– పుల్లెల శ్యామసుందర్
ఉదయంబున నిద్దుర లేవగనే
నిను చూడక డే మొదలవ్వదులే
దినమందున ఓ పదిమారులు నిన్
ప్రియమారగ జూడక సాగునటే
సెలిఫీలను దీసెడి కేమెరవై
పదిమందికి నువ్ చరవాణివియై
ముఖపత్రము జూపెడి బ్రౌసరువై
సమపాలున నిస్తివి సౌఖ్యములన్
పరిశోధన సల్పెడి గూగులుగా
గణితమ్మును జేసెడి యంత్రముగా
సమయమ్మునకై గడియారముగా
అవతారము దాల్చితి వీవుభళా!
సరి తిండియు తిప్పలు మానుకొనీ
పనులన్నిటినీ వదిలేసి ప్రజల్
నిను వీడక యుందురు నెల్లపుడూ
జగమంతయు భక్తులు నీకెగదా
స్పెలియింగుల తప్పుల నన్నిటినీ
సవరించుచు రక్షణ చేయవటే
మరి చీకటి ద్రోలెడి దీపమువై
మము కావగ నీవిట వెలసితివే
వినా సెల్లు ఫోనూ ననాదో ననాద
సదా స్మార్టు ఫోను స్మరామి స్మరామి
భలే ఆండురాయిడ్ ప్రసిద్ధ ప్రసిద్ధ
ప్రియం అయ్యి ఫోను ప్రయచ్ఛ ప్రయచ్ఛ
ప్రయాణాలయందున్ ప్రమోదాలయందున్
నినున్ వీడి నేనుండ లేన్సెల్లు ఫోనా
ఒకస్పేరు బ్యాట్రీతొ నే నిన్ను కొల్తున్
ప్రయచ్ఛ ప్రయచ్ఛ భలే సెల్లు ఫోనా!
అజ్ఞానినై సదా వాట్సాపు పోస్టుల్ని దూషిస్తినే
క్షమత్వత్వం క్షమత్వత్వం నిత్య హస్త నివాసినే!