నాట్యరంజని

తంజావూరు భాగవత మేళం కూచిపూడి ప్రహ్లాద – తులనాత్మక పరిశీలన

— శ్రీమతి డా. ఉమా రామారావు

మేలట్టూరు భగవతమేళ నాటకాలు అంకితభావానికి నిదర్శనం, కాలానుగుణంగా అభిరుచులు మారుతున్నా తరతరాల సంప్రదాయాన్ని నియమనిష్ఠలతో ఆచరించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా తమిళ భాషాభిమానం వెల్లువెత్తుతున్న వాతావరణంలో తెలుగుదనాన్ని ప్రదర్శించడం వెనుక ప్రధానంగా తెలుగు కళాకారులు మరీ ముఖ్యంగా కూచిపూడి కళాకారులను ప్రస్తావించాల్సి వుంటుంది. వివరాల్లోకి వెళితే విజయనగర సామ్రాజ్యం అంతరించేముందు, శ్రీకృష్ణదేవరాయల అనంతరం ఆంధ్రప్రాంతలో కళాపోషణ కరవై తంజావూరు నాయకరాజుల ఆశ్రయం కోరి కొంత మంది కూచిపూడి నాట్యాచార్యులు, పండితులు, కళాకారులు తరలివెళ్ళారు. క్రీ.శ. 1577-1614 మధ్య సింహాసనాన్ని అధిష్టించిన అచ్యుతప్పనాయకుడు నాట్యాచార్యులకు, కళాకారులకు భూదానం చేసి నిలువ నీడ కల్పించాడు. కళాభివృద్ధికి చేయూతనిచ్చాడు. దాదాపు 510 మంది కళాకారులకు (బ్రాహ్మణులకు) ఒక్కొక్కరికి ఒక ఇల్లు, ఒక బావితో సహా కొంత భూమిని జీవనోపాధికై ఇచ్చాడు. పురీశ్వరుని (శివుని) ఆలయం ఉంది కనుక ఉన్నతాపురంగాను ప్రచారంలోకి వచ్చింది.

ఇదేగాక అచ్యుతప్ప శాలియమంగళమ్‌. నల్లూరు, ఊత్తుకాడు, శూల మంగళం, తెప్పరమల్‌ నల్లూరులనే గ్రామాలను కూడా దానం చేశాడు. వీటన్నంటిని కలిపి అచ్యుతాబ్ధి అంటారు. ఈ భూమిని కళాకారులకివ్వడంలో ఒక ఆదర్శముంది. వీరందరూ భాగవతోత్తములు, వీరి ద్వారా నాట్యకళ ఉద్ధరింపబడి తద్వారా భక్తి ప్రపత్తులు ప్రజల్లో వ్యాపిస్తాయనే ఒక సద్భావన. అదే భావనతో ఈ ఐదు అగ్రహారాల్లోని కళాకారులందరూ సంగీత, సాహిత్య, నృత్యకళకు ఎనలేని సేవచేస్తూ ఆ ప్రదేశాన్ని పునీతం చేశారు. వీరి ద్వారానే తంజావూరులో తెలుగు సంస్క ృతి వేళ్లు నాటుకుంది. ఈ ప్రోత్సాహం, పోషణలు ఆధారంగా తంజావూరు నాట్య కళారంగానికి మేలట్టూరు భరతమ్‌ నారన, గోపాలకృష్ణశాస్త్రి వంటి నాట్యాచార్యులు అనేక కోణాల్లో దోహదం చేశారు.

మేలట్టూరు గోపాలకృష్ణ శాస్త్రి నారాయణ తీర్థులవారి శిష్యులు. అప్పటివరకు ప్రచారంలో ఉన్న సంస్క ృత నృత్య నాటకాలైన జయదేవుని గీత గోవిందం, నారాయణ తీర్థుల శ్రీకృష్ణలీలా తరంగిణుల ప్రభావం వీరి మీద చాలా ఉంది. ఈ ప్రభావంతోనే వీరు ధ్రువ, గౌరి, సీత, రుక్మిణి కళ్యాణమనే నాలుగు నాటకాలను రచించారు.
అవి హరికథలుగానే మిగిలిపోయాయి. వారి కుమారులు వెంకట్రామ శాస్త్రి, సంస్క ృతాంధ్ర భాషల్లో పండితులు. వారు భాగవత మేళనాటక సంప్రదాయానికి తగ్గట్టు 12 నాటకాలను రచించారు. అవి నేటికీ ప్రచారంలో ఉన్నాయి. రాచభాష తెలుగు కావడం వల్ల ఈ రచనలన్నీ తెలుగులోనే రచించబడి గ్రామ ముఖ్య దైవమైన వరదరాజ పెరుమాల్‌కు అంకితమివ్వబడ్డాయి. వెంకట్రామ శాస్త్రి తంజావూరు నేలిన శరభోజి – 2(1978-1832), శివాజీ (1832-1855) కాలం నాటివారు. ప్రసిద్ధ వాగ్గేయకారులు సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగయ్యకు సమకాలికులు.

వెంకట్రామశాస్త్రి యక్షగానాలను రిచించడమే కాకుండా యువకళాకారులకు శిక్షణ ఇచ్చి స్థానిక దేవాలయంలో వరదరాజస్వామి సన్నిధిలో ప్రదర్శింపజేస్తే, చుట్టుప్రక్కల ఉండే కళాకారులు, జమీందారులు, రాజోద్యోగులు తరచుగా మేలట్టూరు సందర్శించి ఈ వేడుకను చూసి ఆనందించేవారట! ఈ నాటకాలన్నింటిని కూడా వెంకట్రామశాస్త్రి తమ ఇష్టదైవమైన వరదరాజస్వామికే అంకితమిచ్చారు. త్యాగరాజస్వామి కూడా మేలట్టూరును సందర్శించి ఈ నాటకాలను తిలకించడం ఒక విశేషం. మేలట్టూరులోని యువకళాకారులు వెంకట్రామశాస్త్రి మరణాకుడు కోణంగి, వేత్రహస్తుడు పాత్రలను ప్రవేశపెడతారు. ఆహార్యం, అంగవిన్యాసం, పాత్రపోషణల్లో భేదముంది.

కూచిపూడి ప్రదర్శనలో నాటకీయత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. పాత్రల ప్రవేశం, నిష్క్రమణ త్వరగా సాగుతుంది. సంగీతం విలంబ, మధ్యమ, ద్రుత లయల్లో కూర్చబడి ప్రేక్షకులకు ఆసక్తికరంగా మలచబడి రససిద్ధికి తోడ్పడుతుంది.
కాని మేలట్టూరు వారి పోకడ వేరు; ప్రదర్శనంలో ముఖ్యంగా హిరణ్యకశిపుడు, లీలావతి పాత్రల సన్నివేశంలో సందర్భోచితంగా అంగవిన్యాసం, సాత్త్వికాభినయం రెండూ పోటీపడతాయి.

లీలావతి పాత్రలో అభినయ విధానం వేరుగా ఉంటుంది. ఆమె ఉత్తమ పాత్రగా తెర వెనుక ఉండి తరువాత బయటకు వస్తుంది. తెర పట్టుకుని చేసే లాస్యనృత్యం చాలా ఆహ్లాదాన్నిస్తుంది.

కథాగమనంలో మూడు వంతులు తేడా లేకపోయినా. చివరి అంకం ఇతివృత్తానికి భిన్నంగా ఉంటుంది. నరసింహస్వామి స్తంభం నుండి బయటికి వచ్చి హిరణ్యకశిపునితో యుద్ధం చేసి అతడి గోళ్లతో చీల్చి హతమార్చడం అసలు కథ.

కాని మేలట్టూరులో హరిని గూర్చి ప్రహ్లాదుడికి, హిరణ్యకశిపునికి కొంత వాగ్వివాదం జరిగిన తరువాత తెర వెనుక నుండి నరసింహుని కరాళం ధరించిన పాత్ర గర్జన వినిపించగానే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎత్తుకుని వేదిక దిగిపోతాడు. సరాసరి వరదరాజ స్వామి దేవాలయానికి వెళ్తాడు. ఈ లోపున రోడ్డు మీద కూర్చున్న ప్రేక్షకులను నిర్వాహకులు హెచ్చరిస్తూ ప్రక్కగా జరిపి మధ్యలో దారి వదులుతారు. ఇక్కడ జరిగేదేమిటంటే హిరణ్యకశిపుని పాత్రధారి వరదరాజస్వామిని స్తుతించి ప్రార్థించి తాను ఈ దుష్టపాత్రలో హరిని దూషిస్తానని, దానికి క్షమాపణ కోరతాడు. అనుగ్రహం ఆశిస్తాడు. వెంటనే ఒక ఆవేశంతో వేదిక వద్దకు వస్తాడు. తెర తీస్తారు. నరసింహుని ఒక కుర్చీకి కట్టివేసి, చుట్టూ అంత వరకు ప్రక్కన వంతపాట పాడినవారు. నట్టువనార్లు పట్టుకుని ఉంటారు.

హిరణ్యకశిపుడు నరసింహుని చూసి ”ఇదేమి రూపం” అంటూ హేళనగా మాట్లాడతాడు. నరసింహుడు బుద్ధిమాంద్యుడా అని మందలిస్తాడు. ఇలా తెలుగు సంభాషణల్లో కొంత యాస స్ఫురించినా, అక్కడ మేలట్టూరులో ప్రేక్షకులు తమిళులు కనుక వారికి అక్కడి సన్నివేశం, పాత్రలే ముఖ్యం కనుక ఆసక్తితో ఆ సన్నివేశంలో లీనమైపోతారు. హిరణ్యకశిపుడు, నరసింహస్వాముల మధ్య దాదాపు 2 గంటలు వాగ్వివాదం జరుగుతుంది. ఆవేశంతో నరసింహస్వామి అప్పుడప్పుడు లేస్తూ, కాళ్లతో నేలకు గట్టిగా తడుతూ వుంటాడు. ప్రక్కనున్న భక్తులు ఆపుతూ ఉంటారు. నరసింహస్వామి వేదిక మీద హిరణ్యకశిపుడు కింద ప్రేక్షకుల్లో వుంటారు. వారిద్దరికి చివరి వరకు ఏ విధమైన పరస్పర స్పర్శ ఉండదు.

పురాణంలో చెప్పినట్టుగా నరసింహుడు స్తంభం నుండి ఆవిర్భవించి గడప మీద హిరణ్యకశిపుని తన తొడ మీద వేలాడదీసి ఉదరాన్ని వాడి గోళ్లతో చీల్చి హతమార్చడం అసలు కథ. కాని మేలట్టూరు వెంకట్రమశాస్త్రి నరసింహస్వామి భక్తుడవడం వల్ల ఈ కథను ఒక కొత్త పంథాలో నడిపించారు.

ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతూండగా ఒక స్థాయిలో హిరణ్యకశిపుని పాత్ర ఒళ్లు తెలయకుండా పడిపోతాడు. దీనినే వధగా భావించి వేదికపైనున్న నరసింహస్వామికి హారతి ఇస్తారు. భక్తులందరూ జయజయనాదాలు చేస్తారు. ఈ లోపుగా హిరణ్యకశిప వేషధారికి అతని బంధుజనం సపర్యలు చేసి నెమ్మదిగా మామూలు స్థితికి తీసుకువస్తారు. ఈ పాత్రధారి కూడా భక్తులతో, కళాకారులతో కలిసి స్తుతిచేస్తాడు. దీంతో నాటకం ముగుస్తుంది.

తర్వాత మేలట్టూరి వారి సంప్రదాయం ప్రకారం భక్తులు మంగళవాద్యాలతో నరసింహస్వామిని వరదరాజస్వామి దేవాలయానికి తీకుకువెళ్తారు. హారతినిచ్చిన తరువాత అందరూ వారి కుటుంబ సంబంధిత గణేళాలయంలోకి తీసుకువెళ్తారు. అప్పటివరకు నరసింహస్వామి కరాళంలో వున్న నటుడు సింహగర్జనలు చేస్తూనే ఉంటారు. దేవాలయ ప్రాంగణంలో అతడిని కూర్చోబెట్టి భక్తులు విసురుతూ వుంటారు. ఈలోపుగా గ్రాముస్థులు, కుటుంబ దేవాలయ ప్రాంగణంలో అతడిని కూర్చోబెట్టి భక్తులు విసురుతూ వుంటారు. ఈలోపుగా గ్రాముస్థులు, కుటుంబ సభ్యులు వారి వారి సమస్యలు స్వామికి విన్నవించుకొని పరిష్కారాలను తెలుసుకుంటారు. అందరికీ కుంకుమ ఇస్తారు స్వామి. ఈ తంతు అంతా ముగిసేసరికి తెల్లారిపోతుంది. చివరగా స్వామి అనుమతితో హారతి ఇచ్చి కారాళాన్ని తీస్తారు. అంతే, ఆ పాత్రధారి కిందపడిపోతాడు. భక్తులు అతనికి సపర్యలు చేసి సేదతీరుస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కాఫీ, ఫలహారాలను స్వీకరిస్తారు.

ఇది ప్రతి ఏటా జరిగే యక్షగాన యజ్ఞం. ఇందులో యంత్రం, మంత్రం, తంత్రం ఉన్నాయి. ఇది ఒక భక్తితత్త్వం. మేలట్టూరి వారికి భగవంతుడు యిచ్చిన వరప్రసాదం ఈ ప్రహ్లాద నాటకం.

ఊరి పొలిమేరలు దాటని ఈ యక్షగాన నాటకం మేలట్టూరు వెళ్లి నృసింహ జయంతి నాడు చూసి తరించవలసిందే! మాటల్లో వ్యక్తం చేయలేని దివ్యానుభూతి అది.

తెలుగు భాష రాకపోయినా, తమిళనాడులో వుంటూ వారి సంప్రదాయాలను, కట్టుబాట్లను అనుసరిస్తున్న సంస్క ృతిని శతాబ్దాలుగా తమ నాట్యం ద్వారా కాపాడుతూ వస్తున్నారంటే దానికి కారణం తెలుగువారమన్న భావనతో పాటు నాట్యకళ మీద ఉన్న మక్కువ. ఇంక చెప్పాటంటే రచయిత వెంకట్రమశాస్త్రి మీద గల గౌరవం కూడా.

ముఖ్యంగా కూచిపూడి, మేలట్టూరు భాగమేళం రెండు సంప్రదాయాల్లో సామ్యాన్ని తెలిపేది తెలుగు భాష, పురుషులే స్త్రీ పాత్రలు ధరించి అభినంయిచడం, సంగీతం కర్ణాటకమైనా, రాగానికి ప్రాధాన్యం ఇచ్చి మేలట్టూరు వారు శాస్త్రీయమైన బాణిలో ప్రదర్శిస్తే భావానికి జీవం పోసి మోతాదుగా రాగాన్ని అన్వయించుకుని దేశిబాణిలో పామర జనరంజకంగా మలచుకున్నారు. కూచిపూడివారు దేవాలయానికి అంకితమైంది ఒకటైతే, ప్రచార కళగా రూపొందింది మరొకటి. లక్ష్యం ఒక్కటైనా ప్రదర్శన తీరులో వేరుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked