-వెన్నెల సత్యం
రాత్రి నిద్ర పట్టని
మహానగరం రోడ్లన్నీ
ఆవలింతలతో జోగుతున్నాయి!
బయటికి అడుగు పెడ్తున్న
మనుషులంతా టోపీల్తో
మంకీ లై పోతున్నారు!!
కిటికీ పక్షులు
రెక్కలు విదిల్చడానికి
ప్రయత్నిస్తూ వణుకుతున్నాయి!
చెట్ల ఆకులు
లోలోపల భయపడుతూ
మంచు ముత్యాలు రాలుస్తున్నాయి!!
బకెట్లో నీళ్ళు
కరచాలనం చేయబోతే
కస్సుమంటూ కరుస్తున్నాయి!
చలితో పోరాడలేక
దేహంలో రక్త కణాలు
గడ్డకడ్టుకు పోతున్నాయి!!
ఏ తోడూ లేని
ఒంటరి జీవులు పంజా విసిరే
చలిపులి మీద
తిట్లదండకం వల్లిస్తున్నారు!
తోడు దొరికిన అదృష్టవంతులు
రాగాల దుప్పట్లో చేరి
యుగళ గీతాలు పాడుతున్నారు!!
పాల బుగ్గల పాపాయిలు
ఋతువుల దోబూచులాటని
పసి పాదం తో తన్నేసి
వెచ్చని అమ్మ ఒడిలో
ఆదమరిచి నిద్రిస్తున్నారు!!!
****