– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
ఈమె బిడ్డకు అన్నం తానే స్వయంగా తినిపిస్తోంది.
ఆమె బిడ్డకు ఆహారాన్నిపనిమనిషి తినిపిస్తోంది.
ఈమె దీనిని వరంగా గ్రహించి ఇష్టపడుతోంది,
ఆమె దానిని శాపంగా తెలుసుకోలేక నష్టపోతోంది.
ఈమెకు సంసారమంటే ప్రాణం,
ఆమెకు సంపాదనపైనే ధ్యానం.
ఈమె ప్రతివిషయంలోనూ వినయంతో ప్రవర్తిస్తుంది.
ఆమె ప్రతి విషయంలోను గర్వాన్నిప్రదర్శిస్తుంది.
ఈమె పరిస్థితులకు యజమాని,
ఆమె స్థితిగతులకు బానిస.
ఈమె బిడ్డపై ప్రేమకు లొంగిపోయింది,
ఆమె డబ్బుపై భ్రమలోకుంగిపోయింది.
ఈమెకు లోకమంతా ప్రేమమయం,
ఆమెకు లోకమంతా కాసుమయం.
ఈమెను మనసారా ప్రశంసించేవారు ఎక్కువ,
ఆమెను ముఖంఎదుట పొగిడేవారు ఎక్కువ.
ఈమె బిడ్డ అదృష్టవంతుడై పెరుగుతున్నాడు,
ఆమె బిడ్డ ధనవంతుడై ఎదుగుతున్నాడు.
ఈమె బిడ్డకు ముద్దు,మురిపాలకు లోటు లేదు,
ఆమె బిడ్డకు కలలోకూడా వీటికి చోటులేదు.
వీడు కన్నతల్లి ప్రేమ ప్రవాహంలో ఈదులాడుతున్నాడు,
వాడు పనిమనిషి నిర్లక్ష్య ప్రకోపంలో తేలియాడుతున్నాడు.
ఈమెకు బిడ్డేలోకం,ఆమెకు డబ్బేసర్వం.
వీడికి భయంవేస్తే కన్నతల్లి ఒడిలో సేదతీరుతాడు,
వాడికి భయంవేస్తే పనిమనిషి నిర్లక్ష్యానికి గురిఅవుతాడు.
వీడు ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నాడు,
వాడు ఆత్మనూన్యతతో కూలబడుతున్నాడు.
వీడికళ్ళు ఎప్పుడూ కాంతివంతమై ఉంటాయి,
వాడికళ్ళు ఎప్పుడూ నీటిమయమై ఉంటాయి.
వీడిజీవితం ధన్యమైనట్లే అనిపిస్తోంది,
వాడి జీవితం శూన్యమైనట్లే కనిపిస్తోంది.