– కారుణ్య కాట్రగడ్డ
జీవితంలో ఓ భావమేదో మేఘమైనపుడు
గొంతు మధ్యలో ఇరుక్కున్న వెక్కిళ్ళలా
కనురెప్పల మాటున దాగిన ఆవేదనల్ని
నిశ్శబ్దం లోపల తవ్వుకుంటున్నపుడు..
చిరునామాగా శూన్యాన్నే తీసుకుని
నా ప్రస్థానంలో మరో మజిలీ మరో అతిధేయత్వం….
అర్థమే అవసరం లేని బంధంలా
మనసులు స్ఖలించుకోవడం మొదలయ్యాక…
చీకటి రాత్రుల్లోనూ,పగటి మేఘాల్లోనూ
మోసాడు!నా మాటల బరువంతా…
మిణుగురు పురుగుల వెలుగుల్లోనూ,
రెప్పల కింద చీకటి లోను
గుండెలో చేరిన చెమ్మని బరువెక్కిన
మనసుతో ఎప్పుడో ఈదేశాడు!
మనసు పొగిలినపుడల్లా
జీవిత కహానికి
కంటిరెప్ప అసూయ పడిందేమో
ఆనందమో,ఆర్ద్రమో అర్థం తెలీక!
నిన్ను కప్పుకున్న క్షణం
నా మనసుకి,నీ ప్రేమకి మధ్య
ఇరుక్కున్న క్షణాలన్నీ అసూయ పడాల్సిందే!
‘నేన’నే అద్దంలో కూడా నీకు లొంగిపోని
క్షణమేది నాకక్కర్లేదన్నప్పుడు…
జీవితంలో ఈ క్షణమే శాశ్వతమన్న
నీ కళ్ళలోని ఆనందమూ,
నాకు దూరంగా వుండలేనన్న ఆ క్షణమూ…
నన్ను నీలోకి ఒంపేసుకున్న మనసుకెంత నగ్నత్వమని
మనసుపై తడి ఆరని సంతకంలా….
ఓ షెహనాయి వేదనలా
నువ్వెప్పుడు నాకో అద్బుతమే….
నీ ప్రతి వాక్యమూ నాకో నిషాదమే!
***