– కోడం పవన్ కుమార్
శాపం కాదు
వ్యాధి అంతకన్నా కాదు
అది రెండో బాల్యం
క్షణం గడుస్తుంటే వయస్సు పెరుగుతుంటుంది
వయస్సు పెరిగేకొద్దీ
ముసలితనంతో పాటు పెద్దరికం వస్తుంది
భూమ్మీద ఉండటం శాశ్వతం కాదు
పుట్టడమే దేహ నిష్క్రమణ కోసం
బాల్య కౌమార యౌవ్వనదశలెంత సహజమో
వార్ధక్యం అంతే సహజం
వయస్సు పెరిగేకొద్దీ
సామర్థ్యం తగ్గుతుంది
ఆరోగ్యం క్షీణిస్తుంది
అంతమాత్రాన కుంగిపోవటం వివేకం కాదు
మనఃసామర్థ్యం పదిలపరచుకోవాలి
శరీరాన్ని విల్లులా వంచడానికి
యోగాసనాలను స్వాగతించాలి
మనస్సు మలినపడకుండా ధ్యానం దరిజేర్చుకోవాలి
శరీరథర్మంగా దేహం బలహీనపడినా
జ్నానార్జన వెలుగుతూనే ఉంటుంది
మనస్సు ఆరోగ్యంగా ఉంటే
దేహారోగ్యం నిగనిగలాడుతుంటుంది
వ్రుద్ధాప్యం మరణానికి దగ్గరి మెట్టు కాదు
జీవిత గమనంలో ఓ దశ మాత్రమే
గడిచే ప్రతిక్షణాన్ని అమ్రుతంలా పొందాలి
జీవితాన్ని పండించుకుని
జీవన సాఫల్యం పొందాలి
***