-రాపోలు సీతారామరాజు
వస్తూ వస్తూ కోటి ఆశలను మోసుకొచ్చావు
అడుగుపెడుతూనే భారత అంధుల క్రికెట్టులో వెలుగురేఖలు పూయించావు
సొంతంగా యుద్ధవిమానంలో ‘అవని’ని అవనిలోకి ఎగిరించావు
జిమ్నాస్టిక్స్ లో ‘దీప’కు బంగారపుటద్దులద్దావు
పర్యావరణాన్ని పచ్చగా ఉంచాలంటూ
ప్లాస్టిక్ ని నిషేధించాలంటూ
మహారాష్ట్ర ప్రభుత్వానికి సంకల్పదీక్షనిచ్చావు
స్వలింగసంపర్కం సబబేనంటూ సుప్రీంతో తీర్పునిప్పించావు
ఆలయంలోకి ఆడవారిని ఆహ్వానించమంటూ అయ్యప్పకే ఆర్డర్లు వేశావు
ఆటగాడిని అందలమెక్కిస్తూ పాకిస్తాను ప్రధానిని చేశావు
అడవుల్ని అన్యాయంగా నరకొద్దంటూ
కేరళని కన్నీటివరదలో ముంచావు
కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రేపావు
పుతిన్ ని నాలుగోసారి రష్యా గద్దెనెక్కించావు
అక్కడే ప్రపంచదేశాలతో బంతిని తన్నించి
ఫ్రాన్స్ ని ప్రపంచ విజేత చేశావు
అరవైయేళ్ళ కాస్ట్రో కుటుంబపాలన కాదని
క్యూబాలో కొత్తవారిని కోరుకున్నావు
ప్రజల ఆకాంక్షలని సమాదరిస్తూ ఇరాక్ లో ఎన్నికలు నిర్వహించావు
ఉత్తరమెరికా ఉత్తర కొరియాలను శాంతి చర్చలకు ఆహ్వానించావు
ఉన్న మ్యాన్లు సరిపోరంటూ ఆక్వామ్యాన్ ని తెరపైకి తెచ్చావు
మీటూ ఉద్యమాన్ని లేవదీసి మృగాళ్ళని వణికించావు
అవినీతికి హద్దుందంటూ ‘జూమా’ని పదవీచ్యుతుణ్ణి చేశావు
దేశాలను దగ్గర చేస్తూ ఆసియా ఆటలను, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించావు
ఇస్రో ఉపగ్రహాలతో భారతఖ్యాతిని నింగినంటించావు
పర్యావరణంతో పరాచికాలొద్దంటూ దిల్లీని ధూళి తెరతో కప్పావు
అటల్ జీని, అందాల శ్రీదేవిని అమరలోకాలకి తీసుకెళ్ళావు
కరుణానిధిని అమరజీవిని చేశావు
సౌదీ స్త్రీలను వాహనం నడపమన్నావు
సినిమాయోగాన్నీ కట్టబెట్టావు
స్వాజిలాండ్ కి కొత్తపేరుని సొంతపేరుని ప్రసాదించావు (kingdom of Eswatini)
సాటిమనిషికి సాయపడమంటూ థాయిలాండ్ గుహవైపు చూపించావు
సిరియా ప్రచ్ఛన్నయుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయావు
ప్రముఖుల పెళ్ళిళ్ళకు మంగళవాద్యాలు మ్రోగించావు
బ్రిటన్ యువరాజుని అమెరికా అల్లుణ్ణి చేశావు
ప్రియాంకాను అమెరికా పాటగాడితో పరిణయమొందించావు
పద్మావతి అల్లావుద్దీన్ ఖిల్జీలను మూడుముళ్ళతో ముడివేశావు
లోకంలో సగం మందికి ఇంటర్ నెట్ అలవాటు చేశావు
ఎదిగినా ఒదిగి ఉండమని ఫేస్ బుక్ కి బోధ చేశావు
ఆధార్ మీదనే ఆధారపడొద్దని ప్రభుత్వానికి ముకుతాడు వేశావు
ఐక్యతా ప్రతిమతో ఉక్కుమనిషిని ఆకాశానికెత్తావు
తెలగాణలో గులాబీకారును టాప్ గేరులో పరుగులు పెట్టించావు
షేక్ హసీనాని నాలుగోసారి బంగ్లా పీఠమెక్కించావు
ఇలా…
అనుభూతులెన్నున్నా
అనుభవాలెలా ఉన్నా
ఓ 2018 నీకు వందనం
నీకు ఘనమైన వీడ్కోలు
మంచిని కాంక్షిస్తూ
2019 నీకు సాదర స్వాగతం