంలో ప్రచురుణ కర్తలు సుబ్బారావుకి మరో బిరుదు తగిలించారు ‘దైవజ్ఞ చింతామణి’ అని. ఎంత డైవర్సిఫికేషన్ అయినా స్కూలు ఉద్యోగం గంగిగోవు; అలాగే సాయంత్రం కుర్రాళ్ళకి చెప్పే ప్రైవేట్ ట్యూషన్ల వల్ల సుబ్బారావుకు మంచి ఆదాయం వస్తోంది. వీటిని వదులుకోలేరాదు.

మరో వ్యాపకం, హై స్కూలు కూడా పాస్ అవలేని ఏ కుర్రాడైనా సరే మొదలెట్టగలిగేది హోమియోపతి. కాలి మూర్, నేట్రం సల్ఫ్, నక్స్ వామికా అనే పది పేర్లు నోటికొచ్చాయా, వెంఠనే బోర్డు పెట్టేసి ప్రాక్టీసు మొదలుపెట్టేయడమే. జనాలలో తొంభై శాతం జబ్బులొచ్చేది తినే తిండి మూలానే కనక అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన పరమౌషథం నక్సు వామికా! ఎవరైనా తెలియని మరో రోగం తో వస్తే యాభై రూపాయలకి బజార్లో దొరికే “ఇంటింటా హోమియోపతి” పుస్తకం ఉండనే ఉంది. హోమియోపతీలో ఉన్న మరో సులువు – మాత్రలన్నీ పంచదార గుళికలు. చిన్న పంచదార గుళికలు వికటించడం అరుదు కదా? అయినా వైద్యానికి హస్త వాసి ఉండాలి కానీ ఎన్ని డిగ్రీలు ఉండి ఏం ప్రయోజనం? అలా సుబ్బారావు డాక్టర్ గా కూడా మోర్ఫ్ అయ్యేడు.

ఇలా సుబ్బారావు రోజురోజుకీ ప్రవర్ధమానమౌతుండగా ఓ రోజు సాయంత్రం కుర్రాళ్ళకి పాఠాలు చెప్పాక తట్టింది సుబ్బారావుకి తాను జపం, ధ్యానం చేయడం మొదలుపెడితే తన డైవర్సిఫికేషన్ మరింత పుంజుకుంటుంది. ధ్యానంలో కర్ణ పిశాచి కనబడవచ్చు లేకపోతే ప్రశ్న చక్రంలో తనకి సమాధానం అందని ప్రశ్నలకి సులభంగా సమాధానాలు దొరకవచ్చు. కొన్నాళ్ళకి ధ్యానం, మంత్రోచ్చారణ ఎలా ఉన్నా మెడా, నడుమూ నిలువుగా పెట్టి అస్తవ్యస్తంగా కూర్చోడం వల్లో, మరో కారణం చేతో వెన్నుపూస మధ్యలో, ఆ పైన పూస గొలుసుల్లో ఏదో కదలడం మొదలైంది సుబ్బారావుకి. అది ముందు కలగబోయే, ఆత్మ జ్ఞానానికీ, భావ సమాధికి గుర్తు అని ఒక పెద్ద మనిషి అంటే సుబ్బారావు తనకి మూలాధారం నుంచి సుషుమ్నా నాడి ద్వారా కుండలినీ శక్తి సహస్రారంలోకి ప్రవహించిందనీ, అప్పట్నుండి తానో “పరమహంస” అనీ అనుకోవడం మొదలుపెట్టాడు.

* * * * * *

ఇరవై ఏళ్ళు గడిచాయి. ఈ లోపున సుబ్బారావు కొడుకు అమెరికా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడనే పిచ్చి పిచ్చి గూట్లే ప్రశ్నలు అడుగుతారేం? అమెరికాకి వీసా వచ్చేదీ, వెళ్ళేది ఇద్దరే – ఒకరు తాము బ్రహ్మ పదార్ధానికి ఏమాత్రం తీసిపోమనుకునే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లూ రెండోవారు అసలు బ్రహ్మ పదార్ధాన్ని వాళ్లకొచ్చిన మంత్రాలతోనో, సినిమా పాటలతోనో రోజూ అర్చించే ఆగమ పండితులమని చెప్పుకునే హిందూ గుడి పూజారులూను. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకి ఏమొచ్చినా రాకపోయినా గూగిల్ చేసి తెలుసుకుంటారు. అడిగితే ఏదైనా అందిచ్చే గూగిలమ్మ లైన్ బై లైన్ కోడ్ అందిస్తుంది. అది అలా కట్ చేసి ఇలా పేస్ట్ చేసేస్తే సరి. మరి పూజారులైతే వాళ్ళు చదివేది మంత్రమా, తంత్రమా, సినిమా డయలాగులా, పాటా, పద్యమా, అసలు ఏం గొణుగుతున్నారో ఎవరికి అర్ధమైంది కనక అడగడానికి? అయినా ఎవరికి తీరిక అడగడానికీ, ఆర్చడానికీ, తీర్చడానికీ? అలా ఇద్దరికీ ఇబ్బంది లేదు.

అలా సుబ్బారావు కొడుకు తానో బ్రహ్మ పదార్ధం అనుకుంటూ అమెరికా వెళ్ళిన మరో ఏడుకి సుబ్బారావు పరమహంస అమెరికాలో దిగాడు విజిటర్ వీసామీద. ఇప్పుడు ఇచ్చే విజిటర్ వీసాలన్నీ పదేళ్లకి ఇస్తున్నారు కనక ఈ పదేళ్ళలో ఎప్పుడొచ్చి ఎప్పుడు వెనక్కి పోయినా ఏమీ ఢోకా లేదు. నాన్నారు అమెరికా వచ్చినందుకు కొడుకు ఓ వీకెండ్లో తనకి తెలిసిన రెండు మూడు కుటుంబాలని భోజనానికి పిలిచేడు. ఆ డిన్నర్ పార్టీలో సుబ్బారావు విశ్వరూపం ప్రదర్శించేడు – ప్రశ్నా శాస్త్రం తో, కుండలినీ శక్తితో, తనకి తెల్సిన మూలాధార చక్రం దగ్గినుంచి సహస్రారం దాకా విడమర్చి చెప్తూను. ఆ వీకెండులో మూడు కుటుంబాలూ భోజనాలు అయ్యేక ఇళ్ళకి బయల్దేరే సరికి సుబ్బారావు పరమహంస వాళ్ళకి గురూజీ అయిపోయేడు.

సుబ్బారావు వాగ్ధాటి చూసిన ఓ ఎన్నారై డంగైపోయి పై వారానికి పరమహంస గారి ప్రసంగం ఏర్పాటు చేసాడు స్థానిక దేవాలయంలో. నాలుగు సంస్కృత శ్లోకాలూ, కొంచెం భీకరమైన – బవనప్రేరితంబైన దవానలంబు చందంబున దండతాడితం బయిన కంఠీరవంబుకైవడి – లాంటి తెలుగు భాషలో ప్రసంగం అయ్యేక ఏ ప్రశ్న వేసినా “శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖర” లో ఏ పేరైనా ముక్కంటిదే అన్నట్టు దాన్ని ధ్యానం తోటో, మరో చక్రంతోటో ముడిపెట్టి ఎవరికీ ఏదీ అర్ధం అయీ కాకుండా సమాధానం చెప్పేసరికి ముగ్దులైపోయిన మరో ముఫ్పై మంది ఎన్నారైలు పరమహంస గారి శిష్యుల్లా తేలారు.

మరో మూడు వారాల్లో చలి ముదిరేముందు సుబ్బారావు ఇండియా వచ్చేసాడు; వచ్చే ఏడు మరో సారి వచ్చి శిష్య పరమాణువులని కలుస్తానని మాట ఇచ్చి మరీను. అందర్నీ మాత్రం ధ్యానం రోజూ చేస్తూండమనీ అలా చేస్తే తాను వాళ్ళకి ధ్యానంలో కనబడి అనుగ్రహిస్తాననీ చెప్పేడు కూడా. అడిగిన వాళ్ళకి తనకొచ్చిన పద్ధతిలో చక్రం వేసి రాశులూ అవి గుణించి సమాధానాలు చెప్పేడు. ఇండియా వెళ్ళిపోయే గురువుగారు అందుబాటులో ఉండడానికి కొడుకు భక్తులకోసం ఒక వెబ్ సైటు తయారు చేస్తానని మాటిచ్చేడు. అందులో పరమహంస గారి రోజు వారీ కార్యక్రమాలు, ధ్యానం, ఫోటోలు అన్నీ పోస్ట్ చేస్తారు. మరి మారుతున్న కాలంతోపాటు పరమహంస గారు మారవద్దూ? ఎప్పుడో శివానందులూ, రామకృష్ణ పరమహంసా, రమణులూ కొండల్లో, కోనల్లో ఎవరికీ అందనంత దూరంలో ఉండి ఒంటరిగా ధ్యానం చేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందారంటే ఆ రోజులు వేరు. శంకరాభరణం సినిమాలో “బ్రో – చె – వా – రెవ-రురా ట ట ట ట” అంటూ పాట పాడుతూ దాసు గారు అన్నట్టూ ఇప్పటి రోజుల్లో రాకెట్లూ, సాకెట్లూ, జెట్లూ వచ్చేసాయి కనక త్యాగరాజులవారి పాట పాడే విధం మారినట్టే పరమహంసలు కూడా మారి తీరాలి. శిష్యులు ఎప్పటికప్పుడు గురువుగారి వెబ్ సైటు చూసి నేర్చుకోవచ్చు.

ఎవరైనా బయటనుంచి కొత్తవాళ్ళు సుబ్బారావు గురూజీ గారి శిష్యులు గా కావాలనుకుంటే మునుముందుగా పరమహంస గారి వెబ్ సైటు చూసి చదివి అన్నీ నేర్చుకోవాలి. సుబ్బారావు గారి పధ్ధతి అంతా పెద్ద రహస్య ప్రహేళిక. అల్టా పుల్టా జనాలకి అర్ధం కాదు. ఆయన ఎవరిని ఏమని వెక్కిరించినా, ఎలా ఈసడించినా ఏదో ఒక కారణం అంతరార్ధంగా ఉండి ఉంటుంది. అది పూర్తిగా తెలుగసుకోగల్గినవారికి ఉత్తరోత్తరా పరమహంస గారు ఉపదేశం ఇస్తారు. అప్పుడు “మా-త్ర-మే” ఈ శిష్యులు – గురువుగారి అంతర్గత సమూహంలోకి రావడానికి అర్హులు. ఈ లోపుల పరమహంసగార్ని కలిసి ప్రశ్నలు వేయవచ్చు. మరి ధ్యానం చేసే పరమహంసలూ, వారి శిష్యులూ అలా జ్యోతిషం, రాశులనీ, ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వాడుకోవచ్చా? మళ్ళీ పిచ్చి ప్రశ్నలడుగుతారేల? గురువుగారు చెప్పినదే వేదం. గూట్లే ప్రశ్నలు వేస్తే మీరు ఇంకా గురువుగారి తత్వం అర్ధం కానట్టే. వెళ్ళి మరో సారి వెబ్ సైటు ఆసాంతం చదివి, చూసి నేర్చుకోండి. మీకింకా గురువుగారి అంతర్గత సమూహంలో ప్రవేశం లభించదు.

* * * * * *

మళ్ళీ కొంత కాలానికి మరోసారి అమెరికా విచ్చేసారు పరమహంస గారు. యధావిధిగా మళ్ళీ వీకెండ్ కి గుళ్ళో ప్రసంగాలూ, అవీ ఏర్పాటు చేయబడ్డాయి. వీక్ డేస్ లో పరమహంస గారు ఇంట్లో కూర్చుని చేసేదేమీలేదు రోజుకో సారి వీలున్నప్పుడు ఇంట్లోంచి బయల్దేరి రోడ్డు మీద నడుస్తారు గంటా, రెండు గంటలు కనబడిన అందరి కేసీ, అందమైన ఇళ్ళకేసీ చూస్తూ. అప్పుడప్పుడూ ఇండియాలో అంతమైపోయి ఇంకా అమెరికాలో కనిపించే పిచికలనీ, పావురాలనీ ఫోటోలూ తీస్తారు కూడాను. ఆ విండో షాపింగ్ అయిపోయాక వెబ్ సైట్ లో తన అమెరికా ఫోటోలు అవీ పెట్టి దాన్ని అప్ డేట్ చేస్తారు. వోనేజ్ లో ప్రప్రంచంలో దాదాపు ఎక్కడికైనా ఫోన్ చేసుకోవడం ఉచితం కనక అమెరికా గురించీ, ఇండియాలో అందరూ ఎలా వెధవలో, దేశాన్ని ఎందుకు, ఎలా శుభ్రంగా ఉంచరో, అమెరికా అయితే ఎంత శుభ్రంగా ఉంటుందో అన్నీ ఇక్కడవీ అక్కడవీ పోల్చుతూ రోజుకో విషయం అటు ఇండియా ఇటు అమెరికా శిష్యులకి చెప్తూ, వాళ్ళని ఉత్తేజితులని చేస్తూ ఉంటారు.

ప్రతీసారి ఇండియాని ఈసడించుకుంటూ తిట్టినా, అబ్బో ఒక్కోసారి అమెరికాని కూడా తిట్టగల ధీరులు గురువుగారు. అప్పుడప్పుడూ తాము తినే తాగే పీజ్జా పీనా కొలాడా గురించీ అమెరికాలో దొరకని మద్రాస్ కాఫీ గురించీ, అసలు అమెరికన్లు పాలు కలుపుకోకుండా తాగే ఎక్కడైనా దొరికే తమ దృష్టిలో “అతి దరిద్రపు” నల్ల కాఫీ గురించీ విపులంగా చర్చలూ, ఫోటోలు అన్నీ ఉంచుతారు వెబ్ సైటులో. ఇలా వెక్కిరించినా పీనా కొలాడా తాగేటప్పుడు పరమహంస గారు ఇటలీ లో ఉన్నప్పుడు ఇటాలియన్ లాగా ఉంటారు. ఎప్పుడైనా రాత్రి వైన్ తాగినా అది ద్రాక్షరసమే కనక తప్పులేదు. అయినా మీకు తెలియనిదేముంది, దగ్గుమందులో ఉండే అంత ఆల్కహాలు బీరులో లేదు. ఆ దగ్గుమందు తాగితే లేని తప్పు బీరు, కానీ వైన్ కానీ తాగితే వచ్చిందా? అయినా మీరూ నేనూ ఆల్కహాలు తాగరాదు మనకి ధ్యానభంగం అవుతుంది కానీ పరమహంసలు ఏం చేసినా తప్పు కాదు. వారికి ఆత్మ జ్ఞానం, జన్మ రాహిత్యం లభించింది కనక వారేం చేసినా వారికి మరో జన్మ ఎలాగా లేదు కనక తప్పు అనే ప్రశ్నే ఉదయించదు.

* * * * * * (సశేషం) * * * * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

2 Comments on అమెరికాలో యోగీశ్వరుడు

నాగేంద్ర ప్రసాద్ said : Guest 7 years ago

అమెరికా లో యోగీశ్వరుడు కథ చాలా బాగుంది

  • నెల్లూరు ఆద్రప్రదేశ్ ఇండియా
తాడిగడప శ్యామలరావు said : Guest 8 years ago

ఒకప్పుడు ఇలాంటి కథల్లోనే కనబడే సుబ్బపరమహంసలు ప్రస్తుతం వీధికి కనీసం‌ ఒకరుగా ప్రతి చోటా కనిపిస్తున్నారు. మీరు మీ దూరదర్శినీయంత్రాన్ని తెరవగానే ఏ సభక్తికమైన ఛానెల్ కేసి చూసినా అసమానూ‌ అటువంటి వారే‌ కనుపిస్తారు. కథను బట్టిలోకం ఉంటుందా - లోకాన్ని చూసేగా కథలల్లేదీ‌ అంటే అదీనిజమే కాని కవయః క్రాంతదర్శనః అని రేప్పొద్దున్న కనబడబోయే‌ మరింత విపరీతపు పరమహంస గురించి రచయితగారు చెప్పబోతున్నారేమో‌ అన్నది ముందుముందు తెలియాల్సిన సంగతి. పంచాగ్నిమధ్యంలో సాధన అనేవారు ఒకప్పుడు - కాని అంతకంటే కష్టం ఇటువంటి వారు విచ్చలవిడిగా మనమీద బడుతున్నా ఇంకా మనసాధనా కార్యక్రమంలో మనం‌ మనంగానే నిలబడగలగటం‌ అన్నది. ఏదిఏమైనా బాధగురువుల నుండి ఆత్మరక్షణార్ధం మనం తెలుసుకోవలసిన విషయాలెన్నో‌ ఈ‌కథద్వారా తెలిసివస్తాయని ఆశిస్తున్నాను. కథారంభం‌ బాగుంది. రచయితగారికి అభినందనలు.

  • India