ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 12

సత్యం మందపాటి చెబుతున్న

జయం మనదే!

“బావా! నువ్వు నాకు రెస్యూమే వ్రాయటం దగ్గర మొదలు పెట్టి, దాని ముఖ్య ప్రయోజనం ఇంటర్వ్యూ తెప్పించటం మాత్రమేననీ, అది రాగానే ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తిస్తే ఉద్యోగం తెచ్చుకోవచ్చో చెప్పావు. ఆఫీసులో సరైన సంభాషణ ఎలా చేయలో, మాట్లాడేటప్పుడు నా శరీరవాణి ఎలా వుండాలో చెప్పావు. మన శతకాలలోని మేనేజ్మెంట్ సూత్రాలు సూక్షంగా చెప్పావు. ఆఫీసుల్లోని రకరకాల మనస్థత్వాలు ఎలావుంటాయో, వాళ్ళతో ఎలా మెలగాలో చెప్పావు. రంగుటద్దాలలోనించీ కాకుండా, మనం ఇతరులని వాళ్ళని వాళ్ళలాగే చూడటం ఎంత అవసరమో చెప్పావు. అలాగే ఆ రంగుటద్దాలలోనించీ మనల్ని సరిగ్గా చూడని వారితో ఎలా ప్రవర్తించాలో చెప్పావు. పాల్ గెట్టీ, లీ అయోకోకా, స్టీవ్ జాబ్స్ మొదలైన వారి మేనేజ్మెంట్ సూత్రాలు చెప్పావు. జాన్ మాక్స్వెల్ మొదలైన వారి పుస్తకాల గురించి చెప్పావు. అడగందే అమ్మయినా పెట్టదనీ, ప్రమోషన్లు ఎలా తెచ్చుకోవాలో చెప్పావు. ఉద్యోగ వైకుంఠపాళీలో పైకి ఎదగటం ఎలాగో చెప్పావు” చకచకా చెప్పాడు అర్జున్ కృష్ణతో.
“నాకు తెలిసినవన్నీ చెప్పేశానుగా, మరి నాకు గురుదక్షిణ ఏమిస్తున్నావ్?” కృష్ణ అడిగాడు నవ్వుతూ.
కారులో వెనక సీటులో కూర్చున్న రుక్మిణి వెంటనే అన్నది, “అతనేమిస్తాడు. ఉద్యోగంలో చేరి ఇంకా ఒక్క సంవత్సరం కూడా కాలేదు. అయినా మన ఇంటికొచ్చి, తన కారులో మనల్ని బయట భోజనానికి తీసుకు వెడుతున్నాడుగా. అది చాలదూ” అని.
“లేదు. సరదాగా అన్నాను. ఇవాళ మన విందు భోజనం నామీదే” అన్నాడు కృష్ణ.
“ఇంతకీ ఏ రెష్టారెంటుకి వెడుతున్నాం?” అడిగింది రుక్మిణి.
కృష్ణ అన్నాడు. “అర్జున్ డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు. అతను ఎక్కడికి తీసుకువెడితే అక్కడికే. అర్జున్, ఇంకో విషయం చెప్పటం మరచిపోయాను. నీ జీవితంలో కూడా ఇది ఎంతో గుర్తు పెట్టుకోవలసిన విషయం. నీ జీవితాన్ని నీకు నచ్చిన దారిలో నడపాలంటే, నీ జీవితానికి నువ్వే డ్రైవరువి. ఎవరో, ఎక్కడినించో దిగి వచ్చి ‘ఇదిగోనయ్యా, నీకో కొత్త ఉద్యోగం ఇస్తున్నాం. నీకు ఎక్కువ జీతం ఇస్తున్నాం. నీకు ప్రమోషన్ ఇస్తున్నాం’ అంటూ అడగని వరాలివ్వరు. నువ్వే డ్రైవర్ సీటులో కూర్చుని, నీ లక్ష్యం వేపు నీ జీవితాన్ని నడుపుకోవాలి”
కృష్ణ చెప్పే ప్రతి మాటా జాగ్రత్తగా వింటాడు అర్జున్. ఇదీ అలాగే విని, “అవును బావా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా జీవిత లక్ష్యాల మీద నాకు వున్న ఉత్సాహం, పట్టుదల మిగతావారికి ఎలా వుంటాయి” అని, రుక్మిణి వేపు తిరిగి అన్నాడు, “నువ్వు చెప్పు అక్కా. ఏ రెష్టారెంటుకి వెడదాం?” అడిగాడు.
రుక్మిణి పెద్దగా నవ్వుతూ అన్నది, “మీ బావగారు చెప్పారుగా. డ్రైవింగ్ సీటులో కూర్చున్నది నువ్వు. నీకు ఎక్కడ బాగుంటుందో అక్కడికే తీసుకువెళ్ళు” అని.
అతనికి తెలుసు, రుక్మిణికి ఎలాటి రెష్టారెంట్ ఇష్టమో. అందుకే అక్కడికే తీసుకువెళ్ళాడు.
అందరూ కూర్చుని, కావాల్సినవి ఆర్డర్ చేశాక, అర్జున్ అన్నాడు. “నిజంగా నువ్వు చెప్పిన విషయాలు నాకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయి బావా. నన్ను ఆఫీసులో అందరూ ఇష్టపడుతున్నారు. అలాగే నేను నాకు కాలేజీల్లో చెప్పని ఎన్నో కొత్త విషయాలని ఇక్కడ నేర్చుకోవటమే కాకుండా, అవి అమలుపరుస్తున్నాను కూడా. ఇంగ్లీష్ కూడా అమెరికన్ యాసతో మాట్లాడటం ఇంకా రాకపోయినా, నువ్వు చెప్పినట్టు స్పీడు తగ్గించి నెమ్మదిగా మాట్లాడుతున్నాను. నా పెర్ఫార్మెన్స్ రివ్యూ కూడా మొన్ననే బాగా వ్రాశారు. నీకు ఎన్నో ధన్యవాదాలు”
కృష్ణ అర్జున్ భుజం మీద చేతితో తడుతూ, “అప్పుడే ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పేస్తున్నావా. నాకు తెలిసిన, నా అనుభవంలో చూసిన విషయాలు మాత్రమే నేను చెప్పాను. అలాగే, మన జీవితం అంటేనే ఒక విద్యాలయం. ప్రతిరోజూ ఎన్నో కొత్త విషయాల్ని ఈ విశ్వవిద్యాలయంలో నేర్చుకుంటుంటాం. వాటిని మనకు అవసరమైనంత వరకూ, సందర్భానుగుణంగా వాడుకోవటం మన చేతుల్లోనే వుంది. నీ పరుగు చూస్తుంటే, ఇక ఆగేలా లేవు. ఇక్కడ అమెరికాలోనే కాదు, ఈ హైటెక్ యుగంలో ఎక్కడయినా అలాగే వుండాలి. శుభమస్తు. విజయోస్తు” అన్నాడు.
“ఇంకొక్క విషయం బావా. ఉద్యోగ విజయాల్లో నాకో చిన్న అనుమానం వుంది. ఏదన్నా తెలియనివి అవి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటూనే వుంటాను. కానీ అలా చేస్తున్నప్పుడు, నాకేమీ తెలియదని వాళ్ళు అనుకుంటారేమోనని భయం. ముఖ్యంగా మీటింగుల్లో సీనియర్లు, మేనేజర్ల దగ్గర. అలాటి విషయాల్లో ఎలా ప్రవర్తిస్తే బాగుంటుంది?” అడిగాడు అర్జున్.
“అది అంత కష్టమేమీ కాదు. నీ దగ్గరకి కొత్త విషయాలు తెలుసుకోవటానికి ఇతరులు వచ్చినట్టే, నువ్వూ ఇతరుల దగ్గర నీకు తెలియనివి తెలుసుకుంటావు. అది టీమ్ వర్కులో భాగమే. కాకపోతే వెర్రిముఖం వేసుకుని అడగక, ఒక సమాచార చర్చలా ప్రారంభిస్తే బాగుంటుంది. అదీకాక నిన్ను కొన్ని రంగాల్లో నిపుణుడిగా చూసేవాళ్ళు, నిన్ను మర్యాదగా చూసి నీ మాటలకు విలువ ఇస్తారు. అందుకే ఫలానా విషయాల్లో అర్జున్ దగ్గరకే వెళ్ళాలి అనే నైపుణ్యం, పేరు సంపాదించాలి. అప్పుడే ఇతరులు నీ దగ్గర నేర్చుకుంటారు, నీకు వాళ్ళకి తెలిసింది చెబుతుంటారు. నువ్వు నలుగురిలో నారాయణలా వుంటే, ఆ విలువ వుండదు” అన్నాడు కృష్ణ.
ఈలోగా సర్వారాయుడు, వేడివేడిగా వున్న ప్లేట్లు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు.
గార్లిక్ బ్రెడ్, పాష్టాలు రుచి చూసి, ‘బాగున్నాయి’ అన్నాడు కృష్ణ.
“అవును. బాగుంది. ఇక్కడ అన్నీ బాగానే వుంటాయి” అన్నాడు అర్జున్ మినిష్ట్రోన్ సూప్ తాగుతూ.
తన ప్లేటులోది రుచి చూసి, “నువ్వు ఆర్డర్ చేసిందే బాగున్నట్టుందే.. నాది అంత బాగాలేదు” అన్నది రుక్మిణి కృష్ణతో.
కృష్ణ తన ప్లేటు రుక్మిణి ముందుకు నెట్టి, ఆమె ప్లేట్ తను తీసుకున్నాడు.
“బావా.. ఇన్నాళ్ళూ నిన్ను పరిశీలిస్తున్నాను కనుక, ఒక విషయం చెబుతాను. నువ్వు నిర్ణయాలు, కొన్ని క్లిష్టమైనవి అయినా సరే, చాల సులభంగా తీసుకుంటావు. కొంతమందికి ఈ సినిమా చూడాలా, ఆ సినిమా చూడాలా అనే చిన్న విషయం కూడా పెద్ద నిర్ణయమే. నేను అక్కయ్యతో మాట్లాడినప్పుడు తెలిసింది. నువ్వు కారు కొంటున్నా, ఇల్లు కొంటున్నా చక్కటి నిర్ణయం చకచకా తీసుకుంటావని. అదెలా చేస్తావు?” అడిగాడు.
“చాలా సింపుల్. ఒక నిర్ణయానికి కావలసిన రెండిటిలో మొదటిది, మనకి కావలసింది ఏమిటో, అంటే ధ్యేయం ఏమిటో నిర్దుష్టంగా తెలిసివుండటం. అదే తెలియకపోతే, ఇక నిర్ణయమేం తీసుకుంటాం? రెండవది, కావలసిన నిర్ణయం తీసుకోవటానికి అవసరమైన సమాచారం. అంటే డేటా. దాని గురించి ఎంత సమాచారం సంపాదించగలిగితే అంత త్వరగా మంచి నిర్ణయం తీసుకోవటానికి అవకాశం వుంటుంది. ఇప్పుడు ఆ డేటా సంపాదించటానికి ఎన్నో మార్గాలున్నాయి. గూగులమ్మని అడగవచ్చు. స్నేహితులని అడగవచ్చు. ఇంకా ఎన్నో చేయవచ్చు. ఒక్కొక్కప్పుడు కొన్ని ప్రశ్నలు మిగిలిపోయి, జవాబులు రాక ఆ నిర్ణయానికి అవి అడ్డు రావచ్చు. అప్పుడే మనం కొంత ఊహాగానం కూడా చేయాల్సి వుంటుంది. అంటే ఎసంప్షన్స్ అన్నమాట. ఆ ఊహాగానానికి మన పూర్వాపర అనుభవాలతో పాటు, కొంత బుర్ర కూడా పదును పెట్టి ఉపయోగిస్తే, మంచి నిర్ణయమే వస్తుంది. ఒకవేళ మనం అనుకున్నట్టుగా అవకపోతే, ప్రమాదమేమీ లేదు. ఎక్కడ తప్పు జరిగిందో ఆ మూల కారణం (రూట్ కాజ్) తెలుసుకుంటే, దాన్ని సవరించుకోవటం (కరెక్టివ్ ఏక్షన్) పెద్ద కష్టమేమీ కాదు”
రుక్మిణి అన్నది, “నేనూ అంతే. ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ యుగాలు గడిపేస్తుంటాను. మీ బావేమో.. “
కృష్ణ ఆమె మాటలకు అడ్డం వస్తూ, “బట్టల షాపుకి వెళ్ళి ఈ డ్రస్సా, ఆ డ్రస్సా అని తెగ ఇబ్బంది పడిపోయి నా ఆభిప్రాయం అడుగుతుంది. ఫిట్టింగ్ రూముకి వెళ్ళి అక్కడ ఆ షాప్ అమ్మాయి అభిప్రాయం కూడా అడుగుతుంది. చివరికి అనుకున్నది కొని ఇంటికి వచ్చాక, అది నచ్చదు. మర్నాడే వెళ్ళి అది తిరిగి ఇచ్చేసి డబ్బులు వాపస్ తీసుకుని వచ్చేస్తుంది” అన్నాడు నవ్వుతూ.
“నేను నాకు కావలసినివి చూసుకునే లోపల, మీ బావ మాత్రం తనకి కావలసిన ఒకటో రెండో చొక్కాలు భుజం మీద వేసుకుని, నా కోసం ఎదురు చూస్తుంటారు” అన్నది రుక్మిణి.
“నీ ఉద్యోగ విజయాలకి, సరైన నిర్ణయాలు, సరైన సమయంలో, సరిగ్గా తీసుకోవటం ఎంతో అవసరం. ఎవరయినా సరే ఒక్కొక్కప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకుంటే, వెంటనే అది గమనించి సరిదిద్దుకుంటారు. అది అవసరం. ఇలాటివి దాస్తే దాగవు. ఇంతకుముందు చెప్పానే, క్రింద పడినవాడికే లేవటం తెలుస్తుంది. అలా లేవకపోతే, కార్పొరేట్ అమెరికాలో మనల్ని త్రొక్కుకుంటూ మిగతా వాళ్ళు ముందుకి వెళ్ళిపోతారు” అన్నాడు కృష్ణ.
“నేనంటే మా వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్సుకి ఎంతో ఇష్టం. అతను నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంటాడు” అన్నాడు అర్జున్.
“అవును. ఒక్కొక్కప్పుడు, ముఖ్యంగా ప్రమోషన్లు ఇచ్చేటప్పుడూ, లాభాలు లేక కొంతమందిని తీసివేయాల్సి వచ్చినప్పుడు, మనకో దేవుడయ్య వుండటం అవసరం. అలా వుంటే, వాళ్ళు అలాటి సమయాల్లో మనకి అండగా వుంటారు” అన్నడు కృష్ణ.
“అమెరికాలో కూడా దేవుడయ్య వుంటాడా? అదేమిటి?” అడిగింది రుక్మిణి.
“అదేలే.. ఆంగ్లంలో గాడ్ ఫాథర్. అలా ఎవరో ఒక దేవుడయ్య మనకి వుంటే, మనల్ని గజేంద్రమోక్షంలో విష్ణువులా అవసరానికీ, ఆపద్ధర్మానికీ ఆదుకుంటారు. ఆయనకు నువ్వంటే సదభిప్రాయం వుంది కనుక, ఆయనతో స్నేహంగా, సఖ్యంగా వుండు. ఏరు దాటానని ఎన్నడూ తెప్ప తగలేయ వద్దు. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో చెప్పలేం. అలాటి వాళ్ళ వల్ల ఎంతో సహాయం తీసుకోవచ్చు. ఇంతటితో మన ఉద్యోగ పర్వం సమాప్తం” అన్నాడు కృష్ణ.
అర్జున్ కృష్ణ చేయి పట్టుకుని, “నీ సహాయం ఎన్నటికీ మరచిపోను బావా. నా ఉద్యోగ విజయాల్లో ప్రతి విజయానికీ నీ పేరే తలుచుకుంటాను. ఇక జయం మనదే!” అన్నాడు.
“నీ ఉద్యోగ విజయాల్లో నా పేరు ఎందుకు మధ్య? ఇక జయం నీదే” అన్నాడు కృష్ణ.
రుక్మిణి నవ్వుతూ అన్నది, “ఇందాక మీ బావ నేను నిర్ణయాలు త్వరగా తీసుకోను అన్నారు కదా. ఆయన్ని చూడగానే వెంటనే ఆయన్నే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, మా అమ్మకి చెప్పేశాను. వాళ్ళేమో ఒక డాక్టర్ని చేసుకోమన్నారు. నేను ససేమిరా అన్నాను”
“అయితే అది త్వరగా తీసుకున్న మంచి నిర్ణయమే కదా. అదే కదా కావలసింది. మరి బావ నీ నిర్ణయాలు సరిగ్గా వుండవంటాడే?” అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వి.
పెద్దగా నవ్వాడు కృష్ణ. “అసలు కథ అది కాదు. ఆ శిశుపాలుడి కన్నా నేనే మంచి మొగుడినని అప్పుడు అక్కడ వాళ్ళ బంధు మిత్ర ప్రజాభిప్రాయం. అందుకే వెంటనే ఒప్పేసుకుంది”
“మధ్యలో ఈ శిశుపాలుడు ఎవరు?” అడిగాడు అర్జున్.
“అదేలే డాక్టర్ అని చెప్పిందే, ఆయన. పీడియాట్రీషియన్. పిల్లల డాక్టర్. అంటే శిశుపాలుడు” అన్నాడు కృష్ణ.
అర్జున్, రుక్మిణి పెద్దగా నవ్వారు.
ఇంతటితో ఈ అమెరికా ఉద్యోగ విజయాలు సమాప్తం.
ఇవి చదివిన వారికీ, చదివి అర్ధం చేసుకున్న వారికీ, అర్ధం చేసుకుని అవసరానికి ఈ విజయ రహస్యాలు పాటించినవారికీ, జయమస్తు! విజయోస్తు!

౦ ౦ ౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked