-రచన : శ్రీధరరెడ్డి బిల్లా
రోడ్డు ప్రమాదాలతో
నిత్యము నెత్తురోడి రోదించే రోడ్లు,
కొన్ని రోజుల నుంచి
రంజుగా నిద్దరోతున్నాయి!
తరాల తరబడి తామసంతో
తలలు తెగనరుకుతున్న తాలిబాన్లు
తమకు తామే మూతులు మూసుకొని
తలుపులకు తాళాలేసుకున్నారు!
మానభంగాలను చూసీ చూసీ
ఆర్తనాదాలను వినీ వినీ, ఆపలేక ఓపలేక
మౌనంగా ఏడ్చిన పాతబంగాళాలు,
ఆనందంగా పిట్టగూళ్ళతో అలరుచున్నాయి!
తిరుపతి వెంకన్న దర్శనం
మరితమకెందుకు లేదని వగచిన మూగజీవాలు,
తిరుమల వీధుల్లో తిరుగాడుచూ
మరల మరల శ్రీవారిని దర్శించుకుంటున్నాయి!
బయటి తిండిని తిని , నిన్నటి మొన్నటి
వంటల్ని వాసన చూసి, వేడి చేసుకొని తిని,
అనారోగ్యంతో కునారిల్లే ఇంటిల్లిపాదీ,
వేడి వేడి కొత్త వంటల రుచులు ఆస్వాదిస్తున్నారు!
పీడించి పీడించి లంచాలను పీల్చగా,
శ్రమజీవుల చెమటతో తడిచిన నోట్ల
చమట వాసను పీల్చిపీల్చి వాసన చచ్చిన
ప్రభుత్వాఫీసులు పూలవాసన పీలుస్తున్నాయి!
సెటిల్మెంట్ దందాలు చేసిన నేతల చేతులు
పాపాల్నిగుర్తుచేసుకుంటూ, నీళ్లతో కడుక్కుంటూ
కమీషన్ల కోసం బెదిరించిన నేతల మూతులను
గుడ్డతో కప్పెట్టి గుంజి కట్టేస్తున్నాయి!
పాపపంకిలపు అక్రమ సంబంధాల ,
వ్యామోహపు స్కూళ్లు,కాలేజీ ప్రేమల ,
పాపాలను చూసి చూసి విసిగిన పార్కులు,పొదళ్లు
హాయిగా చిరుగాలికి పరవశిస్తున్నాయి!
వీరబొట్టుబెట్టి, కత్తులు చేతబట్టి
వీధులెంట తిరుగెడు వీధిగుండాల
హత్యలతో హడలిచచ్చిన వీధులు,
హాయిగా జోలపాటలు పాడుకుంటున్నాయి!
విషపు ధూళి నిండి
వీసమెత్తు ప్రాణవాయువు లేక
విలవిలలాడిన వాయుదేవుడు
విసురుకొని కొంత ఊపిరిపీల్చుకున్నాడు!
గంగమ్మ పేరుకే గాని,
గరళమే ఉన్నదంతా అంటూ
గడగడలాడి గుండెలవిసిన గంగమ్మ,
గలగలపారుచూ మైలవదల్చుకుంటున్నది!
మానవులు దానవులవుతున్నపుడు
దండించి దారిలోపెట్టడానికి
ప్రకృతి బెత్తంపట్టుకున్న తండ్రిపాత్ర
పోషిస్తూనే ఉంటుంది!