ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 4

సత్యం మందపాటి చెబుతున్న
అమెరికా ఉద్యోగ విజయాలు – 4
శతకాలతో శతకాలు

మొత్తం మూడు ఇంటర్వూలకు వెళ్ళిన అర్జున్ని, ఒక కంపెనీ వెంటనే పిలిచి ఉద్యోగంలో చేరమన్నది. అదే కృష్ణతో అంటే, ‘మన భారతదేశంలో కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆగవు అనే ఒక సామెత వుంది.
అలగే అమెరికాలో వుంటే, ఉద్యోగమొచ్చినా ఆగదు. శుభం. వెంటనే చేరు’ అన్నాడు.
‘అంతేకాదు బావా, ఉద్యోగం కూడా మీ వూళ్లోనే. వచ్చే సోమవారమే చేరమన్నారు’ అన్నాడు అర్జున్.
‘మరింకేం? తంతే గారెల బుట్టలో పడ్డావన్నమాట. మా ఇంట్లోనే వుండి మీ కంపెనీకి దగ్గరలోనే ఒక ఎపార్ట్మెంట్ ఎతుక్కోవచ్చు’ అన్నాడు కృష్ణ.
‘అది కూడా మా కంపెనీ వాళ్ళే చేశారు. పక్కనే వున్న ఎపార్ట్మెంట్ బుక్ చేశారు. నడిచి వెళ్ళొచ్చు. మా హెచ్చార్ వాళ్ళు ఇలాటి సహాయాలన్నీ చేస్తారు’ అన్నాడు అర్జున్.
శనివారం మధ్యాహ్నం అర్జున్ అక్కడ ఎపార్ట్మెంటులో చేరాడు. కృష్ణ కారులో అతన్ని తీసుకువెళ్ళి అతనికి రోజువారీ కావలసినవన్నీ కొనిచ్చి, అన్నీ ఎపార్ట్మెంటులో పెట్టి, తన ఇంటికి తీసుకు వచ్చాడు.
రుక్మిణి చేసిన వంటల్ని తెగ మెచ్చుకున్నాడు అర్జున్. ‘అక్కా, అక్కా’ అంటూ ఆ కాసేపట్లోనే ఎంతో దగ్గరయిపోయాడు కూడాను.
భోజనానంతరం తీరిగ్గా కూర్చున్నాక, ‘బావా. ఎల్లుండే ఇక్కడ అమెరికాలో నా ఉద్యోగపర్వం మొదలు అవుతుంది. మరి ఈ కార్పొరేట్ కీకారణ్యంలో ఎలా మెలగాలో, ఎలా ఎదగాలో కొంచెం చెబుతావా’ అడిగాడు అర్జున్.
కృష్ణ పెద్దగా నవ్వాడు. ‘ముందు మెలగటం ఎలాగో తెలుసుకో. ఎదగటానికెందుకు అంత తొందర. దానికి ఇంకా సమయం వుంది’ అన్నాడు.
అర్జున్ అలవాటు ప్రకారం తల గుండ్రంగా తిప్పబోయి, ఓ చిరునవ్వు పారేసి, అవునన్నట్టుగా తల పైకీ క్రిందకీ వూపాడు. ఊపుతూ అక్కడే బల్ల మీద వున్న ‘సుమతీ శతకం’ చూసి, ‘ఇదేమిటి బావా, చిన్న పిల్లాడిలా మళ్ళీ సుమతీ శతకం చదువుతున్నావా?’ అన్నాడు.
కృష్ణ కూడా నవ్వి, ‘మళ్ళీ ఏమిటి, ఇలాటి పుస్తకాలు మళ్ళీ మళ్ళీ చదువుతూనే వుంటాను. ఎందుకంటే వీటిలో కొన్ని పద్యాలు, మన వ్యక్తిత్వ వికాసానికే కాక, నీ ఉద్యోగ విజయాలకి కూడా బాగా ఉపయోగపడతాయి.
ఇవాళ శతకాలతో శతకాలు ఎలా కొట్టాలో చెబుతాను’
‘పోయినసారి మాటలే మంత్రాలన్నావు, ఇప్పుడు శతకాలతో శతకాలు అంటున్నావు, నా ఇంగ్లీష్ మీడియం తెలుగుకి ఇవేమీ అర్ధం కావటంలేదు బావా..’
కృష్ణ పెద్దగా నవ్వాడు, ‘అప్పుడు సెహ్వాగ్, యువరాజ్, కపిల్, ద్రావిడ్, లక్ష్మణ్, ధోని, ఇప్పుడు కోహ్లీ క్రికెట్ మేచిల్లో సెంచెరీలు కొడుతున్నారు కదా. అవే శతకాలు కొట్టటం అంటే. మరి మన వేమన శతకం, సుమతి శతకం మొదలైన శతకాల్లో కొన్ని పద్యాలు గుర్తుపెట్టుకుంటే, అవి నీ ఉద్యోగ విజయాలకి అంకురార్పణ చేస్తాయి’
‘వాటిల్లో ఏముంటాయి బావా.. అప్పిచ్చు వాడు వైద్యుడు లాటివే కదా,, అమెరికాలో మన దగ్గర డాక్టర్లు డబ్బు గుంజుకుంటారే కానీ, అప్పులు ఇవ్వరు కదా.. అదీకాక డాక్టర్లు అప్పులివ్వటం మొదలుపెడితే, క్రెడిట్ కార్డు కంపెనీలు దివాళా తీయవూ.. ఆ శతకాలు ఇక్కడ పని చేయవేమో..’ అన్నాడు అర్జున్.
పెద్దగా నవ్వాడు కృష్ణ. ‘ఆ పద్యం మళ్ళీ ఒకసారి చదివితే దాని భావం సరిగ్గా అర్ధమవుతుంది. ఊరికే కాలక్షేపానికి చదవటం వేరు, అర్ధం చేసుకుని అమలు చేయటం వేరు’ అన్నాడు కృష్ణ.
‘మన తాతలు త్రాగిన నేతుల పద్యాలన్నమాట. సరే చెప్పు’ అన్నాడు అర్జున్ సర్దుకు కూర్చుని.
‘సుమతీ శతకంలోని కొన్ని పద్యాలు, ఒక అరడజను మాత్రం చెబుతాను. మిగతావి నువ్వే చదువుకో. భద్రభూపాలుడు అనే రాజుగారు, బద్దెన కవి అని ఆయన కలం పేరులే, ఆయన వ్రాసినదే ఈ సుమతీ శతకం’ కృష్ణ చెప్పటం ప్రారంభించాడు.
‘మనం ఒక్కొక్కప్పుడు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నామా, ఇతరులని ఇబ్బంది పెడుతున్నామా అని కూడా ఆలోచించకుండా, అడ్డదిడ్డంగా మాట్లాడేస్తుంటాం. మన చుట్టపక్కాలు, చుట్టుపక్కల వున్న గాఢ స్నేహితులూ, కొంత నొచ్చుకున్నా, మన గురించి తెలుసు కాబట్టి అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఆఫీసుల్లోనూ, తెలియని కొత్తవారి దగ్గరా ఇలాటి విషయాల్లో జాగ్రత్తగా వుండకపోతే కష్టం. అంతేకాదు తెలుగు వారిలో వున్న గొప్పతనం ఏమిటంటే, ప్రతి దానికీ మనం వాదనలు పెట్టేసుకుంటాం. ఒక్కొక్కసారి అవతలి వారితో అంగీకరించినా, వాదనలు చేస్తూనే వుంటాం. అదో తుత్తి మనకి. దాన్నే బద్దెన ఏమంటాడంటే, ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి, యన్యుల మనముల్ నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అని.
‘నాకు చాలవరకూ అర్ధమైనట్టే వుంది కానీ..’ అర్జున్ పూర్తిగా అర్ధం అవలేదన్నట్టుగా ముఖం పెట్టాడు.
‘అంటే ఏ సమయానికి ఎంతవరకూ అవసరమో తెలుసుకుని, అంతవరకే మాట్లాడి, ఇతరులని తన మాటలతో బాధ పెట్టక, తను నొచ్చుకోకుండా తిరిగేవాడే ధన్యుడు అని అర్ధం. పోయినసారి చెప్పానే, మాటలే మంత్రాలని.. ఇదీ అలాటిదే’ ఆగాడు కృష్ణ.
‘అవును బావా. నోరు జారిన మాట వెనక్కి తీసుకోవటం కష్టం అనేది మా అమ్మ’ అన్నాడు అర్జున్.
‘ఇలాటి సుమతీ సూత్రాలు ఇక్కడ అమెరికాలో ఎన్నో వందల డాలర్లు తీసుకుని ట్రైనింగుల్లో చెబుతారు. మనకేమో అమ్మలూ, నాన్నలూ, బామ్మలూ, తాతయ్యలూ, శతకాలు, కొన్ని మంచి పుస్తకాలు.. ఇవన్నీ చెబుతూనే వున్నాయి. కాని మనం వాటిని ఇటు చులకన చేసీ, అటు భాష రాకా పట్టించుకోం. ఎన్నో పద్యాలు మనం మాట్లాడుకునే విషయానికి అంతగా సంబంధం లేకపోయినా, మనకి ఉపయోగపడే పద్యాలు కూడా ఎన్నో వున్నాయి’ అన్నాడు కృష్ణ.
‘అవును, నిజమే. కొంతమంది నాన్ స్టాపుగా మాట్లాడేస్తుంటారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి?’ ‘వాళ్ళతో మరీ జాగ్రత్తగా వుండాలి. వాళ్ళకి మన చెవులే కావాలి కానీ, మనం చెప్పేది వినరు. ఆగకుండా అలా మాట్లాడేవారి దగ్గర రహస్యాలు ఏవీ దాగవు. అందుకని మనం మనసులోని అన్ని విషయాలు వాళ్ళకి చెప్పటం మంచిది కాదు’ అన్నాడు కృష్ణ.
సాలోచనగా తల వూపాడు అర్జున్.
‘ఇంకొక విషయం ఏమిటంటే, ‘మనం ఇష్టపడే వాళ్ళు ఏ తప్పులు చేసినా, మనతో కొన్ని విషయాల్లో ఒప్పుకోకపోయినా, మనకి వాళ్ళంటే ఇష్టం కనుక పెద్దగా పట్టించుకోము. కానీ మనకి వాళ్ళంటే ఏమాత్రం ఇష్టం లేనప్పుడు, వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా, చక్కటి సలహాలు ఇచ్చినా మనకి అంతగా నచ్చకపోవచ్చు.
అందుకని నీ చుట్టూ వున్న మిగతావారితోనూ, ముఖ్యంగా నీ మేనేజర్లతో స్నేహంగా వుండి, అలా అని మంచి పేరు తెచ్చుకుంటే, వాళ్ళు నిన్ను గౌరవించటం సులభం అవుతుంది. దాన్నే బద్దెనగారు ఏమంటారంటే, ‘కూరిమిగల దినములలో నేరము లెన్నడును గలుగనేరవు, మరి యాకూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!’ అని. అంటే.. ‘
అర్జున్ నవ్వి ‘నువ్వు తాత్పర్యం చెప్పఖ్కర్లేదు బావా. నాకు అర్ధమైందిలే’ అన్నాడు.
కృష్ణ కూడా నవ్వి, ‘చూశావా.. ఇంగ్లీషు మీడియం వాళ్ళకి కూడా అర్ధమయే సులభ శైలిలో ఈ బద్దెన కవి సుమతీ శతకం ఎలా వ్రాశాడో’ అన్నాడు.
అర్జున్ అన్నాడు, ‘నన్ను ఇంటర్వూ చేసిన ప్రొడక్షన్ మేనేజర్ గదిలో ఆయన వెనకాల గోడ మీద ఒక చిన్న బోర్డ్ వుంది. దానిలో ఏం వ్రాసివుందో తెలుసా? Rule number 1: Boss is always right. Rule number 2: If boss is wrong, see rule number 1 అని’
కృష్ణ పెద్దగా నవ్వాడు. ‘అవును. నా ఆఫీసులో నా గోడ మీద కూడా వుండేది అలాటి బోర్డు. అది కొంత సరదాగానే వ్రాసినా, బాస్ చెప్పింది తప్పు అయితే, ఆయన ముఖం మీదే అలా చెప్పకుండా, నొప్పించకుండా చెప్పే పధ్ధతులు వున్నాయి. How to say no అనే ఒక సెమినార్లో నేను అర్ధం చేసుకున్న విషయాలు తర్వాత చెబుతాను. ముందు ఇంకా సుమతీ శతకం ఏం చెప్పిందో చూద్దాం’ అన్నాడు.
రుక్మిణి వచ్చి అక్కడ స్ట్రాబెర్రీలు, మిగతా పళ్ళు వున్న ప్లేట్ పెట్టి, ‘ఉద్యోగంలో చేరక ముందే అతన్ని మీరలా భయపెట్టకండి’ అంది నవ్వుతూ.
‘లేదక్కయ్యా. బావ నాకుపయోగపడే విషయాలే చెబుతున్నాడు. Thanks to him’ అన్నాడు అర్జున్.
‘అయితే నేనెందుకూ ఇక్కడ. లోపల చాల పని వుంది’ అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది.
‘ఏదో మేనేజర్ చెప్పాడు కదా అని, చేయమన్న పనిని తూతూ మంత్రంగా చేసేసి, చేతుల కడిగేసుకునే వారుంటారు. కానీ కొంచెం ఆలస్యమైనా చేయవలసిన పని జాగ్రత్తగా ఆలోచించి, ఒళ్ళు వంచి పని చేస్తే అది సవ్యంగా పూర్తవుతుంది కదూ..’ అన్నాడు కృష్ణ.
‘అవును. ఎవరినో తృప్తిపరచటానికి ఏదో చేసి అయిపోయిందంటే, తర్వాత మనం దాచినవన్నీ బయటికి
వచ్చి, అసలుకే మోసం వస్తుంది’ అన్నాడు అర్జున్.
‘దాన్నే సుమతీ శతకకారుడు ఏమన్నాడంటే, ‘తడ వోర్వక యొడలోర్వక కడు వేగం బడచిపడిన కార్యంబగునే, తడవోర్చిన నొడలోర్చిన జెడిపోయిన కార్యమెల్ల జేకూరు సుమతీ!’ అని. అన్ని సులభంగా అర్ధమయే పదాలే. తడ అంటే ఇక్కడ ఆలస్యం అని అర్ధం’ అన్నాడు కృష్ణ.
‘అవును అర్ధమయింది. కానీ నేను తెలుగు వ్యాకరణం చదువుకోలేదు. మిగతా భాషల్లా కాకుండా తెలుగులో సంధులు, సమాసాలు అక్షరాలను మార్చేస్తుంటాయి కదూ..’ అడిగాడు అర్జున్.
‘నా దగ్గర తెలుగు వ్యాకరణం పుస్తకం వుంది. సమయం దొరికినప్పుడల్లా చదువుకో. ఎప్పుడూ నేనదే చేస్తుంటాను. ఇంకో విషయం ఏమిటంటే.. ఆఫీసుల్లో కొంతమందిని చూస్తుంటాం. చక్కగా నవ్వుతూ, శాంతంగా, స్నేహపూరితంగా మాట్లాడుతూ వుంటారు. అది అమెరికన్ సంస్కృతిలోనే వుంది. కానీ కొంతమంది ముఖం ఎప్పుడూ మటమటలాడుతూ వుంటుంది. దురుసుగానే కాక, కొంచెం కోపంగా కూడా జవాబిస్తుంటారు. వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకి వుండవచ్చు, కానీ అది తోటి ఉద్యోగుల మీద చూపిస్తే ఎలా? దాన్నే బద్దెన కవిగారు ఏమంటారంటే ‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము, తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ అని’ ఆగాడు కృష్ణ.
‘అర్ధమయింది బావా.. ఇక్కడ అందరూ నవ్వుతూ పలకరించడం, ఎంతో తెలిసిన వాళ్ళలా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మంచి కష్టమర్ సపోర్టుకి అది ఎంతో అవసరం. ఈరోజుల్లో స్ట్రెస్ లేని దెవరికి? దాన్ని కోపంగా మార్చుకుని, ఇతరుల మీద చూపిస్తే, అది మనకే అనర్ధం’ అన్నాడు అర్జున్.
‘మా వైస్ ప్రెసిడెంట్ ఒకాయన అలాగే అందరి మీదా అరిచేవాడు. ఆయన్ని యాంగర్ మేనేజ్మెంట్ కోర్సు తీసుకున్నాకనే మా హెచ్చార్ వాళ్ళు ఆ పదివిలో వుంచారు’
‘కొంతమంది నాకు నాలుగు వందల ఏళ్ళ అనుభవం వుంది, నిన్నకాక మొన్న పుట్టావ్. నువ్వు నాకు చెబుతావా? నువ్వెంత అంటుంటారు. మరి వాళ్ళ సంగతో..’ అడిగాడు అర్జున్.
పెద్దగా నవ్వాడు కృష్ణ. ‘అవును. వాళ్ళు ‘యు హౌమచ్ అంటే యు హౌమచ్’ అనే బాపతు. అలా విర్రవీగే వారి గురించి కూడా ఇంకో పద్యం వుంది. ‘బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!’ అని. ఆ బలం భుజబలం కావచ్చు, బుధ్ధిబలం కావచ్చు. అదే డిపార్ట్మెంటులో అనుభవం కావచ్చు. ఇంకా ఏదైనా కావచ్చు. చాల ఉద్యోగాల్లో ఈరోజుల్లో కావలసింది టీం వర్క్. ముఖ్యంగా మాన్యుఫాక్ఛరింగులో అదెంతో అవసరం. అక్కడ నువ్వూ నేను కాదు, మనం అనే భావన ముఖ్యం. రకరకాల అనుభవాలు, తెలిసిన భిన్న విషయాలు, ఆ భిన్న విషయాల్లో ఒక్కొక్కరి వివిధ సూచనలూ.. అన్నీ కలుపుకుంటే, అంతకన్నా బలమైన టీం వుండదు. నాకు తెలియనవి నువ్వు చెబుతావు, నీకు తెలియనిది నేను చెబుతాను. అందుకే చలి చీమలు అన్నీ చిన్నవే అయినా, అన్నీ కలిని బలం పుంజుకున్నప్పుడు ఏదైనా చేయగలవు’ అన్నాడు.
‘అవును బావా. మా కాలేజీలో కూడా టీం వర్క్ మీదే ఎక్కువ చెబుతారు’ అన్నాడు అర్జున్.
అప్పుడే రుక్మిణి అక్కడికి వచ్చి కూర్చోవటం చూసి, అన్నాడు కృష్ణ.
‘మరీ ఆలస్యమవుతున్నట్టుంది నీకు. ఇంకొక్క పద్యం – ఎంతో ముఖ్యమైనది చెప్పి – ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం చేసేద్దాం. మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా సలహాలిచ్చేస్తుంటారు. అనుచితమైనా అవి ఉచిత సలహాలు కదా మరి ఉచితమే! ఏదో మనవాళ్ళు చెప్పారు కదా అని, అవన్నీ ఆచరించేయకుండా, వాటిలోని మంచీ చెడూ ఆలోచించి, మంచిని గ్రహించి, చెడుని దూరంగా పెట్టేవాడే తెలివిగలవాడు. దాన్నే సుమతీ శతకకారుడు ఏమంటాడంటే, ‘వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనె వేగపడక వివరింపదగున్, కని కల్ల నిజం దెలిసిన, మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ’ అని. అర్ధమయింది కదా? అడిగాడు కృష్ణ.
రుక్మిణ నవ్వుతూ అంది, ‘అందులో అర్ధం కానిది ఏముంది. మా కృష్ణ బావ ఏదో చెప్పేస్తున్నాడు, బాగుంది అని అవన్నీ ఆచరించకుండా, వాటిలో మంచీ చెడూ చూసి, నీకు కావలసినవి ఆచరించి, మిగతావి మరచిపో అని అర్ధం’
‘అంటే నేను బామ్మరిదికి పనికిరాని విషయాలు చెబుతున్నాననా నే ఉద్దేశ్యం?’ అన్నాడు కృష్ణ కూడా నవ్వుతూనే.
అర్జున్ వెంటనే అన్నాడు, ‘అదేంఈ లేదక్కా. బావ చెబుతున్న ఉద్యోగ విజయాల కథలు చదివినవారికీ విన్నవారికీ, చవితినాడు చంద్రుణ్ణి చూసినా ఎంతో ఉపయోగపడతాయి. నాకా భయం లేదు’ అన్నాడు.

0 0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked