– పారనంది శాంతకుమారి
కడలి నుండి కెరటాలు
హృదయం నుండి ఆరాటాలు
ప్రేమ కోసం పోరాటాలు
దూరమైపోవటం లేదే!
మరి పెద్దలనుండి నేటి పిల్లలు
ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు?
చెట్టు నుండి పచ్చదనం
సూర్యుని నుండి వెచ్చదనం
చంద్రుని నుండి చల్లదనం
ఇవేవీ విడిపోవాలని కోరుకోవటం లేదే!
మరి నేటితరం కొడుకులు
తమ తల్లితండ్రులనుండి
ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు?
పగలు నుండి రాత్రి
జననం నుండి మరణం
శాంతి నుండి అశాంతి
ఇవేవీ ఒకదానికి విడిచి వేరొకటి ఉండాలని
అనుకోవటం లేదే!
మరి ఈ అన్నదమ్ములు
ఎందుకు విడివిడిగా ఉండాలని అనుకుంటున్నారు?
మూడు కాలాలు
పంచభూతాలు
ఎనిమిది దిక్కులు
విశ్వకుటుంబంనుండి వేరైపోదామని
అనుకోవటంలేదే!
మన కుటుంబాలే ఎందుకు ముక్కలైపోతున్నాయి?