కవితా స్రవంతి

ఎవరు?!

-సముద్రాల హరిక్రృష్ణ.

దాశరధి!! తా శరధి! శరధి మద విదారి!
ఆశల కాదని,సతిని విడచిన,వింత దారి!!

ఎవడన్న వీడు, కఠిన శాసకుడొ
ఎవడమ్మ వీడు లలిత నాయకుడొ?!
(1)
సుదతి వీడెనని వగచి సోలినాడే
కుదురె కానని కపి సేన కూర్చినాడే
ఎదురెలేని నీరధికి వారధి కట్టినాడే
పదితలల రాకాసిని పడగొట్టినాడే.

ఇంత చేసి,సీతనే చినపుచ్చినాడే
పతిగ,నా విధిగ వెత దీర్చితన్నాడే!
(2)
కొందరెవ్వరో రవ్వ చేసిరని, రాజునని
అది విని,ఇల్లాలినే కానల విడచినాడే
పది.మంది మాటయే పాడియన్నాడే
ఎదిచేసిన జనవాక్యమే తుది అన్నాడే!

ఆనతిచ్చి సీత నడవి దింపించినాడే
తానే శిక్షల వేసి బిట్టు కుమిలినాడే!!

తనవారని చూడని వాడు రాజారాముడేమో
మనసార వలచిన వాడు సీతారాముడేమో
అన్ని ధర్మముల నిక్కపు ఆకృతి రాముడేమో
అన్ని సరిత్తుల సంద్రపు విస్త్రుతి రాముడేమో!
******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked