కళ్ళకి కనబడని నువ్వు
ప్రకృతి అంటే గౌరవం లేని వారి కళ్ళు తెరిపించావు!
ఊరిని లాక్ డౌన్ పేరుతో నిర్మానుష్యంగా మార్చిన నువ్వు
మనుషులలోని మానవత్వాన్ని వెలికి తీస్తున్నావు!
పిల్లల పాఠశాలలను మూసిన నువ్వు
వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి
సామాజిక బాధ్యతను, నమస్కారంలో ఉండే సంస్కారాన్నీ వారికి నేర్పుతున్నావు!
విందూ-వినోదాలనూ, వేడుకలనూ దూరం చేసిన నువ్వు
కానికాలంలో రైతన్న విలువను లోకానికి చాటి చెప్తున్నావు!
శుభ్రత విషయంలో కఠిన నియమాలను ఏర్పాటు చేసిన నువ్వు
పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని, ప్రాముఖ్యాన్ని తెలియబరుస్తున్నావు!
రెక్కాడితేకానీడొక్కాడని వారికి గడ్డుకాలం తెచ్చిన నువ్వు
ఉన్నవారు దానం చెయ్యడంలో ఉన్న ఆనందాన్ని పొందగలిగేలా చేస్తున్నావు!
బడుగు జీవుల బతుకులు కష్టాలపాలు చేసిన నువ్వు –
దయలేని బతుకు బతుకే కాదని తెలుసుకునేలా చేస్తున్నావు!
ఇంటి బయటకు వెళ్లలేని పరిస్థితిని తెచ్చిన నువ్వు
ఆత్మీయులతో ఎక్కువ సమయం గడిపే భాగ్యం కలిగించావు!
కాలుష్యాన్ని తగ్గించి
ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే వీలును కల్పిస్తున్నావు!
రాకపోకలను నిలిపి బంధాలను దూరం చేసిన నువ్వు
కుటుంబ బాంధవ్యాల విలువను గ్రహించేలా చేస్తున్నావు!
అమాయకులను కబళించి జగమంతా వ్యాపిస్తున్న నువ్వు
అలుపెరగక నిరంతరం అత్యవసర సేవలను అందిస్తున్న
వైద్యులకు, సిబ్బందికి
పాలకులకు, మా పోలీసులకు
వారి ఓర్పుకీ, నేర్పుకీ మా అందరి జేజేలు !!
వారి సహనానికి కట్టడి అవ్వక తప్పదు
శుభ్రత అనే అస్త్రంతో ఈ లోకమంతా ఏకమై నీతో పోరాడితే
ఆ సంకల్పబలమే శ్రీరామబాణమై నిన్ను సంహరింపక మానదు!!!
‘వసుధైక కుటుంబం’
‘ఐకమత్యమే మహాబలం’