అక్టోబర్ 7న న్యూజెర్సీ నగరంలో విజయవంతంగా జరిగిన తెలుగు సాంస్కృతికోత్సవం పై ఒక ప్రేక్షకుడి అనుభూతి:
నూట నలభై అక్షరాల్లో సంభాషణలు; మూడు నిమిషాల కంటే ఎక్కువగ దేని పైన దృష్టి పెట్టడం కష్టంగా వున్న ఈ రోజుల్లో; WhatsApp ఫార్వర్డ్లు; ఫేస్ బుక్ లైక్ ల మధ్య, అతి వేగంగా గడిచి పోతున్న కాలం ఇది. నిలకడగా వుండి, ఏ ఆర్భాటం లేకుండ, ఏ సెన్సేషన్ లేకుండ కేవలం మన సంస్కృతి,సాంప్రదాయం మరియు చరిత్ర ను గుర్తించి, గౌరవించాలన్న ఒకే ఒక ఉద్ధేశంతో ఒక కార్యక్రమం చెయ్యాలనుకోవడం గొప్ప ఆలోచన.
ఆలోచన గొప్పగ వుంటే సరిపోదుకదా. దానిని అంతే గొప్పగా అమలుపర్చాలి. అందులోను, ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయాలి. అసలు ఇది సాధ్యమా?
ఇలాంటి సాహసమే నిన్న సిలికాన్ ఆంధ్ర మనబడి వారు చేశారు, చేసి గెలిచారు, గెలిచి మెప్పించారు.
ఆరు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో, జానపద గేయాలు, నృత్యాలు, మన పండగలైన ఉగాది నుండి ముస్లింలు జరపుకునే మొహరం వరకు, నిజాం తో పోరాటం నుండి స్వాంతంత్ర పోరాటం వరకు చక్కగ, అధ్భుతంగా పూస గుచ్చి దండను అమర్చినట్టు అమర్చారు. ఇందులో పాల్గొన్నది రంగస్థల నిపుణులు కాదు, సాధారణమైన 9 టు 5 ఉధ్యోగస్థులు, వారి పిల్లలు.
ఇదంతా ఒక ఎత్తు ఐతే, ఈ కార్యక్రమాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళారు – వయోలిన్ వేణు, ఫ్లూట్ ఫణి మరియు వారి బృందం. వెస్టెర్న్ మ్యూజిక్ ని భారత క్లాసికల్ ను, ఒక సరికొత్త విధానం లో ప్రదర్శించారు. దాదాపు తొంభై నిమిషాలు జరిగిన ఈ ప్రయోగం లో, ఒక్క సినిమ పాట లేకుండ, ప్రేక్షకులను అలరింపచేయడం అనేది విశేషం.
సినిమా ప్రభావం లేకుండ – అంటే, సినిమా పాటలుగాని, సినిమా డాన్సులుగాని, సెలెబ్రిటీలు గాని లేకుండ, ఈ కార్యక్రమాన్ని జరపడం మరింత గొప్ప విశేషం.
కార్యక్రమాలే కాకుండ, వేళకు ఆరంభించటం, కార్యక్రమాల మధ్యలోనే క్రమం తప్పకుండ, ప్రేక్షుకుల సమయాన్ని గౌరవిస్తూ, ప్రసంగాలు ఇవ్వకుండా, ఇలా ఎన్నో విషయాలల్లొ ఒక క్రమశిక్షణ పాటించటం ఎంతో అభినందదాయకం.
ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చని, చేస్తే జనం చూస్తారని, చూసి అభినందిస్తారని నిరూపించిన సిలికాన్ ఆంధ్ర మనబడి కి మరీ మరీ కృతజ్ఞతలు.
సిలికాన్ ఆంధ్ర మనబడి వారి తెలుగు సాంస్కృతికోత్సవం – ఒక ప్రేక్షకుడిగా నా ఆలోచనా స్థాయిని పెంచారన్న గొప్ప అనుభూతిని మిగిల్చింది