– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
సుఖదుఃఖాల ఆటుపోట్లను తట్టుకుంటున్నప్పుడల్లా
కవిత్వం సాగరంలా తీరంవైపు పరుగెడుతుంటుంది
బీడుగుండెలలో దాహార్తిని తడిపే ప్రవాహిని కవిత్వం
సమాజగతిని నిత్యం పహరాకాస్తున్నప్పుడల్లా
కవిత్వం జెండాలా రెపరెపలాడుతుంటుంది
నిరంతర ఆర్తనాదాల అలల కచేరి కవిత్వం
కవిత్వంతో కాసేపు ముచ్చట్లు పెడుతున్నప్పుడల్లా
కర్తవ్యాన్ని బోధించమని సందేశమిస్తుంటుంది
నటరాజుని పరవశ తాండవనృత్యం కవిత్వం
పలుకుబడులతో అక్షరాలను పలకరిస్తున్నప్పుడల్లా
మాండలిక మాధుర్యం పల్లెగానాన్ని వినిపిస్తుంటుంది
పల్లెపదాలను అభిషేకించే అందమైన చిత్రం కవిత్వం
సమాజ సంఘర్షణలను నిత్యం చిత్రిస్తున్నప్పుడల్లా
ఆలోచనల ఘర్షణలు రగులుకుంటూనే ఉంటాయి
అనేక వ్యధల రోదనల ఆవేదనా వీచిక కవిత్వం