~ తిరునగరి శరత్ చంద్ర
హైదరాబాద్
అనురాగమె గీతంగా రాయాలని ఉంది
సమభావన గమ్యంగా సాగాలని ఉంది
జుత్తులూగె మతులుంటే మునుముందుకు రమ్మంటా
కుటిలమతుల గుండెలనూ చీల్చాలని ఉంది
నిరుపేదల వసంతానికెదురుపడే శిశిరాన్ని
కత్తిలాంటి కలము తోటి కూల్చాలని ఉంది
పదునెరిగిన భావంతో గేయమొకటి రాసేసి
ప్రళయం ఎదురైన వేళ పేల్చాలని ఉంది
మహనీయులు చూపినట్టి ప్రగతిపూల బాటలో
వినయంగా బతుకంతా నడవాలని ఉంది
మంచిని వంచన జేసే దుర్మతులెదురైనప్పుడు
నిప్పులెగయు కన్నులతో కాల్చాలని ఉంది
కుళ్ళుకునే కళ్ళెన్నో పైబడినా ఓ ‘శరత్’
ఆత్మశక్తితో జగాన్ని గెలవాలని ఉంది