– పారనంది శాంత కుమారి
విదేశాలకు వెళ్లిపోతూ విచిత్రంగా పిల్లలు,
వారిబుద్ధి నెరగలేక విచారంతో పెద్దలు.
రెక్కలొచ్చి అక్కడికి ఎగిరిపోయిన పిల్లలు,
ముక్కలైన మనసుతో ఇక్కడే మిగిలిపోయిన పెద్దలు.
కొత్త ఉద్యోగంలో అక్కడ పిల్లలు,
కొత్త ఉద్వేగంతో ఇక్కడ పెద్దలు.
అక్కడ సంపాదనకై ప్రాకులాడుతూ పిల్లలు,
ఇక్కడ మనోవేదనతో మగ్గిపోతూ పెద్దలు.
అక్కడ సంపాదించుకున్నడబ్బులతో పిల్లల జల్సాలు,
ఇక్కడ ఆపాదించుకున్నజబ్బులతో పెద్దల నీరసాలు.
ఇక్కడున్న పెద్దలదృష్టి తమపిల్లల పైనే,
అక్కడున్న పిల్లలదృష్టి మాత్రం వాళ్ళపిల్లల పైనే.
భార్యాపిల్లలే లోకం అక్కడ పిల్లలకి,
పిల్లలు దూరమై శోకం ఇక్కడ పెద్దలకి.
గంటలను కేష్ చేసుకుంటూ అక్కడ పిల్లలు,
నిముషాలను లెక్కపెట్టుకుంటూ ఇక్కడ పెద్దలు.
అక్కడ కాస్ట్లీ ఇల్లు కొనుక్కొని పిల్లలు,
ఇక్కడ కాటికి కాళ్ళు చాచుకొని పెద్దలు.
అక్కడ శాశ్వత నివాసంకై
ఆ దేశం గ్రీన్ కార్డు కోసం పిల్లఎదురు చూపులు,
ఇక్కడ శాశ్వత పయనానికై
ఆ దైవం గ్రీన్ సిగ్నల్ కోసం పెద్దల పడిగాపులు.
ఆవేశమేతప్ప ఆలోచనలేని స్థితిలో అక్కడ పిల్లలు,
ఆయాసమేతప్ప ఆనందంలేని గతిలో ఇక్కడ పెద్దలు.
తమ ఎదుగుదలకు ఉపయోగపడిన మెట్లను
విడిచి వెళ్ళిపోయిన పిల్లలు,
తాము చిదిగిపోయి మెట్లుగానే
మిగిలిపోయామనే వేదనలో పెద్దలు.
గతంలో చేసుకున్నపాపానికి
శిక్షను అనుభవిస్తూ ఇక్కడ పెద్దలు,
భవిష్యత్తులో శిక్షను అనుభవించటానికి కావాల్సిన
పాపాన్నిసంపాదించుకుంటూ అక్కడ పిల్లలు.
మమ్మల్ని చూసైనా నేర్చుకోండని పెద్దలు,
మావరకూ వచ్చినప్పుడు చూసుకుంటామని పిల్లలు