– కారుణ్య కాట్రగడ్డ
పెదవుల నవ్వుల వెనుక
భారమైన హృదయాన్ని మోస్తున్న
రెండు పాదాల గాయాలను
అనుభవాలుగా మార్చుకుని
కొన్ని క్షణాలైన విశ్రమించాలని
అలసిన దేహం మనసులోకి జారిపోయి
నవ్వుకుంటూనే ఉంది వేదనగా
కలల కాన్వాసు పై గీసిన చిత్రం
నిశ్శబ్దం ఆలపిస్తున్న సరిగమలు
చీకట్లోకి జారిపోతున్న జీవితం
వెంటాడుతున్న ఒంటరితనం
అంతరంగంలో ఆగని అంతర్యుద్ధం!
బాధతో జారుతున్న కన్నీళ్లు
బంధంతో ముడి వేసిన సంకెళ్లు
అంతర్ముఖంగా
ఆగిన పాదాలకు జీవం పోసుకుంటూ
నిన్నటి నిస్పృహ నుండి వెలుగును వెతుక్కుంటూ
జీవితాన్ని నిర్మించుకోవడంలో
ఓటమి గాయాన్ని గుండెలో దాచుకుని
గెలుపు దారుల్లోకి
ఆశ నిరాశల గాలిపటంలా
గమ్యం తెలియని ఒంటరి ప్రయాణం
తీరాల మధ్య నిశ్శబ్దం ఘనీభవించినట్టు
ఒక్కోసారి మనసు సముద్ర తరంగమౌతుంది
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండని మనసు
అలసిన దేహాన్ని కుట్టుకుంటూ అతికించుకుంటూ
ఆశల తీరం వైపు అడుగేస్తూ
ప్రతి ఘడియ అదో మరుపురాని మజిలీ…
***