-శైలజామిత్ర
ఈ ఏకాంత యుద్ధంలో
ఆయువు ఉన్నవాడిదే పైచేయి
భయానికి ఏ ముద్దుపేరు పెట్టుకున్నా
జరుగుతున్న సంగ్రామం మాత్రం
ఒంటరితనానికి పరాకాష్ట
స్వార్థం కమ్ముకున్న గుండెల్లోనే
అందరినీ కలుపుకోవాలనే ఆకాంక్ష
నాది. నేను పదోచ్ఛరణలోనే
మనదనే పదాన్ని చేర్చాలనే దీక్ష
అత్యాధునిక అరణ్యవాసపు ఫలితం శూన్యం!
ఇపుడు శరీరమెవరిదో పోల్చుకోవడం
అంత సులభతరం కాదని నిమ్మకున్నా
దు:ఖపు గుంటలో పడి రోదించడం
జాలి చూపలేని సంతోషం తాలూకు
తక్కెడ చప్పుడని సరిపెట్టుకున్నా
ఇది గెలిచి ఆనందించలేని ఆరోగ్యస్వామ్యమే..
అంతరాంతరాల్లోకి ఎంత తొంగి చూసుకున్నా
పేగుబంధపు ఆవేదనను ఉవ్వెత్తున ఎగసిపడేది
మానవత్వపు ముసుగు ఉన్నవాడి
ఆంతర్యాన్ని అంతమొందించానే..
బూడిదవున్న గుట్ట శవాలు
బాంధవ్యాలను వెక్కిరించేది
అంతస్తుల అంతరాలు మిగిల్చినవారి
వాస్తవాల్ని ఒక వారగా నిలబెట్టాలనే..
అనేకుల్ని మింగేసిన ఆనవాళ్ళు
ఒక్కొక్కటి కనుమరుగవుతుంటే
ఒంటరి హృదయాలో
ఎంతటి శూన్యత ఆవరించి వుంటుందో
కోల్పోయిన బంధాల తాలూకు స్పర్శ
ఎంత విలువైన కాలాన్ని కోల్పోయి వుంటుందో
తరచి చూస్తే..
ఖాళీ అయిపోయిన కన్నీళ్ళ కావళ్ళను చూసి
నివ్వెరపోయింది ప్రపంచం..
అనిపిస్తుంది ఇప్పుడే..
అబద్ధాల ఆత్మీయతలున్న మనిషిపై
ప్రకృతి ప్రకోపించడం సబబే!
ఆశాజీవి ఆహుతి అవుతూనే
జీవిత పరమార్థాన్ని వివరిస్తాడని..
మలిన పడిన మనసు మాలిన్యాన్ని కడిగి
మనిషి గుండె మీదుగా నడిచి వెళతాడని..
ఈ సమయ విరామ అనంతరం
విస్తరించిన నిశ్శబ్ధాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకుని
తలలెగరేసిన తాలూకు రోజుల్ని పాతిపెడతాడని.
అసు జీవితం ఇపుడే మొదలైంది
అనుభవించిన మనిషి అనుకూలంగా మారుతాడా..?
లేకుంటే
వందేళ్ళ జీవితం ఇలాగే ఒంటరిగా వ్రేల్లాడుతాడా..?
ఒక్కసారి విదుల్చుకుని ఆలోచిద్దాం..!
ఈ మానవ సామూహిక దు:ఖం పెచ్చు పెరగక ముందే
బతుకు మూలాలకు మరో మార్గం ఉందేమో చూద్దాం!