– – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
పదిమందికి విద్యాగంధాన్ని పంచితేనే కదా
నిరక్షరాస్యత నిర్మూలన సతతం జరిగేది
చదువు ఎప్పటికీ వాడని వసంతపరిమళం
జ్ఞానకుసుమాలను సదా ఆస్వాదిస్తేనే కదా
మనలోని అజ్ఞానాంధకారం తొలిగిపోయేది
చదువు మానవవికాసానికి విజయసోపానం
మేధోమధనం నిత్యం మదిలో రగిలితేనే కదా
ఆనంతమైన విజ్ఞాన అంచులను చుంబించేది
చదువు పరిశోధనపూలు పూచే గంధంచెట్టు
విద్యార్థులు విద్యావంతులై వికసిస్తేనే కదా
అక్షరపూలు మహిలో విద్యాగంధాన్ని వెదజల్లేది
చదువు భావితరానికి మార్గం చూపే చుక్కాని
ఆనందాలను నిరంతరం అనుభూతిస్తేనే కదా
ఉపదేశపు సంస్కారబీజాలు నాటుకుపోయేది
చదువు భవిష్యత్తుకు బాటవేసే రహదారి