– కారుణ్య కాట్రగడ్డ
ఎప్పుడైనా చేతుల్లోకి కాసిని కన్నీళ్లు తీసుకుని చూస్కుంటుంటాను
సముద్రమూ నువ్వూ అలలు అలలుగా కనపడుతుంటారు
నీ తడిసిన చూపుల్ని ఆకాశంలో ఆరబెట్టుకుంటున్న ఆ క్షణాలే మా కంటి మొనల్లో నిలిచుంటాయి
అలసిన ఆకాశం చీకటి ముసుగేసుకుంటున్నట్టు
నీ లోపలికి లోపలికి నువ్వు నడవకుండానే
జీవితమనే ఆఖరి పేజీల అధ్యాయం రానే వచ్చింది….
కళ్లలోని భారమంత దిళ్ళకెత్తుకున్నాక
ఎరుపెక్కిన మనసు పుటలో అర్థం
ఆ పసి వయసులో మాకేం ఎరుకని
మనసును చదవడమనే మహా ప్రస్థానం నీ నుండే
మా ఊపిరి కొసల్లోకి చేరాక కూడా
నిన్ను చదవడం మాకో కాల జ్ఞానమే…
గడప దాటని నీ మనసు మాటలన్నీ
మా రెప్పలకి తగిలినపుడల్లా
మా మనసెంత కురిసిందో కనులకేం తెలుసని
కష్టాల పాన్పుపై పూల మాలవై మాలో
పరిమళాలు నింపిన
నీ ఆత్మాభిమానం ముందు
మోకరిల్లిన ఆడతనానికే తెలుసు
నిండుకుండా నీవు ఒక్కటేనని…
కడుపులో దాచుకున్న సముద్రాలను
జ్ఞప్తికి తెచ్చుకుంటూ
కన్నీళ్లు దాచుకోవడం అంత సులువేం కాదు
నీ బ్రతుకు పొడవునా అల్లుకు పోయిన జ్ఞాపకాలు నిన్నొదిలి పోయినప్పుడు
నీలోకి నువ్వు తొంగి చూసుకుని
స్థైర్యంగా నిలబడడం మాములు విషయమేమీ కాదు
అంతా ఎప్పటిలానే ఉంటుందని నీ ముందు చెప్పడానికి
మేము నీ ముందు ఎదిగిందెప్పుడనీ
వేలాడే లాంతరుకు ఉన్నంత స్వేచ్ఛ
నీకొచ్చిందని చెప్పడానికి
మోసిన గాయం ఆరే తీరేదని నీవడిగితే మౌనించడం తప్ప చెప్పే వీలేదనీ
ఏ ఒక్క క్షణమూ నీది కానప్పుడు
ఆ ఒక్క క్షణమూ తప్ప ఏది నీ మనసుకు వెన్నపూయలేదని మాకు తెలుసు….
మౌనంగా రోదించడం తప్ప మరో మాట ఉండటానికి మిగిలేదిక ఆ ఒక్క క్షణమే….