– డా.దూసి పద్మజ
బరంపురం
ఇప్పుడు విమానంలో
ఎగురుతున్నది నేనేనా?
ఏ.సి కార్లు, క్రాఫింగ్ జుట్టు,
బంగారు నగలు, హై హీల్స్,
చీనీ చీనాంబరాలు,
ప్రశ్నలు, ప్రశంసలు,
తన కోసం పచార్లు,
పలకరింపులు
అంతా వింత !
బాల్యమంతా మసక
ప్రౌఢమంతా పరాయి పంచన
పన్నెత్తి పలకరించే వారు లేరు
కన్నెత్తి చూసే ఆత్మబంధువులూ లేరు.
అంతా అంధకారం
అంతా కొరతే.
చాలీ చాలని తిండీ, బట్టా..
బువ్వే బూరి
గంజే పానకం రోజులు.
అంతా విధి రాత అనుకోనా?
లేదా కన్నవాళ్ళ అసమర్ధత అనుకోనా?
అంతా ముళ్ళ దారే
అయినా
భయపడలేదు.
ఆశల్ని చంపుకుని,
ఆవేదనని అణుచుకుని,
ఆశయాన్ని విడువ లేక
అవమానాన్ని తట్టుకుని,
ఆపన్నహస్తం కోసం ఎదురు చూపులెన్నో
అయినా నిరాశపడలేదు.
పెళ్ళి పేరుతో
వదిలించు కున్న పెద్దలు.
అత్తింట అన్నీ ఆరళ్ళే.
నీ గుండెని తాకే
ఒక్క మనిషైనా లేడు.
అందరూ నీకు గుదిబండలే.
ఏకాకివై శ్రమిస్తున్న రోజులు
ఏరువాకై పారుతున్న
ప్రవాహంలో
కొట్టుకుపోతున్న సమస్యలు.
ఆర్చే వారు లేక,
తీర్చే వారు లేక
అలమటించి
నిన్ను నీవే సమర్ధించుకుని
విశ్వాసంతో,
ఆత్మస్థైర్యంతో
అడుగులో అడుగు వేసుకుని
జీవిత పాఠాలు నేర్చి,
పరుగెత్తి,
పోరాడి,
గెలిచి,
నిలిచి
నీదైన మార్గాన్ని సృష్టించుకున్నావు.
గతమంతా
కన్నీళ్ళూ కడగండ్లే,
భవిష్యత్తు అంతా
బూడిదే అని
అనుకున్న నీవు
ఆ బూడిద నుండి
విస్పులింగంలా
బైటికి వచ్చి,
వెలుగు జిలుగులు వెదజల్లి
అనుభవజ్యోతిగా
సుకీర్తి దీపంలా
వెలుగుతున్న
నీ జీవితం
మహిళా లోకానికే
మకుటాయమానం.
***