కవితా స్రవంతి

ముసలోడు

– శ్రీధరరెడ్డి బిల్లా

పెచ్చులూడి పోయిన ఆ పెంకుటింటి ముందు

నవ్వారు మంచంపై నడుము వాల్చిన ముసలోడు!

తనను ఒంటరి వాణ్ణి జేసి పోయిన తన ఇంటిదాన్ని

మింటి చుక్కల్లో వెతుకుతూ కంటిరెప్ప వేయనేలేదు!

గుడ్డిదీపమున్న ఇంట్లో గూళ్ళు కడుతున్న సాలీళ్లు.

మూతలేని గిన్నెపై ముసురుకుంటున్న ఈగలు .

అన్నం మెతుకులకు అటూఇటూ తిరుగుతున్న బొద్దింకలు !

వచ్చీరాని వంట! ఏం వండుకున్నాడో ?ఏం తిన్నాడో?

“తిన్నావా..?” అన్న చిన్నపిలుపు కూడా రాదని తెలిసిన

చెవులు మొరాయించి ఎప్పుడో చెవిటివాణ్ని చేశాయి!

ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో?

పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమిచూశాడు .

ముసల్ది మరణించిందని ఓక్షణం పాటు మరిచాడేమో

ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది!,

కళ్ళకు పొరలు వచ్చి కంటిచూపు మందగించిందేమో

పగిలిన అద్దాల కళ్ళజోడు కోసం చేతులు తచ్చాడుతున్నాయి!

కుఱ్ఱవాళ్ళు నలుగురు , కళ్ళకు ఏ పొరలు కమ్మెనో కానీ,

ఫోన్లలో చూసుకుంటూ, ఏవో పోటీలు పడుకుంటూ

పక్కనుంచే పోతున్నా ముసలోన్ని పలకరించనే లేదు!

బతుకుదెరువు కోసమని పట్నంబాట పట్టిన ఓ కొడుకు

ఎంత దూరం దాటి పోతే అంత ఎక్కువ రూకలంటూ

రాజ్యం దాటిన మరొకడు, దేశమే దాటినవాడు ఇంకోడు!

తిరిగి చూడనే లేదు ! ఎంత ఎత్తుకు పెరిగిపోయారో?

ఎంత వెనకేశారో గానీ వెనుకున్న తండ్రిని విస్మరించారు.

మూటలెన్ని ముడులేశారో గాని మాటలే మరచిపోయారు.

ఎన్నెన్ని గెలిచారో కానీ తండ్రిని మాత్రం ఓడించారు .

డబ్బు కాగితాలెన్ని మడతబెట్టారో కానీ ఆ మడతల మాటున

ముడతలు పడిన ఈ ముసలి ప్రాణం మాత్రం గుర్తుకురాలేదు.

వంగిన వెన్నుముకను ప్రాణంలేని చేతికఱ్ఱ నడిపిస్తుంటే,

తాను నడక నేర్పిన కొడుకులు తనకు పడక పేరుస్తున్నారు!

తాను చిన్నప్పుడు తన తాత పక్కన కూచుంటే

విలువైన తన అనుభవాలను, విలువలు నేర్పే కథలను,

ముచ్చట్లను చెప్పి ముద్దుపెట్టి, బోసినవ్వు నవ్వుతూ

తన తలను ప్రేమగా నిమిరే తాత ముఖం గుర్తుకొచ్చింది!

మరిప్పుడు తానూ అయ్యాడు, పేరుకే ఒక తాత

మనుమలను, మనుమరాళ్ళను చేరలేని తలరాత!

బోసినవ్వు మాయమై బోసిపోయింది ముఖమంత

అమాయకంగ చూస్తున్నాడు మాయదారి విధిచెంత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked