– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
అమ్మకుకూడా కొరుకుడుపడని కోపం ఉంటుంది,
అది అప్పుడప్పుడూ తన విశ్వరూపాన్ని చూపుతూనే ఉంటుంది,
కానీ,తరుచూ శాంతం దాన్ని అధిగమిస్తూ ఉంటుంది.
అమ్మకుకూడా లోలోపల దహించే ద్వేషం ఉంటుంది,
అది అప్పుడప్పుడూ పడగవిప్పి నాట్యమాడుతూనే ఉంటుంది,
కానీ, తరుచూ ప్రేమ దానిని అధిగమిస్తూ ఉంటుంది.
అమ్మకు కూడా దుర్గుణాలు కొన్ని ఉంటాయి,
అవి అప్పుడప్పుడూ తమ ఉనికిని చాటుతూనే ఉంటాయి,
కానీ,తరుచూ సుగుణాలు వాటిని అధిగమిస్తూ ఉంటాయి.
అమ్మకి కూడా పక్షపాత బుద్ధి ఉంటుంది,
అది అప్పుడప్పుడూ తన పవర్ ఫుల్ పాత్రను పోషిస్తూనే ఉంటుంది,
కానీ,తరుచూ సమత్వబుద్ధి దానిని అధిగమిస్తూ ఉంటుంది.
ఆవేశం,కావేశం అమ్మకు కూడా తప్పనిసరిగా కలుగుతుంటాయి,
అవి అమ్మను వశపరుచుకోవాలని ఉవ్విళ్ళుఊరుతూనే ఉంటాయి,
కానీ, తరుచూ ఆవేశాన్ని ఆత్మీయత,
కావేశాన్ని ఆర్ద్రత అధిగమిస్తూ ఉంటాయి.
అవివేకం,అసహనం అమ్మను కూడా తప్పనిసరిగా ఆవరిస్తూ ఉంటాయి,
తమ చెంచలత్వంతో అమ్మచేవని చెదరగొట్టాలని చూస్తూనే ఉంటాయి,
కానీ, తరుచూ అవివేకాన్ని విజ్ఞత,
అసహనాన్ని ప్రజ్ఞత అధిగమిస్తూ ఉంటాయి.
స్వార్ధం,లోభం అమ్మకు కూడా తప్పనిసరిగా కలుగుతుంటాయి,
తమ చేతుల్లోనికి అమ్మని తెచ్చుకోవాలని చూస్తూనే ఉంటాయి,
కానీ, తరుచూ స్వార్ధాన్ని త్యాగం,
లోభాన్ని మార్ధవం అధిగమిస్తూ ఉంటాయి.
అమ్మకి కూడా కోరికలు ఉంటాయి,
అవి తీరే దారుల కోసం చూస్తూ ఉంటాయి,
కానీ, తరుచూ ఆ దారులు మూసుకుపోయే ఉంటాయి.
అమ్మకి కూడా కన్నీటి చారికలు ఉంటాయి,
వాటిని తుడిచే చేతుల కోసం చూస్తూ ఉంటాయి,
కానీ, తరుచూ ఆ చేతులు తమ చేతలను కోల్పోయే ఉంటాయి.
ఎన్ని ప్రతికూలాలు తనకుఎదురైనా,
తననుమాత్రం తనకు అనుకూలంగానే మలుచుకుంటుంది.
అంధకారమెంత దీర్ఘమైనదైనా ఆరని జ్యోతిలా
అమ్మ తన ఆశ(యాన్ని)ని నిలుపుకుంటుంది