కథా భారతి

కరోనా కాలంలో కల్యాణ వైభోగం

-డా.కె.మీరాబాయి

“ మన బంధువర్గం లో మీరే పెద్దవారు. పార్వతీపరమేశ్వరుల లాగా వచ్చి ఆశీర్వదించాలి. ముహూర్తం మధ్యాహ్నం పన్నెడు గంటలకు. పన్నెండున్నరకల్లా భోజనాలు.మా కోసం ఒక గంట సేపు శ్రమ తీసుకోండి. ఒంటిగంటకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చును.మా అమ్మాయికి మీ ఆశీర్వచనం కావాలి.” ఎంతో ఆప్యాయంగా పిలిచి, పెళ్ళి పత్రిక చేతిలో పెట్టి నమస్కారం చేసి వెళ్ళారు పద్మనాభం దంపతులు. కరోనా కాలం అయినా, పెద్దవాళ్ళు అయినా వెళ్ళక తప్పదు. ఎందుకంటే పెళ్ళి మండపం ఇంటికి దగ్గరే కూడా. ” ఇంకేం ఆరు నెలలుగా పెట్టెలో గాలి సోకకుండా మగ్గి పోతున్న పట్టు చీర బయటకు తీయవోయ్ ” మంగపతి గారి వేళాకోళం. మరీ ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టడం మానేసారేమో మంగమ్మ గారికీ కాస్త ఉత్సాహంగానే వుంది.

పెళ్ళి రోజు రానే వచ్చింది. సుముహూర్తం సమయానికి అక్కడ ఉండాలని తొందరగానే తయారవ్వడం మొదలు పెట్టారు మంగమ్మగారు. ఇంట్లోనే వుండి నైటీలు వేసుకుని అలవాటై, చీర కట్టుకునేసరికి ఆయాసం వచ్చిందావిడకు. మరీ పేద ముత్తైదువ లాగా పుస్తెల గొలుసుతో పెళ్ళికి వెడితే ఏం బాగుంటుంది అనుకుని కెంపుల నెక్లేసు ధరించి ” ఇక పదండి” అందావిడ. మెల్లిగా నడిచి, వీధి చివరనే వున్న పెళ్ళి మండపం చేరారు. ” రండి రండి. కాళ్ళు తుడుచుకుని లోపలికి రండి” అంటూ ఆహ్వానించారు గుమ్మం దగ్గర నిలబడిన జంట. కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం పూర్వకాలం పద్ధతి. ఈ కాళ్ళు తుడుచుకోవడం ఏమిటో అర్థం కాక సందేహంగా వాళ్ళవైపు చూసారు. “ అదే అమ్మమ్మా! ఈ స్పాంజ్ కాలి పట్టా మీద శానిటైజర్ పోసాము.

అందుకని దానిమీద కాళ్ళు తుడుచుకుని రమ్మంటున్నాము. ” తీయగా చెప్పింది . వాళ్ళెవరో గుర్తుపట్టలేక బిక్క ముఖం పెట్టారు మంగమ్మ, మంగపతి దంపతులు. కాళ్ళు తుడుచుకుని అడుగు ముందుకు వేయగానే ” చేతులు చాపండి తాతయ్యా” అన్నాడు ఆ పిల్ల మొగుడు. పన్నీరు జల్లితే మీద చల్లాలి, గంధం గానీ పూస్తారేమో అనుకుంటూ చేతులు ముందుకు జాపారు . చేతుల మీద శానిటైజర్ చల్లి ” లోపలికి పదండి అన్నారు ఆ గుర్తు చిక్కని దంపతులు. మెల్లిగా ముందుకు నడిచారు ముసలి దంపతులు. అక్కడున్న ఇంకో జంట ” ఆగండాగండి పిన్నీ ” అని అడ్డుపడ్దారు. వీళ్ళను కూడా గుర్తు పట్ట లేకపోయారు మంగమ్మగారు. ఒకరి ముఖం మరొకరు చూసుకుని ఆగిపోయారు మంగపతి గారు, మంగమ్మగారు. ఆ జంట చేతిలో వెండి పళ్ళేలలో రంగు రంగుల పూవులు కనబడ్డాయి. మామూలుగా ఒక గులాబి పువ్వు అందిస్తారు పెళ్ళికి వచ్చిన ఆడవాళ్ళకు. కొత్తరకం పూవులు తెప్పించినట్టున్నారు అనుకున్నారు మంగమ్మగారు. దగ్గరగా వచ్చాక తెలిసింది అవి పూవులు కావని, సిల్క్ పువ్వులు కుట్టిన మాస్కులు అని. తెల్లబోయి చూస్తూ వుండగానే ఈ దంపతుల ముక్కు, నోరు మూసేస్తూ అందమైన డిజైన్ తో వున్న మాస్కులు కట్టారు వాళ్ళు.

“ మంచి జాగ్రత్తలే తీసుకుంటున్నారు.” మాస్కు లో నుంది మంగపతిగారి గొంతు గుస గుస గా పలికింది. ముచ్చటగా మూడో అడుగు వేసేసరికి “ఒక్క నిముషం అత్తయ్యా!” అంటూ మరో జంట వాళ్ళిద్దరికీ తల నుండి కాలి దాకా కప్పి వుంచే పొడవాటి నీలి రంగు గౌను మంగపతిగారికి , మంగమ్మగారికి లేత గులాబి రంగు గౌను ముందునుండి తొడిగి, వెనకాల దారంతో ముడేసి ,” ఇంక వెళ్ళి హాయిగా కూర్చొండి అత్తయ్యా ” అన్నారు. ఇందాకటి నుండి వరుస కలిపి పిలుస్తున్న వాళ్ళెవ్వరినీ తాము గుర్తు పట్టక పోవడానికి ఆ నీలి , గులాబి రక్షణ దుస్తులు , మాస్కులే కారణం అని ఇప్పుడు తట్టింది మంగమ్మ గారికి. గుర్తు పట్టక పోతే కొంప మునగలేదు గానీ తను కష్టపడి కట్టుకున్న పట్టు చీర కనబడకుండా ఇలా హాస్పిటల్ లో వైద్యుల లా గౌనులో దాచేయడం అస్సలు నచ్చలేదు మంగమ్మగారికి. ఇంకా నయం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి తేడా తెలిసేలా గులాబి రంగు, లేత నీలి రంగు అంటూ పెట్టారు ” అనుకుని నిట్టూర్చారు. రోటిలో తల పెట్టి రోకటి పోటుకు వెరవ నేల అనుకుంటూ వెళ్లి కూర్చున్నారు. మొత్తం హాలులో నలభై మందికన్నా లేరు. “పెళ్ళికి వచ్చే అతిధులు యాభై మంది కన్నా వుండకూదదన్న ఆంక్ష పాటించి మంచి పని చేసారు” అన్నారు మంగపతి గారు ఆవిడ వైపుకు వంగి. వీళ్ళు వెళ్ళి కూర్చోగానే ఒక అమ్మాయి, ట్రేలో అందమైన పువ్వుల డిజైన్ వున్న పింగాణీ బౌల్ లో నిండుగ నారింజ రంగు బిళ్ళలు తీసుకువచ్చి వాళ్ళ ముందు ట్రే జాపి నిలబడింది. “ఏమిటమ్మా ఇవి?” అడిగారు మంగపతి గారు. ” సి విటమిన్ బిళ్ళలు తాతయ్యగారు.

అచ్చం నారింజ తొనలు చప్పరించినట్టే వుంటుంది రుచి. వ్యాధినిరోధక శక్తి పెంచి కోవిడ్ రాకుండా కాపాడుతాయిట.” అన్నది ఆ పిల్ల తియ్యని గొంతుతో. ముసలివాళ్ళు ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు.చెరో బిళ్ళా తీసుకుని బుగ్గలో పెట్టుకున్నారు. ” ఎండలు మండి పోతుంటే ,రాగానే చల్లగా షర్బత్ గానీ, కొకాకోలా గానీ ఇవ్వకండా ఈ విటమిన్ బిళ్ళల స్వాగతం ఏమిటండీ? అంటూ మంగమ్మగారు బుగ్గలు నొక్కుకున్నారు. “కరోనా కాలంలో చల్లని డ్రింకులు తాగ ఒద్దంటున్నారు కదా అందుకేమో ” సమర్థించారు మంగపతి గారు. అక్కడున్న నీలి రంగు, గులాబి రంగు రక్షణ దుస్తులు ధరించి వున్న వున్న జంటలు అందరూ పక్క పక్కన కాకుండా మధ్యన ఒక కుర్చీ వదిలి కూర్చున్నారు. అయినా మాటలు సాగుతూనే వున్నాయి. “ ఈ మాస్కులు, రక్షణ కిట్ల కోసం ఆడపెళ్ళి వాళ్ళు రెండు లక్షలు ఖర్చు పెట్టారట.” మంగమ్మగారి కుడివైపు లేతగులాబి రంగు కిట్ లోని ఆడ గొంతు పలికింది. ” ఆడపిల్ల పెళ్ళి అసలే భారం అనుకుంటే ఈ కొత్త ఖర్చు ఒకటా?” అంది పక్కనే వున్న నీలి రంగు రక్షణ కోటులోని మగగొంతు. “ వచ్చిన బంధువులకు చీరలు, పంచలు బదులు ఈ కిట్లు పట్టుకుపొమ్మంటారేమో” నవ్వింది ఆడగొంతు. ఈ సారిఎడమ వైపునుండి మరో సంభాషణ. “మాకు ఇరవై లక్షలు తెలుసా.” అన్న ఒక ఆడ గొంతుకు జవాబుగా ” మావాడి నడిగితే యాభై లక్షలు అన్నాడు” అన్నది ఇంకో కంఠం. “ పిల్లల జీతాల గురించి ఏం గొప్పలు పోతున్నారో చూడండి” మంగమ్మ గారు గుసగుసగా అన్నారు.

“ పిచ్చిమొహమా వాళ్ళు మాట్లాడేది సంపాదన గురించి కాదు. ఇండియాలో, అమెరికాలో కరోనా ఎంతమందికి వచ్చింది అని” మంగపతిగారు నవ్వారు. పెళ్ళి జరిగే వేదిక మీద పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తప్ప, వారి తలిదండ్రులూ, పురోహితుడు కూడా తల నుడి కాలి దాకా గులాబి, నీలం రంగు రక్షణ కోటులు తొడుక్కునే వున్నారు. స్పేస్ సూట్స్ లో చంద్రగ్రహం మీద తిరుగుతున్న మనుషుల్లా కనబడుతున్నారు ఆ రక్షణ దుస్తులలో. “ ఇదేదో గ్రహాంతర ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సభలా వుంది గానీ పెళ్ళి మండపంలా లేదు. ” మంగమ్మగారు గొణిగారు. ” వుష్ . ఏదో వాళ్ళ జాగ్రతలు వాళ్ళు తీసుకున్నారు. పాపం. పెళ్ళికి వచ్చి కోవిడ్ బారిన పడ్డాము అని వాళ్ళకు చెడ్డ పేరు రాకుండా.” మంగపతిగారు సానుభూతిగా అన్నారు. వధూవరులు మాస్కులతో ముక్కూ మూతీ మూసేసి వున్నా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ మూడు ముళ్ళూ పడ్డాక, చదివింపు తంతు.

కళ్ళు తప్ప మిగతా ముఖం కనబడకుండా మాస్కులు, తలనుండి కాళ్ళ దాకా రక్షణ కోటులు వేసుకున్న అతిధులను ఎవరని గుర్తించడం కష్టం గనుక, వాళ్ళ ఆధార్ కార్డ్ చూపించమని, పేరు, వూరు రాసుకుంటున్నారు చదివింపుల అందుకుని లెఖ్ఖలు రాసుకుంటున్న వాళ్ళు. “ ఇందుకా వీళ్ళు ఆధార్ కార్డ్ తెచ్చుకోమన్నది!” అని ఆశ్చర్యపోయారు మంగమ్మగారు. తరువాత భోజనాల గది వైపుకి నడిచారు. వచ్చిన వాళ్ళను భోజనాల బల్లల దగ్గరికి వెళ్ళనివ్వకుండా, చెతులు కడుక్కునే సింకులు వున్న వైపుకు నడిపిస్తున్నారు అక్కడ వున్న వాళ్ళు. “ కుళాయిలను, సబ్బు సీసాను ముట్టుకోకండి. దానికింద చేయి జాపండి చాలు.” “ అని ప్రతి సింకు పైన రాసి వుంది. అలాగె చేయి జాపితే చేతిలోకి సబ్బు నురగ, సింకులో నీళ్ళు వచ్చాయి. “ఇదేదొ మాయాబజారులా వుంది” అని ఒక గులాబి రంగు కోటు అంది. ” ఇక్కడ కొత్తగా చుస్తున్నారేమో గానీ అమెరికాలో రెస్ట్ రూములలో ఇదే పద్ధతి.” మంగమ్మగారు గర్వంగా అన్నారు, అమెరికా తనదే అన్నంత ధీమాతో. ” అంతేకాదు టాయిలెట్స్ కూడా మనం కూర్చుని లేవగానె వాటికవే అవే శుభ్రం అయిపోతాయి.” వుత్సాహంగా చెప్పారు మంగమ్మగారు న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ గుర్తుచేసుకుంటూ. ఈ సంభాషణ ఎక్కడకు పోతుందో అని భయపడి ” అమెరికా సంగతి సరే ఆకలి మాట చూదాము” అంటూ ఆవిడ భుజం తట్టారు మంగపతిగారు. “ అన్నయ్యగారు మీ ఆవిడ అటు “ అంది ఆ ఆ భుజం తాలూకు పింక్ కోటు. “ఎర్రచీర కట్టుకున్నదే నాభార్య అన్నాట్ట మీలాటివాడు పదండి “ అంటు ఆయన చేయి పట్టుకుని లాక్కుపోయింది మంగమ్మ గారు.

అక్కడ అరిటాకులు వేసి వడ్డించడం చూసి మురిసి పోయారు మంగమ్మ మంగపతి దంపతులు. “ఒకరు తిన్న కంచాలు కడిగి మళ్ళీ మరొకరికి వడ్డించడం కన్న, పూర్వీకుల పద్ధతిలో ఆకుల్లో పెట్టడం ఆరోగ్యమని తెలిసింది మనవాళ్ళకు.” ఒక బల్ల ముందు కూర్చుంటూ అన్నారు మంగపతిగారు. ఒకాయన అందరి ముందున్న అరటాకుల మీద పసుపు నీళ్ళు జల్లి పోయాడు.ఇంకో అతను తాగడానికి పసుపు కలిపిన వేడినీళ్ళ సీసాలు ఒక్కో ఆకుముందు పెట్టి పోయాడు. “ పసుపు క్రిమి నాశని, పసుపు కలిపిన నీళ్ళు తాగితే జలుబు,కఫము దరి చేరవు అంటారు కదా అందుకని కాబోలు” మంగపతిగారు అన్నారు. “ పెద్దమ్మగారూ! అమెరికాలో కూడా పసుపు, మిరియాలు వాడతారా? మంగమ్మగారికి అటుపక్కన వున్న ఆవిడ అడిగింది.

” ఎందుకు వాడరూ? అసలు అక్కడ వాల్ మార్ట్ లో దొరికినంత స్వచ్చమైన పసుపు మనకు ఇండియాలో దొరకదు. అంతెందుకు అమెరికాలో అక్కడి గుళ్ళలో హోమానికీ, ఇళ్ళలో గృహప్రవేశానికి ఆవు పేడ, పిడకలు, ఆవు పంచితం కూడా దొరుకుతాయి ” మంగమ్మగారు విజృంభించారు. మంగపతిగారు ఆవిడను చిన్నగా గిల్లారు చాలు అన్నట్టు. “ బాబాయిగారు మీ ఆవిడ అటు “ అంది పడుచు గొంతు. ” ఏమిటీ ముసలి వయసులో ఈ వేషాలు?” అంటూ ఆయన డొక్కలో పొడిచింది మంగమ్మగారు. “ నాకు ఈ చెవి వినబడదు కదే “ అన్నాడాయన నడుము తడుముకుంటూ. వడ్డన ప్రారంభమయ్యింది. వడ్డించే వాళ్ళంతా కూడా మూతికి , చేతికి తొడుగులు, తలను ఒంటిని కప్పుతున్న పొడుగాటి రక్షణ కోటులూ ధరించే వున్నారు. ఒకాయన వచ్చి అందరికీ ఆకు కొసన శొంఠి పొడి వేసాడు. మరొకాయన దాని పక్కనే కాస్త మిరియాల పొడి వడ్డించాడు.

ఇంతలో చక్రాల బండి మీద పెద్ద గుండిగ తోసుకుంటూ మరొక మనిషి, అతని వెన్నంటి డబరాల వంటి గిన్నెల దొంతర పట్టుకుని మరొకడు కనబడ్డారు. గిన్నెలు మోసుకు వస్తున్న ఆయన ఒక్కొక్క అతిధి ముందు ఆగి గుండిగలో నుండి మర్లుతున్న నీరు డబరాల్లో ముంచి ఆకుల పక్కన పెడుతూ పోయాడు. భోజనాల గది అంతా ఒక్కసారిగా నీలగిరి తైలం వాసన అలముకుంది. అప్రయత్నంగానే అందరూ ముక్కులు ఎగపీల్చుకున్నారు. “పెద్ద హొటెళ్ళలో తిన్నాక చేయి కడుక్కోడానికి నిమ్మ బద్ద వేసిన వేడినీరు పింగాణీ సాసర్లో తెచ్చిపెడతారు గానీ పెళ్ళిళ్ళలో ఇలాటి విడ్డూరం చూడలేదు” అంది మంగమ్మ గారికి గజం దూరంలో కూర్చున్న పక్కావిడ. ” నీరు చల్లారక ముందే ఆవిరి పట్టుకోండి ఇది మీ మంచికోసమే” అని చెబుతూ ముందుకు నడుస్తున్నాడు గుండిగ వ్యక్తి.

అంతవరకు వూపిరి బిగపట్టి చూస్తున్న అందరూ హా అని ఆశ్చర్య పోవడంతో భొజనాల హాలు హా హా లతో నిండింది. అందరూ బుద్ధిమంతులైన బడిపిల్లల లాగా మూతి మీది మాస్కులు తప్పించి వేడి నీటి ఆవిరి పీల్చుకున్నారు. వెంటనే ఆ గిన్నెలు తీసేసి, ఇక వరుసగా పాయసం , కూరలు, బూరెలూ, అన్నం, పప్పు అన్ని ఆకు నిండా వడ్డించారు. ” అయ్యా, అమ్మా! అందరూ దయచేసి మొదటి ముద్ద శొంటిపొడి తోను, రెండో ముద్ద మిరియాల పొడితో తిన్నాకనే పాయసం వగైరాలు తినవలసిందని కోరుతున్నాము.” అంటూ మైకులో చెప్పారు. పక్కవాళ్ళు అలా చేస్తున్నారా లేదా అని ఒకరినొకరు గమనిస్తుండడం వలన అందరూ కళ్ళు మూసుకుని ఆ రెండు ముద్దలూ తిని, అసలు భోజనం మొదలు పెట్టారు. భోజనాలు అయ్యాక, బయటకు వచ్చిన అందరికీ తమలపాకుల బదులు రెండు తులసి దళాలతో బాటు , చెరీ మూడేసి లవంగాలు కూడా అందించారు.

ఇళ్ళకు బయలుదేరుతున్న బంధువులకు పెళ్ళి తాంబూలంగా బట్టలు పెట్టే ముందు చెరీఒక శానిటైజర్ సీసా ఇచ్చి, అది చేతులకు పూసుకున్నాక పాకెట్ అందించారు. పెళ్ళిమండపం బయటకు వెళ్ళే వాళ్ళను మొదటిలాగే ఒక జంట పొడుగాటి రక్షణ కోటును విప్పి తీసుకుంటే, తరువాతి జంట మాస్కులను తీసుకుని ” శ్రమ తీసుకుని వచ్చారు. ధన్యవాదాలు. జాగ్రత్తగా వెళ్ళండి.” అంటూ వీడ్కోలు పలికారు. హమ్మయ్య అని హాయిగా వూపిరి పీల్చుకున్నారు మంగమ్మ గారు, మంగపతిగారు. ” అమ్మో ఈ కరోనా కాలంలో కల్యాణ వైభోగం బాగానే వుంది. ” అనుకుంటూ ఇంటి దారి పట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

2 Comments on కరోనా కాలంలో కల్యాణ వైభోగం

Saroja said : Guest 4 years ago

Karona pelli katha baagundi.

  • Toronto
Saroja said : Guest 4 years ago

Karona pelli katha baagundi.

  • Toronto