– డా . మీసాల అప్పలయ్య
ఆ అడుగు నీ జాడనే
చెరిపేసింది
నీ రేఖా చిత్రాన్నిచించేసి
నీ నీడపై ఉమ్మేసి
నీ తలంపును కూడా
పిసర్లగా కోసి గొనె సంచికెత్తి
మౌన వాసనలను
విసర్జించే గబ్బిలాల నూయిని
గోరి చేసింది
అది నీ బ్రతుకు డెడ్ ఎండ్ కు
టికెట్ రాసి ఇచ్చింది
కన్నెత్తి కూడా చూడని కాలధర్మాన్ని
నీ ముంగిటిలోకి విసిరి నిన్ను
రెచ్చ్చగొట్టిన ఉచ్చు అయింది
నీవు నిలబడ్డానికి చోటునిచ్చిన
జీవనాడి కూడా
నీ చెయిదం తోనే
కుత్తుక తెగి
కార్చిచ్చు అంతః కేంద్రంలో
నిర్జీవ రేణువయింది
ముకుళిత హస్తాలుగా
ఆదమరచి నీచుట్టూ నిలబడ్డ నీ బలగం
నీ చేతల సైనైడ్ తో కుప్పకూలిన గోడయింది
నీవు నిలబిడ్డ నేల
నీ మరణపు రొంపయింది
నీ సమాధి పై రాయి అయింది
చీకటిగోడల మధ్య వెక్కివెక్కి ఏడ్చిన నిందయి
పిడిగుద్దులు ఓర్చుకొన్న పచ్చిపుండయింది
పెను తుఫాన్లకు ఒరిగి విరిగిన కొంపయి
చిరిగిన ఎముకల గూడయి
అరచేతులమధ్య బరువుగా
ఒదిగి దాక్కున్న కన్నీటి కడవయింది
పగిలి కొట్టుకుపోయిన నావై
ఊబి లోకి కృంగిపోయిన నడకయై
దారి కోల్పోయిన నౌకాయాన మై
తిరిగి కోలుకోలేని దెబ్బయి
ముఖం ఎత్తుకోలేని విధి అయింది
ఆ అడుగు నీ జాడనే
చెరిపేసింది