– అభిరామ్ ఆదోని
తెల్లవారగానే
చద్దికట్టుకుని
చకచకా నడిచి
శ్రమించే స్థలం చేరుకుని
చొక్కా తీసి బనీయన్ వేసి
బ్రతుకుకు ఆయుష్షుపోస్తూ
మెతుకులిచ్చే పనిముట్లకు మొక్కి
పార గంపలు పట్టి
పుప్పొడిని తలదన్నే ఇసుకను కొలిసి
రాసిగా పోసి
సిమెంట్ బస్తాలను భుజానమోసి
మిశ్రమాన్ని కలిపి
గోడమీద గోడను నిలిపి
నీటితో తడిపి
మేడ నిర్మించి
రంగులతోటీ హంగులద్ది
ఇన్నాళ్లు స్వేచ్చగా తిరిగిన భవనంపై
వైరాగ్యమొచ్చినట్లు
పసిపాపలా నవ్వుతూ
మరో ప్రాంతానికి కదిలిపోయే
కార్మిక వందనాలు
నీ శ్రమకు పాదాభివందనాలు