సేకరణ: డా.కోదాటి సాంబయ్య
గీతములలోని స్వరములు సరళంగా ఉండి, ఎక్కువ దాటు స్వరములు గానీ, క్లిష్టమైన సంచారములు గానీ లేకుండా విద్యార్థి తేలిగ్గా పాడడానికి వీలుగా ఉంటాయి.
ఉదా: మలహరి రాగం లోని శ్రీ గణనాధ గీతములో పల్లవి చూడండి.
మ ప | ద స స రి || రి స | ద ప మ ప ||
రి మ | ప ద మ ప || ద ప | మ గ రి స ||
శుద్ధ మధ్యమం సరళీ, జంట, వరుసలు, అలంకారములలో ఇదివరకే పాడడం అలవాటు అయింది కనుక …ఈ గీతం మంగళకరమైన శుద్ధ మధ్యమం తో ప్రారంభించబడి
వెంటనే పక్క స్వరమైన పంచమం తో ద్రుతం ముగుస్తుంది. ఇక లఘువులో దైవతం తో ప్రారంభించి పై షడ్జమం. పై రిషభం తో ముగుస్తుంది . తాళములలో రూపక తాళం
సరళంగా ఉంటుంది. మొదటి ఆవృత్తం తో ఆరోహణ అయింది. ఆరోహణ లో కూడా మొదటి ఆవృత్తం లోని స్వరాలే వచ్చాయి. పల్లవి రెండో లైన్ రిషభం తో మొదలై
మధ్యమం, పంచమం, దైవతం వరకు వెళ్లి మళ్ళీ మధ్యమం పంచమం కు అవరోహణ మై రెండవ ఆవృత్తం లఘువులో గాంధారం తో కలిసి మ గ రి స గా ముగుస్తుంది.
ఈ విధంగా ఒక పల్లవి రెండు లైన్లలోనే మలహరి స్వరస్థానాలు ఆరోహణ, అవరోహణ లతో మధ్య తారా స్థాయి స్వరాలతో వచ్చాయి. సాహిత్యం ( మాతువు ) కూడా
స్వరాక్షరములకు దాదాపు సమానంగా ఉండి, విద్యార్థికి తేలిగ్గా పట్టుబడతాయి.
మ ప | ద స స రి || రి స | ద ప మ ప ||
శ్రీ – | గ ణ నా ధ || సింధూ| – ర వ ర్ణ ||
రి మ | ప ద మ ప || ద ప | మ గ రి స ||
క రు | ణ సా గ ర || క రి | వ ద – న ||
ఈ ఒక్క గీతం తోనే విద్యార్థులు అకార, ఇకార, ఉకార, ఎకార, ఒకార అంకార సాధన చేయగల్గేట్టుగా రాశారు శ్రీ పురందర దాసు గారు.
Sree Gananatha Sindhura Varna | Malahari | Carnatic Music Vocal
గీతములు ముఖ్యంగా రెండు రకములు ..1. లక్ష్య గీతములు లేక సాధారణ గీతములు లేక సంచారి గీతములు………2. లక్షణ గీతములు.
1. లక్ష్య గీతములు : ఈ గీతాల లోని సాహిత్యము వివిధ దేవతలను ప్రార్ధించేది గా ఉండి, భాష సాధారణం గ సంస్కృత లేక భండీర భాషలో ఉంటుంది.అక్కడక్కడ అయ్య ,
తియ్య అనే పదాలు వాడబడినవి …వీటివల్ల ఉపయోగం ఏమీ లేదు, వీటిని గీతాలంకారములు అంటారు. విఘ్నేశ్వరుడు, మహేశ్వరుడు, విష్ణువు మొదలైన దేవతల మీద
శ్రీ పురందరదాసు గారు రాసిన గీతములను ముందుగా విద్యార్థులకు నేర్పుతారు. వీటినే పిళ్ళారి గీతములు అంటారు.
కొన్ని ప్రసిద్ధ సంస్కృత శ్లోకములను గీతములుగా మార్చి పూర్వీకులు రాశారు. అవి భైరవి రాగ గీతం …శ్రీ రామచంద్ర, నాట రాగ గీతం….అమరీ కబరీ మొ. వి ..
ఘనరాగ గీతములు. సంగీతం లో నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ రాగములను ఘనరాగములు అంటారు. ఇందులో రాసిన గీతములను ఘనరాగ గీతములు అంటారు.
1. నాట…అమరీ కబరీ. 2. గౌళ ….సకల సురాసుర. 3. ఆరభి…రే రే శ్రీ రామచంద్ర 4. వరాళి….వందే మాధవం… 5. శ్రీ రాగం…మీనాక్షీ జయ కామాక్షీ.
వివిధ రాగములతో ఒకే రాగమాలిక గా ఒక గీతాన్ని రచిస్తే వాటిని రాగమాలికా గీతములు అంటారు. కానే ఇవి వాడుకలో లేవు. లక్ష్య గీతములను రచించిన వారిలో
ముఖ్యులు …….శ్రీ పురందర దాసు, శ్రీ రామామాత్యుడు, పైడాల గురుమూర్తి శాస్త్రి గార్లు.
2. లక్షణ గీతములు : ఈ గీతములలో స్వరములు (ధాతువు) సాధారణ గీతముల వలెనె ఉంటుంది, కాని సాహిత్యం లో ( మాతువు ) ఆ రాగం గురించి చెప్పబడి
ఉంటుంది. అది జనక రాగమా, జన్య రాగమా, భాషాంగ రాగమా, అన్య, వర్జ్య, వక్ర, న్యాస , అంశ స్వరములు, సంపూర్ణ, ఔడవ, షాడవ స్వభావము మొ.వి ఈ గీతాలలో
రచింపబడి ఉంటాయి. నేటి కాలములో ఉన్నటువంటి పుస్తక సదుపాయము పూర్వము లేదు కాబట్టి శిష్యులు గురు ముఖతః ఈ లక్షణ గీతములు నేర్చుకుని జ్ఞప్తి లో
ఉంచుకుని , ఎప్పుడైనా ఏదైనా రాగ లక్షణము కావలిసి వచ్చినప్పుడు, ఆయా రాగం లోని లక్షణ గీతం నెమరు వేసుకొనే వారు . లక్షణ గీతములు 3 రకములు.
1. సూత్ర ఖండము : మొదటి భాగములో ఆయా మేళకర్త రాగ స్వరములు, వాటి స్వరస్థానాలు ఉంటాయి.
2. ఉపాంగ ఖండము: రెండవ భాగములో ఆ మేళకర్త నుండి జనించు ఉపాంగ రాగముల పట్టిక ఉండును.
3. భాషాంగ ఖండము : ఆ మేళకర్త నుండి జనించు భాషాంగ రాగముల గురించి ఉండును.
ఉదా: రావికోటి తేజ…మాయా మాళవ గౌళ ..చతురశ్ర మఠ్య తాళము. ఇట్టి లక్షణ గీతాలు రచించిన వారిలో శ్రీ గోవింద దీక్షితులు, శ్రీ వెంకటమఖి ముఖ్యులు. .
ఈ లక్షణ గీతములు హిందుస్తానీ సంగీతం లో ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. కొన్ని గీతములకు రచయితలు ఎవరో తెలియదు. ఉదా. కమళ జాదళ-కల్యాణి; వీటిని
ప్రాచీనుల రచనల కింద నేర్చుకుంటున్నాము. గీతములు త్యాగరాజు గారి కంటే ఎంతో ముందు కాలానివి.
లక్ష్య , లక్షణ గీతములు రెండింటిలోనూ సంగీతం ( ధాతువు ) , సాహిత్యం ( మాతువు ) , లయ ఒకే మాదిరిగా ఉండి, విద్యార్థి నేర్చుకొనుటకు తేలికగా ఉంటాయి .ఆయా
రాగ భావం ప్రతి గీతం లోనూ ప్రస్పుటంగా కనిపిస్తుంది. సాధారంగా గీతములలో పల్లవి, అనుపల్లవి చరణం అనే భాగాములుండవు. మొదటి నుండి చివరివరకూ నిలుపక
పాడడమే గీతములను పాడు పధ్ధతి.మొదట గీతములోని స్వరభాగమును మొదటినుండి చివరివరకు పాడి తరువాత సాహిత్యమును అలాగే పాడుతారు. తరువాత
సంగీత, సాహిత్యాలను త్రికాలములో సాధన చేస్తారు. దీనివల్ల గాత్ర విద్యార్థులకు గొంతు బాగా స్వాదీనమవుతుంది, జంత్ర వాద్య నిపుణులకు అంగుళీ కౌశలము
( fingering technique ) పెంపొందుతుంది.
2. జతిస్వరము లేక స్వర పల్లవి : గీతములు నేర్చుకున్న తర్వాత జతిస్వరం నేర్చుకోవడం ఆచారం. ఇది పల్లవి, అనుపల్లవి , చరణం అనే భాగములు కలిగియుండి
దాదాపు వర్ణమును పోలియుండును. స్వరములకు సాహిత్యం ఉండదు. కొన్ని జతి స్వరములలో అనుపల్లవి ఉండదు. నడక సాధారణంగా కానీ మధ్యమం గా
కానీ ఉంటుంది. ఈ జతిస్వరములు నృత్యములో ఉపయోగిస్తారు. కొన్ని జతిస్వరములు సగమ్ ఆవర్తము స్వరములతోనూ, సగం ఆవర్తము జాతులతోనూ ఉంటుంది.
ఇటువంటి జతిస్వరములు రచించిన వారిలో పొన్నయ్య పిళ్ళై , వడివేలు పిళ్ళై , శివానంద పిళ్ళై మొ. వారు . స్వరపల్లవి జతిస్వరమును పోలియుండి అన్నీ స్వరములు
మాత్రమె ఉండి జాతులు లేకుండా ఉంటుంది.
కొన్ని జతిస్వరముల మెట్టు ఆకర్షనీయంగా ఉండుటచే డానికి మంచి సాహిత్యమును కూర్చి స్వరజతిగా మార్పు చేశారు.
ఉదా: బిలహరి రాగం లోని జాతి స్వరం … సా రి గా పా దా సా నీ దా కు రార వేణు గోపా బాల అనే సాహిత్యం చేర్చి స్వరజతిగా మార్చారు. కొన్ని ప్రసిద్ధ
జతి స్వరములు : సా సా;; సా నీ దా —తోడి……సా, స ని పా ని ప గా —హంసధ్వని…….సా;; నీ దా నీ —బిలహరి……సా,; నీ దా,; మా గా,;—–వసంత.
Raravenu gopa baala bilahari adi swarajati music class
స్వరజతి : ఇవి ధాతువులో జతిస్వరమును పోలియుండును, కానీ సాహిత్యం కలిగి ఉంటుంది. మిక్కిలి మనోహరమైన రచనలు . సంగీత అమరికలోనూ,
నడచు వేగములోనూ వర్ణమును పోలియుండును. సాహిత్యం లో భక్తీ, వీర, శృంగార రసములు కలిగి రాగ భావం ఉట్టిబడుచుండును . స్వరజతులు రాసిన
ముఖ్య రచయితలు…శ్రీ శ్యామశాస్త్రి, స్వాతి తిరునాళ, చిన్ని కృష్ణదాసు ముఖ్యులు. కొన్ని స్వరజతులు :
1. రావే హిమగిరి కుమారి – తోడి – శ్యామశాస్త్రి
2. కామాక్షి అనుదినము – భైరవి – “”
3. కామాక్షి నీ పద యుగమే – యదుకుల కాంభోజి – శ్యామశాస్త్రి
4. సాంబశివ యనవే – ఖమాస్ – చిన్నికృష్ణదాస్.
MS Subbulakshmi-Kamakshi-Bhairavi-Shyama Sastri-Misra Capu-Swarajathi