– తమిరిశ జానకి
గ్యాస్ మీద వంటేనా
ఇరవైనాలుగ్గంటలూ నీళ్ళొస్తాయా
విమ్ సోపేనా తోమేందుకు
బట్టలుతికే మిషనుందా
ఆరేసేందుకు నువ్వు నాకు సాయంచేస్తావా
ఒకపూటే ఇల్లూడుస్తా వారానికోసారే పోఛా చేస్తా
రోజూ చాయ్ నాస్తా ఇస్తావా
పండగ పండగకీ కొత్తచీరిస్తావా
రెండునెల్లకోసారి పాతచీరిస్తావా
ఆదివారాలు సెలవిస్తావా
అదికాక నెలకి నాలుగైదురోజులు మానేస్తే
నాగాలు కట్టకుండా ఉంటావా
పెద్ద టీ.వీ.ఉందా పనికీ పనికీ మధ్య
నాకిష్టమైన సీరియలే పెడతావా
ఏరోజు ఏసీరియల్లో ఎక్కువ ఏడుపు నాకొచ్చినా
ఆరోజు పని పూర్తిగా చెయ్యలేను
నువ్వే చేసుకోవాలి మరో చాయ్ ఎగస్ట్రా ఇవ్వాలి
ఓ.కే.నా ఆన్నింటికీ ఊ అంటే చెప్పు
ఇప్పుడే పన్లోకి ఉరుకుతా
కత్తిలా దూసుకుపోతా
నీ పని చూసుకుంటా !
****