జగమంత కుటుంబం

TAGS – తెలుగు భాషా దినోత్సవం

శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న ‘గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి – తెలుగు భాషా దినోత్సవం’, మరియూ ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన చర్చా కార్యక్రమం

ఆగష్టు 29 న గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ని…మనం “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని తెలుగు భాషలో ఉన్న అందాన్నీ, మాధుర్యాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వారి గూర్చి,  ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన ఒక చర్చా కార్యక్రమాన్ని శాక్రమెంటో తెలుగు సంఘం ఆన్ లైనులో నిర్వహించింది .

పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చినా అది ఉండవచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, లేదా కరిగిపోవచ్చు. కానీ వారికి మనం అందించే భాష మరెన్నో తరాలకు చేరుతుంది. మన తెలుగు జాతి వైభవాన్ని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి ఖ్యాతిని చాటి చెప్పేందుకు భాషను మించిన సాధనం లేదు కదా? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషని ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ముందు తరాలకు చేరేలా చేయవలసిన బృహత్తర బాధ్యత ముఖ్యంగా వలస వచ్చిన తొలితరం తల్లిదండ్రుల భుజస్కందాల మీద ఉంది. పదిహేను, ఇరవై  ఏండ్ల క్రితం, అమ్మ భాషను ఏవో కొన్ని ప్రాంతాలు తప్ప, మిగతా వారు అమెరికాలో ఇంటిలోనే నేర్చుకోవలసి వచ్చేది. ఇప్పుడు మన అదృష్టవశాత్తు మనబడి, పాఠశాల, సంస్కృతి, తదితర తెలుగు బడుల మూలంగా పిల్లలకు తెలుగు నేర్పించాలనుకొనే తల్లిదండ్రులకు అమెరికాలో ఒక వేదిక దొరికింది. ఈ వేదికలని అమెరికాలో ఉపయోగించుకోవడంలో తల్లిదండ్రుల సాధకబాధకాలు, కార్యాచరణ …  అమెరికాలో తెలుగు సాహిత్య సృష్టిలో – వలస వచ్చిన తొలితరం రచయితల పాత్ర ఎలా ఉంది? మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలుగు సాహిత్యం లో నిక్షిప్తమై ఉన్న దృష్ట్యా, మరి తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసే స్థాయికి అమెరికాలో భావి తరాలవారు ఎదగాలంటే మనం ఇప్పుడు ఏమిచెయ్యాలి? భాషను సాహిత్యానికి మాత్రమే  పరిమితం చేస్తే భాష వెనుకబడిపోతుంది,  కాబట్టి భాషను ఉపాధితో కూడా ముడిపెట్టండి అన్నారు స్వాత్రంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌. దేశం కాని దేశం వచ్చినప్పుడు భాష ను బ్రతికించుకోవడానికి, విస్తరించడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అలాగే భాషను మూలస్తంభంగా ఉపాధి అవకాశాలకు అమెరికాలో అవకాశాలు ప్రస్తుతానికైతే బహుకొద్ది అని చెప్పవచ్చు. ఈ విషయాల గూర్చి ఆన్ లైనులో జరిగిన చర్చలో ముగ్గురు ఆత్మీయ అతిధులను శాక్రమెంటో తెలుగు సంఘం ఆహ్వానించింది. వారి గూర్చి ముందుగా లఘు పరిచయం. ముందుగా మృత్యుంజయుడు తాటిపాముల గారు, సిలికాన్ ఆంధ్ర సుజన రంజని పత్రిక సంపాదకులు వీరు, బే ఏరియా, కాలిఫోర్నియా నుండి వచ్చి ఉన్నారు. బే ఏరియా సాహిత్య వేదిక ‘వీక్షణం’ లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో అనేక మంది ఔత్సాహిక రచయితలను, ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారిని కూడా సాహిత్య రచనలు చెయ్యమని సదా ప్రోత్సహిస్తుంటారు.

తరువాత రెండవ అతిధి డాక్టర్ సురేంద్ర దారా గారు, 2015 లో నాట్స్ అక్షర పత్రిక కు సంపాదకులు, పలు తెలుగు సాహిత్య రచనలు చేసిఉన్నారు, అనేక తెలుగు సాహిత్య సదస్సులలో పాల్గొని పరిశోధనాత్మక ప్రసంగాలు, విశ్లేషణలు చేసి ఉన్నారు. వీరు యూసీ డేవిస్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విభాగంలో ఆచార్యులు.

ఇక మూడవ అతిధి డాక్టర్ మధు బుడమగుంట గారు, సిరిమల్లె పత్రిక కు సంపాదకులు, వీరు పలు తెలుగు సాహిత్య రచనలు చేసి ఉన్నారు, పలు మార్లు తెలుగు సాహిత్య పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన అనుభవం ఉంది. మంచి సందేశాత్మక రూపకాలను వీరు రచించి మన శాక్రమెంటో పరిధిలోని తెలుగు సంఘాల సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు మరియు పెద్దల చేత తన దర్శకత్వంలో వేయించారు. వీరు యూసీ డేవిస్ విశ్వవిద్యాలయంలో జీవ రసాయన శాస్త్ర విభాగంలో ఆచార్యులు.

చర్చకు సంధాన కర్త వెంకట్ నాగం, శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు వెలుగు పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. శాక్రమెంటో తెలుగు సంఘం ఫౌండేషన్ బోర్డు సభ్యుడు గా ఇటీవలె నియమితులు అయ్యారు. శాక్రమెంటో శివారు నగరం ఫాల్సం లో వీరి నివాసం. ఆత్మీయ అతిధులు ముగ్గురికీ స్వాగతం పలుకుతూ వెంకట్ నాగం చర్చను ప్రారంభించారు.

దాదాపు గంట వరకు సాగిన ఈ అర్థవంతమైన చర్చ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ క్రింది ఐదు విషయాలను చర్చించారు.

ఈ రోజు గిడుగు వారి జన్మదినం – ఆయన పుట్టిన రోజును “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. దీన్ని గూర్చి మృత్యుంజయుడు గారు మాట్లాడుతూ అమెరికాలో 2020 లో జరిగిన అధ్యక్ష పదవి బ్యాలెట్ పత్రాలలో తెలుగులో కూడా సూచనలు ముద్రించి ఉన్నాయని, అలాగే పలు మాల్స్ లో స్వాగత తోరణాలు కూడా తెలుగు వాడుక భాషలోనే రాయడం జరిగిందని, ఈ లెక్కన తెలుగు భాష విషయంలో అమెరికాలో తెలుగు మెట్టు ఎక్కినట్లు భావించాలని చెప్పారు. తెలుగు పీఠాలు పలు అమెరికా విశ్వవిద్యాలయాలలో ఏర్పాటు చేయబడినందువల్ల, ఈ విశ్వవిద్యాలయాలలో తెలుగు పాఠాలు అభ్యసించే అవకాశాలు స్థానిక ప్రవాస తెలుగు పిల్లలు అందిపుచ్చుకోవాలని చెప్పారు. తెలుగు లో ఇంకా చరవాణి ఆప్స్ నిర్మాణం జరగాలని, అలా జరిగితే తెలుగు నేర్చుకున్న యువకులకు మరిన్ని ఉపాధి అవకాశాలు వస్థాయని ఆయన చెప్పారు.
గిడుగు వారి పుణ్యాన సామాన్య ప్రజలు కూడా సాహిత్య సృష్టి చేస్తున్నారు. 1940 కు ముందు తెలుగు సాహిత్యం, దినపత్రికల్లో అంతా గ్రాంధిక భాష ఉండేది. గిడిగు వారి ఉద్యమ ఫలితంగా 1940 లలో వాడుక భాష లో సాహిత్య రచన, దిన పత్రికల్లో వ్యావహారిక భాష పెరిగింది. గిడువు వారి ఉద్యమం తెలుగు భాషా చరిత్రలో ఒక మైలురాయి. మరి ఇప్పుడు పరభాషలు తెలుగు భాషలో చొరబడడం మూలంగా తెలుగు భాషకు జరుగుతున్న నష్టం గురించి మీ స్పందన. (నిజానికి అవి చొరబడడం లేదు, ప్రజలే ఆశ్రయిస్తునారు).  తెలుగు రాష్ట్రాలలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఈ ప్రశ్నలకు మధుగారు స్పందిస్తూ, తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదించాలి అని చెప్పారు. కేవలం పట్టాలకోసం తెలుగు నేర్చుకోరాదు అని చెప్పారు. ఇంగ్లీషు పదాలు లేకుందా తెలుగులోనే వారానికి ఒక రొజు ఇంటిలో  మాట్లాడుకోవాలని నియమం పెట్టుకోవాలని, ఈ ఒప్పందాన్ని పోనుపోను వారం మొత్తానికి అన్వయించాలని సూచించారు.
అమెరికాలొ తెలుగు భాషా వికాసం గూర్చి –
అమెరికాలొ రెండవ తరం, మూడవ తరం తెలుగు వారు ఇప్పుడు తయారు అవుతున్నారు. తెలుగు భాష వికాసం కు ప్రయత్నం (వ్యక్తిగతం గా లేదా సంఘం రూపేణా) అమెరికాలో సరిపొయినంతగా ఉందని భావిస్తున్నారా? తరువాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సమస్యలు ఉన్నాయా? అసలు ఎక్కడ నుండి మొదలుపెట్టాలి మనం? ఈ ప్రశ్నలకు సురేంద్ర గారు స్పందిస్తూ, ఊపిరి తీసుకున్నప్పుడు, ఆకలి వేసినప్పుడు ఎలాగ స్పందిస్తామో భాష విషయంలో కూడా అలాగే సహజ స్పందన ఉండాలి అని చెప్పారు. పిల్లలు నేర్చుకున్న తెలుగు పాఠాలను తరగతి గది బయట మర్చిపోకుండా ఉండాలంటే, ఇంటిలో కూడా తెలుగు మాట్లాడాలని ఆయన చెప్పారు. ప్రవాస పంజాబీ కుటుంబాలకు చెందిన పిల్లలు అనర్గళంగా రెండు భాషలు మాట్లాదుతున్న విషయం ప్రవస తెలుగు వారు గుర్తించాలి అని నొక్కి చెప్పారు. పౌరుషంతో తెలుగు నేర్చుకోవాలని ఆయన చెప్పారు.

ఆమెరికాలో తెలుగు సాహిత్యం సృష్టి – పత్రికా సంపాదకులుగా మీ అనుభవాలు మాతో పంచుకుంటారా?  ఈ ప్రశ్నలకు మధు గారు స్పందిస్తూ, తెలుగులో మాట్లాడాలి అనే సంకల్పం కుటుంబ స్థాయిలో చేసుకోవాలని చెప్పారు. మనలో మార్పు రావాలి, చిన్న చిన్న పదాలతో తెలుగును నేర్పిస్తే బాలలకు వంట పడుతుంది అని చెప్పారు. భాష నేర్చుకోవడం నిరంతర సాగే జీవన ప్రక్రియ అని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అతి సరళ భాషలో సిరిమల్లె మాస పత్రికను తీర్చిదిద్దుతున్నాము అని ఆయన చెప్పారు.  సురేంద్ర గారు “రెండు దశాబ్దాల క్రితం తెలుగు ఫాంట్లు, సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉండేవి కావని, స్థానిక తెలుగు వార్తలను ప్రచురించడానికి చాల ఇబ్బందులు ఎదురయ్యాయని, అయితే 2015 నాట్స్ అక్షర పత్రికకు సంపాదకుడిగా వ్యవహించినప్పుడు అనేక తెలుగు ఫాంట్లు, ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ వనరులు అందుబాటులో ఉన్నాయని” చెప్పారు.  మృత్యుంజయుడు గారు మాట్లాడుతూ సుజన రంజని మాస పత్రికలో వ్యాసాలు, కథలు, కవితలు, బొమ్మల  ప్రచురణలో స్థానిక మనబడి పిల్లల భాగస్వామ్యం ఉందని చెప్పారు.
చివరిగా … STEM (science, technology, engineering and math) ఒరవడిలో కొట్టుకుపోతున్న మన రెండవ తరం పిల్లలను తెలుగు భాష వైపు ఎలా మళ్ళించాలి? రెండు లక్ష్యాలు ఇక్కడ- నా దృష్టిలో ..ఒకటి భాషను ఉపయోగించడం, రెండు సాహిత్య సృష్టి చేయడం. మధు గారు ఈ ప్రశ్నలకు స్పందిస్తూ, మాతృభాష మీద పిల్లలకు తల్లిదండ్రులు ఆసక్తి కలిగించాలి, పిల్లను ప్రొట్సహించాలి, వారు ఇంగ్లీషు లో రాసిన చిన్న చిన్న కవితలను తెలుగులో అనువదించి పత్రికలలో ప్రచురింపజేయాలి. సురేద్ర గారు మాట్లాడుతూ, అమెరికాలో రెండవ తరం, మూడవ తరం పిల్లలు తెలుగు సాహిత్య సృష్టి చేస్థారని, అందరూ చెయ్యడం లేదు కానీ కొద్ది మంది చేస్తున్నరని, అమెరికాలో యువ అవధానులు వస్తున్నారని, ఇది శుభ పరిణామం అని చెప్పారు. మృత్యుంజయుడు గారు మాట్లాడుతూ ఎంత చిన్న ప్రయత్నమైనా ఫరవాలేదు, మన పిల్లలను తెలుగు సాహిత్య సృష్టికి ప్రొత్సహించాలని అన్నారు.

ఆసక్తికరంగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో మృత్యుంజయుడు గారు, మధు గారు, సురేంద్ర గార్లు ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గూర్చి ఇంకా పలు విశేషాలను వీక్షకులతో పంచుకున్నారు, తెలుగు భాషా వైభవం, సాహిత్య సృష్టి అమెరికాలో కొనసాగటానికి పలు సూచనలు చేశారు.  చర్చలో పాల్గొన్న మృత్యుంజయుడు గారు, మధు గారు, సురేంద్ర గార్లకు సంధాన కర్త వెంకట్ నాగం కృతజ్ఞతలు తెలియజేశారు. “అడగగానే మీరు సమయం కేటాయించి మీ అనుభావాల, అభిప్రాయాలు మాతో పంచుకున్నారు” అని ఆత్మీయ అతిధులకు శాక్రమెంటో తెలుగు సంఘం అధ్యక్షుడు రాఘవ్ చివుకుల ధన్యవాదాలు తెలియజేశారు, ఇటువంటి చర్చా కార్యక్రమాలు మరిన్ని చేపట్టడానికి మొట్టమొదటిది అయిన ఈ రోజు చర్చాకార్యక్రమం ఊపిరి పోసిందని, వీక్షకుల నుండి స్పందన బాగుందని ఆయన చెప్పారు.  కార్యక్రమం విజయవంతం కావడానికి శాక్రమెంటో తెలుగు సంఘం బోర్డు సభ్యులు సత్యవీర్ సురభి, శ్రీ శేష కల్యాణి గుండమరాజు, మరియూ  శాక్రమెంటో తెలుగు సంఘం ఇతర సభ్యులు విశేష కృషి చేశారు.

శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న  ‘గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి – తెలుగు భాషా దినోత్సవం’, మరియూ ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన పూర్తి చర్చా కార్యక్రమం వీడియో ని ఇక్కడ చూడవచ్చు :

https://www.youtube.com/watch?v=eA30ZIq4yfk&t=1160s  

లేదా 

https://tinyurl.com/Tags2021AugProgram 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked