:: పి.వి నరసింహా రావు ::
రచన : శ్రీధరరెడ్డి బిల్లా
దిక్కుతోచక కాంగ్రెసోళ్లు దిక్కులు జూచిన వేళ
నిక్కంగ కనబడె రాజనీతిజ్ఞుడు పి.వి.న.రావు!
చక్కదనమతని తెలివి. చక్కదిద్దెను ఆర్థికమును!
నొక్కడు పద్నాల్గు నుడులు నుడివిన మన తెల్గువాడు!
‘నేను’, ‘నా’దను వాదములను నిరసించి,’మన’దని పలికి,
తాను దేశముసేవ తప్ప, తక్కిన స్వార్థమెరుగడు!
కానని కటిక చీకట్లు కమ్మి దేశ దరిద్రమపుడు,
చాణుక్యుడై దేశమెల్ల సంస్కరణలు జేసిపెట్టె!
పలువురు పలుభాషలందు పలుకుచున్నట్టి దేశమున
నిలుచొని ప్రత్యుత్తరముల నిచ్చె వార్వారి భాషలొన !
పలు కావ్యముల చదివి పలుపలు భాషలకనువదించి,
తెలుగు సాహిత్య వెలుగుల దెల్పిన సాహితీవేత్త!
దక్షిణాదికెపుడు గూడ దరిచేరని ప్రధాని పదవి!
దక్షత జూసి వరించె! దక్షిణాదానంద మొందె!
పక్షపాతమసలు లేని పరిపాలనను జూడగ, ప్రతి
పక్షము మెచ్చుకొన్నట్టి భరతమాతకు ముద్దుబిడ్డ!