పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

అనివార్య కారణముల వలన గత కొన్ని మాసములుగా ఈ శీర్షికను ప్రచురించ వీలుపడలేదు. అందుకు క్షంతవ్యుడను. ఇకపై నిర్విరామముగా నిర్వహించడానికి ప్రయత్నిస్తాను. నెలెనెలా పూరణలతో మీ ప్రోత్సాహమును కొనసాగిస్తారని ఆశిస్తూ..

2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేస్తూ వచ్చిన పద్యములు

తల్లాప్రగడ రామచంద్ర రావు, శేన్ హొసే, కాలిఫోర్నియా
సీ.
గుండెలు పిండిన రెండువేలయిరువై -వీడుకోలును పల్కి వెళ్ళువేళ,
పండుగేగామరి యెండివేసారిన -వారికి చివరికి యూరటవ్వ!
క్రుంగదీసిన వ్యాధి కోవిడ్డునామక – రక్కసిన్ దునిమి తోలంగ రమ్ము
కొత్త యాశలె చిగురెత్తి టీకాలుయై – వచ్చువేళ యిదిరా వరముగనుమ
తే.గీ.
మంచిరోజుల మూటలన్ పంచగోరి
సర్వజనులకు సుఖశాంతిసౌఖ్యమిచ్చు
రెండువేలిరవైయొకటుండెమనకు
రండు యాహ్వానమివ్వుండు రామచంద్ర

పోచిరాజు కామేశ్వర రావు, రాయపూర్ , ఛత్తీస్ఘఢ్
మ.
ద్విసహస్రోత్తర వింశ తీరిత మహా విధ్వంస కీటమ్ములన్
వెస సంహారము సేసి నూతన సమావిష్టమ్ము తోరమ్ముగా
నొసఁగంగా వలె లాఘ వాయువుల నుద్యోగప్రమోదమ్ములన్
లస దాదాయ సమగ్ర విద్యలను మిత్రత్వమ్ము విశ్వమ్మునన్

గాదిరాజు మధుసూదన రాజు, తాడిపత్రి అనంతపురం జిల్లా
మహాస్రగ్ధర.
పిలువంగన్ కష్టమొక్కో ప్రియత ములనుసత్ప్రేమ లొప్పన్ వివాహా
దులకున్కాలంబుమారెన్ దురితములొదవెన్దుర్భరంబౌచు చైనీ
యులునీచాహారపానీయుల యుతివలనన్  యుక్తసామీప్యతన్ దు
ష్ఫలమిట్లుండున్ సమీపింపఁసుజనుల  మహాపాపులాశ్చర్యమేలా?

భైరవభట్లశివరామ్, కొక్కిరాపల్లి
ఆ.వె.
కొత్తరోగమొకటి కొలువుదీరెనుగాదె
అన్నిదేశములకునల్లుకొనచు
మట్టుబెట్టుచుండె మరణమృదంగమై
మనుజజాతినంత మహినినేడు
ఆ.వె.
ఆంగ్లవత్సరంబె నరుదెంచెమరల
ఆదుకొనుచుమనల నరలజేయ
కరుణజూపుచుండు కరొనాయురాకుండ
కామ్యమేదిలేదుకలతమాపు
ఆ.వె.
ఇరువదొకటివచ్చె నింపునుగూర్చంగ
యిరువదేమొవెడలె నిలనువీడి
కలిమిదేశములకుకలతనుపోగొట్టి
మంచిచేసినీవుమన్ననొందు
ఆ.వె.
మసకబారనీకుమనుజజన్మంబును
శుచియుశుభ్రతయును శుభమునిచ్చు
అంటురోగమేదినంటనీయకనుండు
ముందుభవితనీకుముచ్చటగును
ఆ.వె.
ఆస్తిపాస్తులున్న అక్కరమాస్కుయు
చేతిసుబ్బరంబు చెలిమియయ్యె
సహజదూరమెపుడుసంతసమివ్వంగ
మార్పుకూడమనకుమంచిచేయు

టేకుమళ్ళ వెంకటప్పయ్య
ఉ.
ఎన్నడు గాంచరీ జనము యేడుపు కేకలె మిగిలెనక్కటా
చిన్నగ కోవిడై పెరిగి చీలెను దేశము రాకపోకలన్
పున్నమి కాంతులున్ విడచి బూర్తిగ చీకటె విశ్వమంతటన్
కన్నుల గానుపించకను కమ్మెను ఖేదము వత్సరమ్మునన్
ఉ.
నూతన వత్సరమ్మునకు నుత్సుక  వేచిరి లోకమంతయున్
భూతల మంతయున్ విరిసి బూయునె బువ్వులు నవ్వులంతటన్?
మూతుల గుడ్డలున్ దొలగి ముక్కులు బీల్చునె శీతవాయువుల్?
పాతవి సాంప్రదాయములు పాడని దల్చక మేలుదల్చుమా!

వారణాశి సూర్యకుమారి, మచిలీపట్నం
సీ.
నవరాగ భరితమై నవనవో న్మేషమై – వచ్చెను నూతన వత్సరమ్ము
పిల్లపాపల గూడి ప్రీతిగ గడుపగ – వరమిడు నీవత్సరమ్ము
గతముకరోనాను గడబిడలు మరచి – సంతసమ్ముగ నుండు  సమయమగును
బంగరు భవితను భాగ్యమ్ము నందించి – తులలేని రీతిని తృప్తి నొసగు
ఆ.వె.
కార్య దీక్ష కలిగి ఘనముగ విధులను
సానుకూల పఱచి సమయమంత
విజయ పథము నడిపి విఖ్యాతి నరయగా
సుఖము శాంతి యమరి శుభము లొందు

చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
ఆ.వె.
చేయి కలుప లేము చెంత నిలువ లేము
పరుగు బతుకు నంత పట్టి నిలిపె
కొంటె జబ్బు చేరె కోవిడ్ గ జనులెల్ల
మనిషి మమత విలువ మనకు తెలిసె
ఆ.వె.
కష్ట కాలమింక కరిగిపోవు మనకు
నిర్భయముగ తిరుగు దినము తెచ్చు
కొత్త వత్సరమ్ము కోరికలింపొంద
శుభము గూర్చు జనుల స్ఫూర్తి నింప
ఆ.వె.
మదిని దాగు మంచి మనసైన మనుషుల
తలిచి చెప్పు మమత తరుణ మిదియె!
కొత్త వత్సరాన కోరగ కలుగును
శుభము లింక మనకు సుందరముగ

చావలి శివప్రసాద్, సిడ్నీ, ఆస్ట్రేలియా
వివరింపన్నదివిశ్వమారిగద! తత్ వైరస్ ప్రమాదంబునై
అవనిన్ లోకుల భీతిగొల్పి గృహ నాహంబందు నన్నుంచగన్
చివరన్ నూతనవత్సరంబిపుడు వేంచేసెన్ గదా మాకు యీ
నవవర్షంపుశుభాగమంబున కరోనా టీక సిద్ధింపగన్

ఈ మాసం ప్రశ్న:
గెల్వగఁ నేడ్చెనొక్కడును గెల్వక నోడినవాడు నవ్వగన్
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
చుట్టములను కలసినంత సుఖములు తగ్గున్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ U.S.
కం.
పట్టము గట్టిరి నేతకు
గట్టిగ పట్టెను హితులట కదలక యుండన్
వట్టిగ తినికూ ర్చొనుటకు
చుట్టము లను కలసి నంత సుఖములు తగ్గున్
ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాదు
కం.
పట్టణ వాసము కలవడి,
గుట్టుగ తమ బ్రతుకు నీడ్చు కొంపల లోనన్,
తట్టుకొనుటెంతొ కష్టము,
చుట్టములను కలసినంత సుఖములు తగ్గున్.
కం.
ముట్టీ యంటని బంధము
లట్టుల, యవసరము మీర, యందరి తోడన్
నట్టువ మాడెడు వారికి,
చుట్టములను కలసినంత సుఖములు తగ్గున్.
కం.
గిట్టని మనుషులు చెప్పిరి,
‘చుట్టములను కలసినంత సుఖములు తగ్గున్’
ఒట్టి యబద్ధము లట్టివి,
అట్టుల సూత్రీకరింప యన్యాయంబౌ.
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
కం.
గుట్టుగ కాపురము సలుపు
నట్టి కుటుంబమును గాంచి నంతనె  యీశున్
గట్టిగ బాధను  పెట్టెడు
చుట్టములను కలిసినంత సుఖములు తగ్గున్

గాదిరాజు మధుసూదనరాజు, అనంతపురము
కం.
చట్టముమెచ్చని పని చే
పట్టుచులాభములబొంది బంధుత్వముచూ
పెట్టి విసిగించు చుండెడి
చుట్టములను కలసినంత సుఖములు తగ్గున్

ఇట్టవేని రాకేష్, సిద్ధిపేట.
కం.
కట్టాలు లేక కన్నులు
కుట్టే కాపురము గల్గు కోడలి కనగాన్
గిట్టకను వెక్కిరించే
చుట్టాలను గలిసినంత సుఖములు తగ్గున్.
కం.
కొట్టగ బూనెను పతియని
కట్టము బెట్టెను కొడుకని కడు వాపోవన్
రెట్టింపు వెక్కిరించే
చుట్టాలను గలిసినంత సుఖములు తగ్గున్.
కం.
ఎట్టికి పని సేయించుకొ
నెట్టేనియు సొమ్ము బాగుగెన్నో మూటల్
కట్టే ధనవంతులు నౌ
చుట్టాలను గలిసినంత సుఖములు తగ్గున్.
కం.
అట్టిటు లున్నవి కూరలు
అట్టే రొట్టెల రస,పస అరయగ లేదం
చెట్టేనియు వంక పెట్టు
చుట్టాలను గలిసినంత సుఖములు తగ్గున్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked