– తాటిపాముల మృత్యుంజయుడు
మాయంటావా? అంతా మిథ్యంటావా?
అని అనలేదా శ్రీశ్రీ నీవలనాడు?
నీవే నేడుంటే, ఈ బ్రతుకే కనివుంటే
ఒట్టు తీసి గట్టున పెడతావ్
ఒక స్వప్నం అని ఒప్పేసుకొంటావ్
కలయో లేక వైష్ణవ మాయయో
కంటిచూపును కప్పేస్తున్న తెరయో
కంప్యూటర్ నడిపిస్తున్న లీలయో, మరి
కృత్రిమ మేధస్సు ఆడిస్తున్న ఆటయో
చూసేదంతా నిజమే కాదు
చూడనిదంతా లేదని కాదు
చూసి చూడని చూపుల మధ్యలో
చోద్యం చూస్తున్న జీవితం మాది
జైలు సెల్లులో చీకట్లో మూలన ఖైదీ
ఆఫీసులో నల్లకోటులో అతని న్యాయవాది
గంతలు కట్టిన దేవతతో కోర్టులో న్యాయమూర్తి
అంతర్జాలంలో జరిగే వాదోపవాదాలు
వినిపించే తీర్పులు, విధించే శిక్షలు
ఈ వింతను ఎపుడైనాగన్నామా? కనులారా చూసామా?
స్వచ్ఛంగా, ఉచ్ఛారణ దోషం లేకుండా
ఫోనులో చిలుక పలుకులు పలికే చిన్నది
అచ్చంగా జవసత్వాలున్న గుమ్మ కాకపోవచ్చు
టెక్నాలజీ సృష్టించిన టక్కుఠవళీ ఐవుండవచ్చు
పడకగదిలో ఒడిలో ల్యాపుటాపుతో శయనించవచ్చు
ఆఫ్రికా సఫారీలో మాత్రం గజారోహణం చేయవచ్చు
పెరట్లో కూర్చొని వర్చువల్ సమావేశంలో వుండవచ్చు
నెత్తిమీద వేలాడేదేమో పండుచెట్టుకొమ్మ
వెనుక చూపించేది మాత్రం నయగరా జలపాతం బొమ్మ
తిమ్మిని బమ్మిని చెయ్యొచ్చు
మసిపూసి మారేడుకాయగా మార్చొచ్చు
అరచేతిలో వైకుంఠం చూడొచ్చు
అంగుళం మెదలకుండా
కడుపులో చల్ల కదలకుండా
అంతరిక్షంలో నవగ్రహ ప్రదక్షిణం చెయ్యొచ్చు
మలినిద్రలో కదిలే కలవలె
మండుటెండలో అందని ఎండమావివలె
చీకటిలో రజ్జువు సర్పంవలె
virtual జీవితం ఈనాటి న్యాయం