– సుమ (సుమన నూతలపాటి)
జడి వానల వాగుల్లోన పడవలతో
చిరుగాలిలో గాలిపటాల సరిగమతొ
జీవితాంతం సరిపడాల్సిన చదులతో
చిరునవ్వులతో ఆపెయలేని నవ్వులతో…
నా బాల్యం యెక్కడికెళ్ళింది?
నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది?
ఆశలతో బారులు తీరిన ఆకాశం
పరువాలతో పరిగెత్తించేే పరవశం
ఏ కొండని ఢీ కొట్టాలనీ ఆవేశం?
నవ జీవన నాడులు పాడే ఆ నాదం
నా యవ్వనమెక్కడికెళ్ళింది?
నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది?
నవ వధువై అడుగు పెట్టిన జీవితం
నా తోడై నిలిచిన వ్యక్తి సాంగత్యం
నను గన్న వాళ్ళు చూపిన ఆదర్శం
నే గన్న వాళ్ళు నేర్పిన ఆరాటం
నా కాపురం యెక్కడికెళ్ళింది?
నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది?
నా బిడ్డల రెక్కల బలంలో నా గర్వం
నే నేర్పిన పాఠాలన్నిటి ప్రతిబింబం
చిట్టి పాపల కేరింతలతో కైవల్యం
మానవత్వపు విలువలు పెంచే పోరాటం
నడి వయసు యెక్కడికెళ్ళింది?
నన్నొదిలి యెన్నాళ్ళైయ్యింది?
నా అడుగులు తడబడి పోడం సాధ్యమా?
మేధస్సు మరుపున పడటం నమ్మనా?
మనసులో మాటలు నోటికి దారి తప్పునా?
మానవ జన్మ మనుగడకింక అతిధినా?
నా జీవితం యెక్కడికెళ్ళింది?
నాతోనే వుంటూ మరుగైంది