— తాటిపర్తి బాలకృష్ణా రెడ్డి
నీదే ఇజం
నాదే ఇజం
ఏది నిజం?
ఈ ఇజాల మధ్య
నలిగేదే నిజం
మనుషుల్లో పోయిన మానవత్వం
జనాల కొచ్చిన జడత్వం
తంత్రాలతో కుతంత్రం
వ్యాకోచిస్తున్న సంకుచితత్వం
సుత్తి కొడవలి
నెత్తిన టోపీ
ఖాకి నిక్కరు
చేతిన లాఠీ
బొడ్లో కత్తి
బుగ్గన గాటు
మెడలో మాల
చేతిన శంఖం
చంకన గ్రంధం
వక్తలు ప్రవక్తలు
ఇజాలు వేరట
నిజాలు వేరట
వారిదో ఇజం
వీరిదో ఇజం
ఏది నిజం?
ఈ ఇజాల మధ్య
నలిగేదే నిజం
మసిదు మాటున నక్కే ముష్కరులు
గుడి నీడన చేరిన గాడ్సేలు
చర్చి చావిట్లో చైల్డ్ యభ్యుసర్స్
అడవుల్లో అతివాదులు
మన మధ్య మితవాదులు
ఎవరివాదనలు వారివి
నిజవాదం నేడో వివాదం
నీదే ఇజం
నాదే ఇజం
ఏది నిజం?
ఈ ఇజాల మధ్య
నలిగేదే నిజం
ఇజాల నీడలో
నిజాలు దాగవు
నిజాల వెలుగులో
ఇజాలు ఇమడవు
నిజాన్ని చూడలేని అంధులు
సాటి మనిషిలో శత్రువుని చూడగా
మానవత్వం ఎండమావే
మనుషులంతా ఒక్కటనే మిద్య
మన మద్య అద్దంలో వెక్కిరించదా
మాటలు రాని మేధావులు
చేతకాని చవటాయిలు
ఉగ్రవాదానికి వీరే
ఉత్సవ విగ్రహాలు
మానవత్వానికి మచ్చలు
ఆలోచించలేని
ఆనాగరికులు
నాగరికతకు జాడ్యాలు
నిజాలు మరచి
ఇజాలకోసం
కుతుకలు కోసే
కసాయి మనుషులు
పలికే పలుకులు
విష తుంపరులు
చేసి పనులు
రాక్షస క్రీడలు
జాతులు పేరిట
మతాలూ పేరిట
భాషలు పేర
యాసలు పేర
ఇజాల నీడలో
నిజాలు మరచి
మృగాల మాదిరి
మొరిగే వాదం
అతివాదం
మితవాదం
ఆదో ఇజం
ఇదో ఇజం
ఏది నిజం