– తాటిపాముల మృత్యుంజయుడు
మనిషి జీవితాన్ని కాలకూటం కబళిస్తున్న వేళ
మనుగడయే ప్రశ్నార్థకంగా మిగులుతున్న వేళ
షడ్రుచుల్లో చేదు మాత్రమే జిహ్వకు తగులుతున్నది
కోకిల గానంలో కైకల నిషాదమే వినబడుతున్నది
ఎటునుండి మృత్యువు కాటేస్తుందోనన్న భయంతో
నాలోనికి నేనే కుదించుకొని శ్వాసను బిగపట్టేస్తే
కాలగమనాన్ని లెక్కించటానికి శూన్యమే మిగిలినప్పుడు
ఇక బాహ్యంలోని వసంతాన్ని ఏ గీతంతో ఆహ్వానించేది
పంచాంగంలో పూజ్యం ఎంత అని ఎలా తెలుసుకునేది
కరడుగట్టిన కరోనా భూతాన్ని సీసాలో బిగించిన వేళే
నవశకానికి నాందీ ప్రార్థన ఆలాపించేది
కొంగ్రొత్త ఉషోదయాన్ని ‘శ్రీరామ ‘తో ఆరంభించేది
ఆ శుభఘడియ కొరకు వేచిచూద్దాం, శార్వరీ!
అప్పటివరకు నన్ను పెద్ద మనసుతో క్షమించు!