పదహారేళ్ళ పండగ
అవును,సిలికానాంధ్ర సంస్థ స్థాపింపబడి పదహారేళ్ళు పూర్తయ్యాయి. ఒక సంవత్సర కాలం పూర్తయ్యిందంటే ఒక మైలు రాయిని చేరుకొన్నట్టు లెక్క. వార్షికోత్సవం అంటే గత సంవత్సరాల తీయటి జ్ఞాపకాల్ని నెమరేసుకొంటూ, ఈనాటి సంతోషాల్ని పంచుకొంటూ, రాబోయే కాలపు ఆశలకు, ఆశయాలకు ప్రణాళికలు వేస్తూ పండగ చేసుకోవడమే. అనాదిగా రత్నాలు, మణులకు మనిషి ఆకర్షితుడవుతున్నాడు. వాటిలో కానవచ్చే స్వచ్చత, బహు గట్టిదనం, మిలమిల మెరిసే ప్రకాశం వీటి ప్రత్యేక లక్షణాలు. పగడము, పచ్చ, నీలము, గోమేధికం, వజ్రము, వైడూర్యం మొదలగు నవరత్నాలు అలంకారభూషితాలుగా పేరొందాయి. మరి సిలికానాంధ్ర నవరత్నాలు ఏవంటే – ఉగాది ఉత్సవం, అన్నమయ్య జయంతి ఉత్సవం, కూచిపూడి నాట్యోత్సవం, తెలుగు సాంస్కృతికోత్సవం, సుజనరంజని మాసపత్రిక, మనబడి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, సంపద, జయహో కూచిపూడి కార్యక్రమాలను పేర్కొనవచ్చు. అలాగే, ఇంకా వెలికి తీస్తే ఎన్నో మణులు లభ్యమవుతాయి.
ఆగస్టు 5న జరగబోయే వార్షికోత్సవం వివరాలకు వేచి ఉండండి. త్వరలో ఈ-మెయిల్ ద్వారా, సాంఘిక మాధ్యామాల (Social Media) ద్వారా ప్రకటింపబడతాయి.
చుక్కల్లో చంద్రుడు
మన భారతీయుడు, ఖగోళ సాస్త్రవేత్త, నోబెల్ బహుమాన గ్రహీత అయిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ చరిత్రను కాలిఫోర్నియా నివాసి, విశ్రాంత ఆచార్యుడు అయిన డా. వేమూరి వేంకటేశ్వరరావు రచించిన ధారవాహిక శీర్షిక ప్రారంభం అయినది. భౌతిక, గణిత, ఖగోళ, సాంకేతిక సమచారాల్ని జోడిస్తూ రాసిన ఈ రచనను తప్పక చదవండి. మీ అభిప్రాయాలు పంచుకోండీ.
– తాటిపాముల మృత్యుంజయుడు