~ తిరునగరి శరత్ చంద్ర
హైదరాబాద్
చంద్రుడు వెన్నెల దుప్పటి కప్పుకుని
వెచ్చగా పడుకున్నాడు
రేయి మంచంపైన
నక్షత్రాలు లాలిపాట పాడుతున్నాయి
మబ్బులు వీవన వీస్తున్నాయి
తన నీలి నీలి ముంగురులు
గాలికి రెపరెపలాడుతుంటే
ఉలిక్కిపడి నిద్రలేచాడు చంద్రుడు
ఇది యేమిటి
వింతగా ఉందే!
పసిపాపలను నిద్ర పుచ్చడానికి
‘చందమామ రావే జాబిల్లి రావే’ అని
జోలపాటలు పాడే తల్లులకు
ఉపయోగపడే ఈ చంద్రునికి
లాలిపాటలు పాడడం
కొత్తగా గమ్మత్తుగా ఉందే
అనుకుంటూ మళ్లీ మెల్లగా
నిద్రలోకి జారుకున్నాడు చంద్రుడు.
నిదురపోతూ ముద్దొస్తున్న
చంద్రునికి దిష్టి తీయడానికి
చీకటిరేఖను త్రుంచిందొక మేఘం.
చంద్రుడు హాయిగా
నిదురపోవడానికి
తీయతీయని
రాగాలను వాడుకున్నాయి
నక్షత్రాలు తమ లాలిపాటలో..
సౌందర్యం వర్షించే
సౌజన్యం దీపించే
సౌశీల్యం నడయాడే
సౌకుమార్యం జాలువారే
ఆ చంద్రున్ని చూసి స్వర్గలోకాలు చిన్నబోయాయి.
మనోవీవనలతో వీచి చంద్రున్ని నిదురపుచ్చాయి.