– అవధాని నేమాని సోమయాజులు
16 నవంబరు 2019వ తేదీ సాయంత్రం సిలికానాంధ్రావారి సంకల్పంతో అంతర్జాలమాధ్యమంలో అద్భుతమైన అష్టావధానం జరిగింది. అవధాని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మగారు. ఆయన శతావధాని మరియు అవధాని భీమ, అవధాన సుధాకర బిరుదాంకితులు. ఈ అవధానం ప్రత్యేకత ఏమిటంటే అవధాని, సంచాలకులు, పృచ్ఛకులు, లేఖకులు అందరూ వేర్వేరు ప్రదేశాలనుడి పాల్గొన్నారు. ప్రేక్షకులు కూడా వివిధ దేశాలు, ఖండఖండాంతరాలనుండి పాల్గొని ఆనందించారు, అభినందించారు కూడా.
సిలికనాంధ్ర నాయక్త్వ జట్టు నుంచి రాజు చమర్తిగారి ప్రసంగంతో మొదలై, సంచాలకులు సోమయాజులుగారి పరిచయకార్యక్రమంతో అవధానం మొదలైంది. ఈ అవధానం సమస్యాపూరణము, దత్తపది, వర్ణనము, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, ఛందోభాషణము, అప్రస్తుతప్రసంగము మొదలైన అంశాలతో అలరారింది. పృచ్ఛకులు తమ ప్రశ్నల పరంపరను అవధానిగారిపై కురిపింపగా, అవధానిగారు కడు నేర్పుతో చాకచక్యంగా వాటన్నికీ మంచి సమాధానలనిచ్చి అందరి మనసు రంజింపచేసారు. ముఖ్యంగా దత్తపది పదాలు చూడడానికి తేలికగా కనుపించినా దుష్కరప్రాస నిబంధించినా అవధానిగారు రమ్యమైన పూరణను చేసారు. మరొక విశేషమేమిటంటే ప్రేక్షకులు అంతర్జాలంలో ఇచ్చిన ప్రశ్నలకు కూడా అవధానిగారు మంచి సమాధానలు ఇచ్చారు.
ఈ అవధానం సిలికానాంధ్ర సాహితీప్రస్థానంలో మకుటాయమానమై నిలచి అందరి మెప్పులను చూఱగొంది. ఈవిధంగా ఇంకా మరెన్నో ప్రయోగాలు చేస్తామని కూడా వారి సంకల్పాన్ని తెలియజేసారు.
- పార్వతీశ్వర శర్మ రాంభట్ల – అవధాని
- శారద కాశీవఝ్ఝల – అప్రస్తుతం
- మధు చెరుకూరి – సూత్రధారి
- కృష్ణ కుమారు పిల్లలమఱ్ఱి – ఆశువు
- శ్రీనివాస్ నాగులపల్లి – దత్తపది
- శ్రీనివాస భరద్వాజ కిశోర్ చిట్టిభొట్ల – సమస్య
- వెంకట శ్రీనివాస్ పులి – వర్ణన
- నారాయణస్వామి శంకగిరి – ఛందోభాషణ
- సోమయాజులు నేమాని – సంచాలకులు
- రావు తల్లాప్రగడ – నిషిద్ధాక్షరి
- రాజు చమర్తి – గౌరవ అతిథి
- విజయభాస్కర్ రాయవరం – లేఖకుడు
- శైలజాకుమార్ నన్నూరు – సహలేఖకుడు
- ఫణి డొక్క – న్యస్తాక్షరి