– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
కవిత్వం మనసును పులకింపచేస్తేనే కదా
అక్షరలతలు నలుదిశలా పరిమళించేది
కవిత్వం సాహితీ కుసుమాల సౌరభం
కవిత్వం తరంగమై ప్రవహిస్తేనే కదా
కొత్తదారులను లోకానికి పరిచయం చేసేది
కవిత్వం నవరాగాల నవరససమ్మేళనం
కవిత్వం సాగరమై పోటెత్తితేనే కదా
గుండెలోని బాధల దుఃఖాన్ని ఒంపుకునేది
కవిత్వం కనిపించని రహస్యనేత్రం
కవిత్వం నదీప్రవాహమై పారితేనే కదా
కవితావింజామరలు వికసించి నాట్యమాడేది
కవిత్వం నవపల్లవుల మృదంగనాదం
కవిత్వం అక్షరసౌరభాలను వెదజల్లితేనే కదా
తెలుగు సాహిత్యం కలకాలం నిలిచిపోయేది
కవిత్వం వెలుగుపంచే సహస్ర రవికిరణం