– రూపారాణి బుస్సా
యుగానికి ఆదిగా
యుగాదికి శ్రీకారంచుట్టుదాం
ద్వికాలాలకు ప్రథమంగా
ఉత్తరాయణ,దక్షిణాయనముల ప్రాముఖ్యతలు తెలుసుకుందాం
దేవతల నవోదయంగా
దైవ కాలజ్ఞానాన్ని అర్థంచేసుకుందాం
భూలోకానికి పర్వదినంగా
నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందాం
మామిడి చింతల పంటలకాలంగా
తాజా పండ్లకు నోరూరిద్దాం
వసంతపు పచ్చదనంగా
ఆకుల నాట్యాలను ఆనందిద్దాం
నక్షత్ర గమనాలకు ఆయుష్షుగా
ఉగస్య ఆదిని గమనిద్దాం
వేపపూవుల ఆలాపనలగా
వేసవి ఆరంభాన్ని అనునయిద్దాం
సూర్యుని భ్రమణములో తొలి దినముగా
కాలం యొక్క ఉషస్సుతో ప్రయాణం చేద్దాం
చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాదిగా
సాంప్రదాయపు నినాదాలను చాటి చెబుదాం
వేదాలను రక్షించిన నాడుగా
విష్ణుమూర్తికి నమనాలను అర్పించుకుందాం
కొత్త చైతన్యంతో హృష్టిని ప్రచరించు సమయంగా
వేడుకల స్పూర్తిలో చమత్కారం చూపిద్దాం
మామిడి తోరణాల పచ్చని స్వాగతంగా
ఇంటి గుమ్మాలను అలంకరిద్దాం
సరికొత్త దుస్తుల ధారణతో శుభ్రముగా
పాత బాధలను, ద్వేషాలను మరచిపోదాం
కష్టసుఖాలు సమ భాగములని గ్రహించగా
షట్రుచుల జీవన సారాన్ని సేవిద్దాం
రుచికర పదార్థాలను వండి శ్రద్ధగా
పిండివంటల అమోఘాన్ని ఆస్వాదిద్దాం
దేశ సమృద్ధిని, విపరీత కాలాన్ని తెలుసుకొనగా
పంచాంగ శ్రవణములో పండితుల నోట విందాం
గ్రహ దోషం,అనుకూలాల ప్రజ్ఞగా
మన పథములో గ్రహముల పరిస్థితిని విశదించుకుందాం
యదుగుదలకు ప్రార్థనగా
దైవానుగ్రహం కొరకు స్తోత్రాలు పఠియిద్దాం
సంతోషానికి ప్రతీకగా
పండుగ సంబ్రమాలకు నాంది పలుకుదాం
శుభ చింతనలకు శృతిలయలుగా
ఆప్యాయతతో ఉగాదిని ఆహ్వానిద్దాం
వికారి నామ సంవత్సరం మూడు పువ్వులు ఆరు కాయలుగా
సమస్త జన కోటికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుందాం
వందనాలు!!