–ఎస్.ఎస్.వి.రమణరావు
వందమందైనా
అబద్ధం చెబుతుంటే
ఎదిరించి
ఒక్కడైనా
నిజం చెబితే గుర్తించి
వాడి పక్క
నిలబడ గలవా నువ్వు?
నలుగురు కలిసి పనిచేస్తే
పొరపాట్లు జరిగే అవకాశం తక్కువని
ఒక్కడే అంతపనీ చేస్తే
పొరపాట్లు పెరిగే అవకాశం ఎక్కువని
తెలుసుగా నీకు?
నువ్వు చేసిన తప్పులు
ఎదుటి వాడి తప్పుల్ని
క్షమాదృష్టితో చూసేందుకు
నువ్వు పొందిన ఓటమి
ఎదుటివాడి ఓటమిని
సానుభూతితో పరిశీలించేందుకు
తోడ్పడుతున్నాయా?
తప్పులు చేసినవాళ్ళు
తప్పించుకు తిరుగుతున్నంతకాలం
తప్పులు జరుగుతూనే ఉంటాయని
శిక్షా భయం లేనిదే
నేరాలు తగ్గవని
వేరే చెప్పక్కర్లేదుగా?
స్వార్థంకొద్దే కాక
సమాజం కోసం
ఎంత సహనం
చూపించగలుగుతున్నావు నువ్వు?
ఎంత సమయం
ఎంత ధనం
వెచ్చించగలుగుతున్నావు నువ్వు?
సుఖాలకి లొంగిపోకుండా
దుఃఖాలకి కృంగిపోకుండా
వర్తమానంలో కనబడుతున్న
దుర్భర గతాన్ని మార్చుతూ
అందమైన భవిష్యత్ సౌధాన్ని
పునాదులతో సహా నిర్మించడానికి
సిద్ధంగా వున్నావా నువ్వు?
భగవత్ జనిత తేజోకాంతిపుంజం
నీ హృదయంలోనే
నిత్యం వెలుగుతూ
వెలికివచ్చి
ప్రపంచానికంతటికీ
తన వెలుగులు పంచడానికి
నీ అనుమతికోసమే
ఎదురు చూస్తున్న విషయం
తెలుసుకున్నావా?
కళ్ళు మూసుకుని
నిన్ను నువ్వు
ఎప్పుడైనా చూసుకున్నావా?