పద్యం-హృద్యం

పద్యం – హృద్యం

నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
పంచెఁ గట్టు టిపుడు ఫ్యాషనాయె
ఇంతకు ముందు యిచ్చిన ప్రశ్న:
సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్

ఈ ప్రశ్నకు పూరణలు మాకు అందిన క్రమములో యిలా వున్నాయి.

ఎం.వి.యస్. రంగనాధం, హైదరాబాద్
(1) కం.
హంసగమన యనె, రంగ ని
నంసాగుణము విడి, విప్ర నారాయణ, నా
సంసేవ జేయ, తోడనె
సంసార సుఖంబులబ్బు, సన్యాసి కిలన్.
(2) కం.
కంసారి, యతియగు నరో
త్తంసుని గేరెను, సుభద్ర దరి, ఖాండవ వి
ధ్వంసకుడగు నీ రాకను,
సంసార సుఖంబులబ్బు, సన్యాసి కిలన్.
మద్దాలి స్వాతి, రెడ్వుడ్ సిటీ, కాలిఫోర్నియా
చిరువోలు విజయ నరసింహా రావు, రాజమహేంద్రవరము
(1) కం.
సంసార సాగరమున, ప్ర
శంసల నందగ శ్రమపడ సత్ఫలమబ్బున్
సంసారము వీడనెటుల
సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్!
(2) కం.
సంసారికి సతిఁ గూడిన
సంసార సుఖంబులబ్బు – సన్యాసికిలన్
సంసార సుఖమె దక్కదు
కంసారిని గొల్వ ముక్తి కాంత లభించున్!
(3) కం.
సంసారమె మేలనుచును
సంసారిగ మారె యోగి సఖి సంతతితో
సంసారాంబుధి తనియగ
సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్!
చిరువోలు  సత్య ప్రసూన, న్యూ  ఢిల్లీ
(1) కం.
సంసారమె ఝంఝాటము
సంసారి సుఖము బడయుట సహజంబు గదా!
సంసారి – కపట యోగికి
సంసార సుఖంబులబ్బు, సన్యాసికిలన్!
(2) కం.
ఓం సత్యసాయి యనుచును
ఓం సాయీ నాధయనుచు నొప్పగ భక్తిన్
సంసేవల కామరహిత
సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్!
(3) కం.
సంసారులు సుఖపడుదురు
సంసర్గము బంధమయ్యు సతమతమగుచున్
సంసారము వీడ, కలలన్
సంసార సుఖంబులబ్బు, సన్యాసికిలన్!
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
సంసారమున విరక్తిని
సంసారము పర్యటించ సాగినతోడన్
సంసర్గము వీ డ నెటుల
సంసార సుఖంబు లబ్బు సన్యాసికిలన్ ?
మద్దాలి స్వాతి, ఫ్రీమాంట్, కాలిఫోర్నియా
కం.
ఓం సవ్వడి మనమందున
శంసించుచు, సర్వ జనుల సౌఖ్యము కొరకై
హంసవగ, పార లౌకిక
సంసార సుఖంబులబ్బు, సన్యాసి కిలన్.
పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
కం.
హింసగదా ఆషాడము
సంసారికి – వేషమేసి సన్యాసిగ ను
త్తంసుడు తాఁ సతిని జేర
సంసార సుఖంబులబ్బు సన్యాసికిలన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked