~వెన్నెల సత్యం
గాయపడిన రాత్రి
వేకువను లేపనంగా రాసుకుంటోంది.
అమరవీరుల ఆత్మలు
స్థూపంలోనే వణికిపోతున్నాయి
రణరంగంలా మారిన
ట్యాంక్ బండ్ మీద
తథాగతుడికి మరోసారి
జ్ఞానోదయమయ్యింది.
ఉద్యమకారుల రక్తంతో
తడిసిన ఇనుపకంచెలు
కార్మికుల రుధిరాన్ని నాలుకతో
జుర్రుకుంటున్నాయి.
దేహాలపై నాట్యమాడటానికి
అలవాటు పడ్డ లాఠీలు
నిరసన కారుల ఎముకల్ని
పెఠీల్మని విరిచేస్తున్నాయి.
హక్కుల పిడికిళ్ళు
ఆత్మహత్యలు చేసుకుంటుంటే
ప్రశ్నలెపుడో
ఈ నేల మీదనించి పరారయ్యాయి.
మాటల తూటాలు
పేల్చిన గొంతుల్లో
తుపాకి తూటాలు దిగుతున్నాయి.
రుధిరంతో ఎరుపెక్కిన
తంగేడు పూలన్నీ
తలలు దించుకున్నాయి
ఉద్యమ కవిత్వమై
ఉసిగొల్పిన కలాలు
ఉడుకు రక్తాన్ని
ధారపోయించిన గళాలు
గంపకింది కోడిపెట్టలై
పాలకుల పంచలో
గుడ్లు పెడుతున్నాయి.
ఉద్యమాల పురిటిగడ్డ
ఊపిరి తీసుకోడానికి
నానా యాతన పడుతున్నది.
స్వామీజీలు, గుత్తేదార్లు
ఈ నేలకు పట్టాదార్లుగా
మారిన వేళలో
సామాన్యులిక్కడ
యజ్ఞంలో సమిధలయ్యారు.
సకల స్వరాలూ
మూగవోయిన ఈ మట్టిలో
‘ఏక్’తార నియంతృత్వ రాగాలను పలికిస్తున్నది!